ఇక సినీ వెల్లువ | Onam releases postponed to September due to Kerala floods | Sakshi
Sakshi News home page

ఇక సినీ వెల్లువ

Published Tue, Aug 28 2018 12:02 AM | Last Updated on Tue, Aug 28 2018 12:04 AM

Onam releases postponed to September due to Kerala floods  - Sakshi

వరద విలయం సృష్టించింది.చేయీ చేయీ కలిపిన జనం దానిని ఎదిరించి నిలబడ్డారు.కొన్ని చోట్ల కరెంటు లేదు.కొన్ని చోట్ల నీళ్లు లేవు.కొన్ని చోట్ల నీడ.కాసింత నిరాశ ఉంటుంది.కాని ఈ నిరాశకు రిలీఫ్‌గా అక్కడ కొత్త సినిమాలు రానున్నాయి.మా సినిమాలు చూసి రీచార్జ్‌ అవ్వండి అంటున్నారు అక్కడి పెద్ద హీరోలు. నిజమే. ఆ వరదకు జవాబు ఈ వెల్లువే కదా అభిమానులకు.

మనకు సంక్రాంతి, దసరాలానే కేరళకు ఓనమ్‌. ఇది ఓనమ్‌ సీజన్‌.ఈ సీజన్‌లో  సినిమాలు ఎక్కువ రిలీజ్‌ చేసి జోరుగా బిజినెస్‌ చేసుకోవాలని భావిస్తుంటారు నిర్మాతలు. కాని అనూహ్యంగా ఈ ఏడాది ఈ సీజన్‌లోనే కేరళకు వరద వచ్చింది. రాష్ట్రం చాలా దెబ్బ తినింది. సినిమా ఇండస్ట్రీ కూడా. ఆగస్ట్‌లో ఓనమ్‌ సీజన్‌లో రిలీజ్‌ కావల్సిన 5–6 సినిమాలు ఇప్పుడు డేట్‌ చూసుకొని షోకు సిద్ధం అవుతున్నాయి.
ముందు వసతి తర్వాతే వినోదం కేరళ ప్రజలకు ఉండటానికి చోటు, తినడానికి సరైన తిండి కూడా లేనప్పుడు సినిమాల రిలీజు సరిౖయెన పని కాదని అనుకుంది అక్కడి ఇండస్ట్రీ. కనీస వసతుల మీద దృష్టి పెట్టవలసిన అవసరాన్ని గుర్తించి తానూ చేయ దగ్గ సాయం చేసింది. మరోవైపు ఈ వరదల ద్వారా ఎంతో మంది బాధకు గురవుతుంటే మిగతా వాళ్లు పండగ సంబరాల్లో మునిగి తేలడం కూడా కరెక్ట్‌ కాదని స్టేట్‌ గవర్నమెంట్‌ కూడా పేర్కొంది. అందుకనే కేవలం సినిమా రిలీజ్‌లనే కాదు కేరళలోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న  చాలా సినిమాల షూటింగ్‌లు ఆపేశారు. ఫాహద్‌ ఫాజల్‌ లేటెస్ట్‌ సినిమా కోసం వేసిన సెట్‌ వరదల్లో కొట్టుకుపోయిందని చిత్రబృందం పేర్కొంది. ఈ పండక్కు రిలీజ్‌ కావల్సిన కొన్ని సినిమాల విడుదలను వాయిదా వేశారు చిత్రబృందాలు. ఈ సినిమాలను వచ్చే నెలలో రిలీజ్‌ చేయడానికి రీ షెడ్యూల్‌ చేశారు. మలయాళ సినీ చరిత్రలో ఓనమ్‌కు సింగిల్‌ సినిమా కూడా రిలీజ్‌ లేకపోవడం ఇదే తొలిసారి అని ట్రేడ్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.  ఈ ఓనమ్‌కు కేరళ మార్కెట్‌ వద్ద చెప్పుకోదగ్గ సినిమాల్లో ముందుగా... 

మలయాళం క్రేజీ ప్రాజెక్ట్‌..
‘ప్రేమమ్‌’ ఫేమ్‌ నివీల్‌ పౌలీ హీరోగా, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ అతిథి పాత్రలో నటించిన చిత్రం ‘కాయమ్‌కులమ్‌ కొచ్చున్ని’. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వం వహించారు. 19వ శతాబ్దంలో నివసించిన కాయమ్‌కులమ్‌ కొచ్చున్ని అనే దొంగ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉన్న వాళ్ల దగ్గర దోచుకొని పేదవాళ్లకు పంచే రాబిన్‌హుడ్‌ క్యారెక్టర్‌. ఈ పాత్రను నివీన్‌ పౌలీ పోషించగా అతని గురువుగా మోహన్‌లాల్‌ కనిపిస్తారు. 45 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ పీరియాడికల్‌ డ్రామా మలయాళ ఇండస్ట్రీలోనే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా రికార్డ్‌ సృష్టించింది. వరదల కారణంగా పోస్ట్‌ పోన్‌ చేసిన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ఇంకా అధికారికంగా అనౌన్స్‌ చేయలేదు. 

అల్లరి చేసే మమ్ముట్టి..
పండక్కి స్టార్‌ హీరో సినిమా లేకపోతే కచ్చితంగా ఆ వెలితి కనిపిస్తుంది. అయితే ఈసారి మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ‘ఒరు కుట్టనుడన్‌ బ్లాగ్‌’ సినిమాతో వస్తున్నారు. ఊరిలో అల్లరి చిల్లరిగా తిరిగే పోకిరి గ్యాంగ్‌కి లీడర్‌గా కనిపిస్తారు మమ్ముట్టి. చేసిన పనికి, చేయని పనికి కచ్చితంగా బ్యాడ్‌ నేమ్‌ మాత్రం మన హీరోకే వస్తుందట. ఇలాంటి లైట్‌ హార్ట్‌ కామెడీతో రూపొందిన చిత్రం ‘ఒరు కుట్టనుడన్‌ బ్లాగ్‌’. ‘అవును’ ఫేమ్‌ పూర్ణ, రాయ్‌ లక్ష్మీ హీరోయిన్స్‌గా యాక్ట్‌ చేశారు. శేతు దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఆగస్ట్‌ 24న విడుదల కావల్సింది. ఇప్పుడు సెప్టెంబర్‌ 14న రిలీజ్‌ కానుంది. 

హార్రర్‌ థ్రిల్లర్‌గా.. 
ఫాహద్‌ ఫాజిల్‌ ‘వరతాన్‌’ చిత్రం కుడా ఓనమ్‌కు వస్తుందని చాలా రోజుల నుంచి ఊరిస్తూ వస్తున్నారు చిత్రబృందం. కెమెరామేన్, డైరెక్టర్‌ అమల్‌ నీరాద్‌ తెరకెక్కించిన ఈ సినిమాను అమల్‌ నీరద్‌తో కలసి ఫాహద్‌ ఫాజిల్‌ భార్య నజ్రియా నజీమ్‌ నిర్మించారు. హార్రర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు సెప్టెంబర్‌ 20న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా సినిమాలో ఓ రొమాంటిక్‌ పాటను కూడాపాడారు నజ్రియా. 

చైన్‌ స్మోకర్‌ సెటైర్‌ 
2017లో మలయాళం సూపర్‌ హిట్‌ ‘మాయనది’తో మంచి పేరు సంపాదించుకున్న టోవినో థామస్‌ ఈ ఓనమ్‌కు ‘తీవండి’తో వస్తున్నారు. తీవండి అంటే చైన్‌ స్మోకర్‌ అని అర్థం. పొలిటికల్‌ సెటైర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఓనమ్‌ ఫెస్టివల్‌కి చాన్స్‌ లేకపోవడంతో సెప్టెంబర్‌ 7న రిలీజ్‌ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఓనమ్‌కి రావాలనుకున్న కొన్ని సినిమాలు ‘కామెడీ పడయోట్టమ్‌’, ‘జానీ జానీ యస్‌ పాప్ప’, ‘మాంగళ్యం తంతూనానేనా’ సినిమాలను కూడా వచ్చే నెలలో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ కొత్త సినిమాల కోసం థియేటర్లు పూర్తిగా రెడీ కావాల్సి ఉంది. వరదల కారణంగా పలు థియేటర్లు నీట మునిగిపోయాయి. కేవలం థియేటర్స్‌ ఏరియా నష్టమే సుమారు 30 కోట్లు వరకూ ఉండొచ్చని కేరళ ఫిల్మ్‌ చాంబర్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ఇటు షూటింగ్‌ నిలిపివేత, అటు కొత్త చిత్రాల విడుదల ఆపివేత.. మొత్తంగా కేరళ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండ్రస్టీకి తీరిన నష్టమే అని చెప్పాలి. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. మళ్లీ కేరళ కళకళలాడాలని, కొత్త రిలీజులతో థియేటర్లు సందడి చేయాలని, ఎప్పటిలా షూటింగ్స్‌ జోరుగా జరగాలని కోరుకుందాం.

కాలం మన నేస్తం కేరళ 
‘ముస్తఫా ముస్తఫా డోంట్‌ వర్రీ ముస్తఫా కాలం మన నేస్తం ముస్తఫా’ అంటూ ‘ప్రేమదేశం’ కోసం ఏఆర్‌ రెహమాన్‌ కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. కేరళ కోసం ఈ క్రేజీ సాంగ్‌ లిరిక్‌ని మార్చి తన కాలిఫోర్నియాలో షోలో పాడారు  ఏఆర్‌ రెహమాన్‌. ఈ ఈవెంట్‌ చేస్తున్నప్పుడు రెహమాన్‌కి వరదల కారణంగా దుస్థితిలో ఉన్న కేరళ గుర్తొచ్చింది. అంతే.. ‘కేరళా.. కేరళా.. డోంట్‌ వర్రీ కేరళా. కాలం మన నేస్తం కేరళా’ అని పాడారు. అందరూ తమ ప్రేయర్స్‌ను ఒక్కోలా పంపుతుంటే రెహమాన్‌ పాట ద్వారా తన సందేశం పంపారు. 

మేమున్నామని...
కేరళకు మేమున్నాం అంటూ మోహన్‌లాల్, మమ్ముట్టి చేరో 25 లక్షలు సీయం రిలీఫ్‌ ఫండ్‌కి అందజేశారు. కొంత మంది హీరోలు డబ్బు రూపంలో సహాయం చేస్తే మరికొందరు డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కేరళకు సహాయంగా తెలుగు పరిశ్రమ నుంచి చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్, విజయ్‌ దేవరకొండ ఇలా పలువురు కళాకారులు ఆర్థిక సహాయం చేశారు. తమిళనాడు నుంచి రజనీకాంత్, విక్రమ్, సూర్య, విజయ్‌ తదితరులు విరాళం అందజేసినవారిలో ఉన్నారు. పలువురు  కథానాయికలు సైతం కేరళకు మేమున్నామని సహాయానికి ముందుకొచ్చారు. హిందీ నుంచి అమితాబ్‌ బచ్చన్, షారుక్‌ ఖాన్‌ వంటి వారు కూడా చేయూతనిచ్చారు. 

కేరళ వరదలపై డాక్యుమెంటరీ
2018లో వచ్చిన వరదలు గత వందేళ్లలో కేరళ ఎప్పుడూ చూడలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ విధ్వంసాన్ని విజువల్‌గా చూపించదలిచారు దర్శకుడు మధుసూదనన్‌. వరద సమయాల్లో ఫోన్‌ లేదా కెమెరాతో షూట్‌ చేసిన వీడియోస్‌ అన్నింటినీ కలిపి ఓ డాక్యుమెంటరీ రూపొందించనున్నారు. కెమెరామేన్, దర్శకుడు రాజీవ్‌ రవి ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన టెక్నికల్‌ విషయాలను చూసుకుంటారట. ‘ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌తో వచ్చే డబ్బులను కేరళను మళ్లీ రీ–బిల్డ్‌ చేసే పనులకు వినియోగిస్తాం’ అని దర్శకుడు మధుసూదనన్‌ పేర్కొన్నారు. 

రానా 2 సినిమాలకు బ్రేక్‌
రానా నటిస్తున్న బహు బాషా చిత్రాలు ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’ కూడా కేరళలోని వరదల కారణంగానే ఎఫెక్ట్‌ అయ్యాయి. ‘హాథీ మేరీ సాథీ’  సినిమా ఎక్కువ శాతం ఏనుగులు, అడవికి సంబంధించిన కథ. ఈ సినిమాకు సంబంధించిన చాలా పోర్షన్‌ కేరళ దట్టమైన అడవుల్లో షూట్‌ చేయాలి, కానీ ప్రస్తుతం కేరళలోని వాతావరణ పరిస్థితులు సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగించాయి అని రానా  పేర్కొన్నారు. అలాగే 1945 కోసం వేసిన సెట్‌ వరదల కారణంగా ధ్వంసం అవడంతో యూనిట్‌ డైలమాలో పడింది. అయితే ఈ బ్రేక్‌ తాత్కాలికమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

అల్లుడు ఆలస్యం అయ్యాడు 
కేరళలోని వరదల ప్రభావం కొన్ని తెలుగు సినిమాలపైన కూడా పడింది. హీరో నాగచైతన్య దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో రూపొందిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా రీ రికార్డింగ్‌ పూర్తి కాకపోవడంతో  సినిమాను వాయిదా వేసుకోవల్సి వచ్చింది. కేరళ సంగీత దర్శకుడు గోపీ సుందర్, దర్శకుడు మారుతి లాస్ట్‌ మినిట్‌ వరకూ కేరళ వాతావరణంతో ఫైట్‌ చేసి రీ–రికార్డింగ్‌ చేయటానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దాంతో ఈ సినిమాను వచ్చే నెల 13న రిలీజ్‌ చేయాలనుకుంటుంది చిత్రబృందం.
ఇన్‌పుట్స్‌: గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement