'ఒక మనసు' మూవీ రివ్యూ | Oka Manasu Movie Review | Sakshi
Sakshi News home page

'ఒక మనసు' మూవీ రివ్యూ

Published Fri, Jun 24 2016 12:28 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

'ఒక మనసు' మూవీ రివ్యూ

'ఒక మనసు' మూవీ రివ్యూ

టైటిల్ : ఒక మనసు
జానర్ : రొమాంటిక్ డ్రామా
తారాగణం : నాగశౌర్య, నిహారిక, రావూ రమేష్, ప్రగతి
సంగీతం : సునీల్ కశ్యప్
దర్శకత్వం : రామరాజు
నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి

ఇటీవల కాలంలో సార్ట్ వారసుల హవా బాగా కనిపిస్తుండటంతో అదే బాటలో మెగాఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చింది కొణిదల నీహారిక. నాగబాబు కూతురిగా, పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న నీహారిక, తొలిసారిగా ఒక మనసు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. మరి వెండితెర మీద మెరసిన తొలి మెగా వారసురాలు ఆకట్టుకుందా..? హీరోయిన్ గా సక్సెస్ కొట్టాలన్న నీహారిక కల నెరవేరిందా..?

కథ :
సూర్య (నాగశౌర్య)  రాజకీయ నాయకుడు కావాలన్న ఆశతో విజయనగరంలో సెటిల్మెంట్స్ చేస్తూ తిరిగే అబ్బాయి. సూర్య మామయ్య ఎమ్మెల్యే కావటంతో ఏ రోజుకైనా సూర్యను కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలని కలకంటుంటాడు సూర్య తండ్రి (రావు రమేష్). విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో హౌస్ సర్జన్గా చేస్తున్న సంధ్య (నీహారిక), సూర్యని తొలి చూపులోనే ఇష్టపడుతుంది. తరువాత ఆ ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. అదే సమయంలో తన రాజకీయ అవసరాల కోసం ఓ పెద్ద సెటిల్మెంట్ ఒప్పుకున్న నాగశౌర్య చిక్కుల్లో పడతాడు. నమ్మకద్రోహం కారణంగా కోర్టు కేసులో ఇరుక్కుని మూడేళ్లపాటు జైలులో ఉంటాడు. ఆ తరువాత బెయిల్ వచ్చినా కేసు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరోసారి సంధ్యకు దగ్గరవుతాడు సూర్య. కానీ తన తండ్రి కలను నెరవేర్చటం కోసం ఈ సారి సంధ్యకు శాశ్వతంగా దూరం కావలసిన పరిస్థితి వస్తుంది. మరి సూర్య నిజంగానే సంధ్యను దూరం చేసుకున్నాడా.? సూర్య వదిలి వెళ్లిపోవటానికి సంధ్య అంగీకరించిందా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
ఇప్పటి వరకు లవర్ బాయ్ పాత్రల్లో కనిపించిన నాగశౌర్య ఈ సినిమాలో కాస్త పర్ఫామెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో తండ్రి కల, అమ్మాయి ప్రేమకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు. తొలిసారిగా వెండితెర మీద మెరిసిన నిహారిక పరవాలేదనిపించింది. లుక్స్ పరంగా హుందాగా కనిపించిన నిహారిక, నటన పరంగా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. తండ్రి పాత్రలో రావూ రమేష్ మరోసారి ఆకట్టుకున్నాడు. కొడుకు భవిష్యత్తు కోసం తపన పడే తండ్రిగా రావూ రమేష్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. ఫ్రెండ్ పాత్రలో అవసరాల శ్రీనివాస్, చిన్న కామెడీ పాత్రలో వెన్నెల కిశోర్ తమ పరిధి మేరకు మెప్పించారు.


సాంకేతిక నిపుణులు :
నీహారికను హీరోయిన్గా ఎంచుకొని సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు రామరాజు, మరోసారి తన మార్క్ పోయటిక్ టేకింగ్ తో ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ స్లో నారేషన్ కాస్త ఇబ్బంది పెట్టినా.. రిచ్ విజువల్స్,  మ్యూజిక్ ఆకట్టుకుంటాయి, సినిమా చాలా వరకు హీరో హీరోయిన్ల మధ్య మాటలతోనే నడిపించిన దర్శకుడు, డైలాగ్స్ పై మరింతగా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం, రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం ఆకట్టుకుంటాయి. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. వైజాగ్ బీచ్ అందాలను, అరకు పచ్చదనాన్ని మరింత అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫీ
మెయిన్ స్టోరీ
ప్రీ క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :
స్లో నారేషన్
డైలాగ్స్
 


- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement