'ఓం నమో వేంకటేశాయ' మూవీ రివ్యూ | Om Namo Venkatesaya Movie Review | Sakshi
Sakshi News home page

'ఓం నమో వేంకటేశాయ' మూవీ రివ్యూ

Published Fri, Feb 10 2017 2:37 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Om Namo Venkatesaya Movie Review

టైటిల్ : ఓం నమో వేంకటేశాయ
జానర్ : చారిత్రక భక్తిరస చిత్రం
తారాగణం : నాగార్జున, అనుష్క, సౌరభ్ జైన్, రావూ రమేష్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
దర్శకత్వం : కే.రాఘవేంద్రరావు
నిర్మాత : ఎ.మహేష్ రెడ్డి

అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడిసాయి లాంటి భక్తిరస చిత్రాలను అందించిన నాగార్జున, కే. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన మరో భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని హథీరాం బాబాజీ జీవితకథను తిరుమల కొండ విశేషాలను తెలుగు ప్రజలకు పరిచయం చేసే ఆలోచనలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను, భక్తజనులను ఎంత వరకు అలరించింది..? నాగ్ మరోసారి పరమ భక్తుడిగా ఆకట్టుకున్నాడా..? డివోషనల్ చిత్రాలను తెరకెక్కించటంలో తనకు తిరుగులేదని ఇప్పటికే నిరూపించుకున్న దర్శకేంద్రుడు మరోసారి  మెప్పించాడా..?


కథ :
రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ(నాగార్జున) చిన్నతనం నుంచి దేవుణ్ని చూడాలనే కోరికతోనే పెరుగుతాడు. ఆ ఆశయంతోనే ఇళ్లు విడిచి వెళ్లి అనుభవానంద స్వామి ( సాయికుమార్)దగ్గర శిష్యరికం చేస్తాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఓంకార జపం చేస్తూ కఠోర తపస్సు చేస్తాడు. అలా ఏళ్లు గడిచిపోతాయి. రామ భక్తికి మెచ్చిన వేంకటేశుడు, వటపత్రశాయిగా వచ్చి బాలుడి రూపంలో రామ తపోభంగం చేస్తాడు. అయితే బాలుడి రూపంలో వచ్చినది ఆ దేవదేవుడే అని గుర్తించ లేని రామ ఆగ్రహంతో వెళ్లిపొమ్మని శాసిస్తాడు.

ఆ బాధలో ఇంటికి వెళ్లిన రామానికి, మరదలు భవాని (ప్రగ్యాజైస్వాల్) తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు పెద్దలు. కానీ భగవంతుడిని దర్శించటమే తన జీవితాశయం అని భవానికి నచ్చజెప్పి తన ప్రయాణం మొదలు పెడతాడు. గురువు ద్వారా ఆ రోజు తన తపోభంగం చేసిన ఆ బాలుడే తాను చూడాలనుకుంటున్న బాలాజీ అని తెలుసుకొని తిరుమల కొండపైకి చేరుకుంటాడు.  కొండమీదే ఆశ్రమంలో ఉండే కృష్ణమ్మ (అనుష్క) సాయంతో అధికారం చెలాయిస్తూ వెంకటేశ్వరుని సొమ్మును దోచుకుంటున్న గోవిందరాజులు (రావూ రమేష్) ను ఎదిరిస్తాడు.

కొండపైన జరుగుతున్న అన్యాయాలను మహారాజు (సంపత్ రాజ్)కు వివరించి గోవిందరాజులను పదవి నుంచి తప్పించి తిరుమల బాధ్యతలు స్వీకరిస్తాడు. అలా ఆ వేంకటేశుడి సేవకుడిగా మారిన రామ, హాథీరాం బాబాజీగా ఎలా మారాడు. కొండ మీద ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు. స్వామిని స్వయంగా చూడాలన్న రామ కోరిక ఎలా తీరింది అన్నదే మిగతా కథ.


నటీనటులు :
ఇప్పటికే అన్నమయ్య, రామదాసుగా అలరించిన నాగార్జున హాథీరాం బాబాజీ పాత్రలో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఈ తరంలో భక్తుడి పాత్రలకు తాను తప్ప మరెవ్వరూ న్యాయం చేయలెరన్న స్థాయిలో ఉంది నాగ్ నటన. అమాయకత్వం, ఆవేశం, కరుణ, భక్తి ఇలా అన్ని రసాలను అద్భుతంగా పలికించి హాథీరాం పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. బుల్లితెర మీద ఇప్పటికే దేవుడిగా కనిపిస్తున్న సౌరభ్ జైన్, వెండితెర మీద మరింత అందంగా కనిపించాడు. లుక్స్ పరంగా అద్భుతం అనిపించిన సౌరభ్, నటన విషయంలో ఇంకాస్త దృష్టి పెడితే బాగుండనిపించింది. కృష్ణమ్మ పాత్రలో అనుష్క నటన బాగుంది. కొండకు చేరిన భక్తుడికి సరైన మార్గం చూపించే పాత్రలో హుందాగా కనిపించింది. విలన్ గా రావూ రమేష్ తనకు అలవాటైన నటనతో మెప్పించాడు. ఇతర పాత్రల్లో సంపత్ రాజ్, రఘుబాబు, సాయికుమార్ తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.


సాంకేతిక నిపుణులు :
నాగార్జునను అన్నమయ్య, శ్రీ రామదాసుగా చూపించి మెప్పించిన రాఘవేంద్రరావు, ఈ సారి హాథీరాం బాబాజీగా చూపించారు. చరిత్రలో హాథీరాంకు సంబంధించిన విషయాలు పెద్దగా లేకపోయినా.. ఉన్న కొద్ది పాటి సమాచారంతో గొప్ప చిత్రాన్ని రూపొందించారు. అందుకు తగ్గట్టుగా కల్పిత పాత్రలను జోడించిన  రచయిత భారవి, చరిత్రలో ఔచిత్యం ఏ మాత్రం దెబ్బ తినకుండా జాగ్రత్త పడ్డారు. రాఘవేంద్రుడి ఆలోచనలను మరింత అందంగా తెరమీద ఆవిష్కరించాడు సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి. ముఖ్యంగా వందల ఏళ్లనాడు తిరుమల గిరులు ఎలా ఉండేవో.. ఎంత పచ్చదనం ఉండేదో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇతర సాంకేతికాంశాలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఓవరాల్ గా  ఓం నమో వేంకటేశాయ, తిరుమల విశిష్టతను, హాథీరాం బాబా గొప్పతనాన్ని తెలిపే భక్తిరస చిత్రం

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement