నా దృష్టిలో అన్నయ్యే హీరో... నేను కాదు! : పవన్ కల్యాణ్
‘‘అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. టెక్నీషియన్ అవుదామనుకున్నా. హీరో అవుతాననే నమ్మకం లేదు. తోట పని కావొచ్చు... వీధులు ఊడ్చే పని కావొచ్చు... ఏ పనైనా నిస్సిగ్గుగా, గర్వంగా, నిజాయితీగా చేస్తా. సినిమాలు భగవంతుడు ఇచ్చిన భిక్ష అనుకుని ఎంత కృతజ్ఞతగా చేయాలో, కష్టపడాలో ఇన్నేళ్లూ అంతే కష్టపడ్డాను. భవిష్యత్తులో ఎలాంటి బాధ్యత ఇచ్చినా నిజాయితీగా చేస్తా’’ అన్నారు పవన్‌కల్యాణ్. ఆయన హీరోగా కిశోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మించిన ‘కాటమరాయుడు’ ప్రీ–రిలీజ్ వేడుక శనివారం జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్ ఆడియో సీడీలను, థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ నచ్చింది.
ప్రేక్షకుడిలా థియేటర్‌లో సినిమా చూస్తా. చెయ్యి ఎత్తగానే జనం ఆగిపోయే శక్తి... ఇటువైపు వెళ్లమని చెయ్యి చూపిస్తే... అక్కడ ఏముందని ఆలోచించకుండా జనం పరిగెత్తే ప్రేమ, అభిమానం సంపాదించుకునే శక్తి... ఎక్కడో కోట్లలో ఒక్కడికి ఇస్తారు. అలాంటి ఒక్కడి పేరు (పవన్‌కల్యాణ్) మీకు తెలుసు. నలుసంతైనా మంచితనం లేకపోతే ఇంత మంది ఎందుకు ప్రేమిస్తారు. ఇది (పవన్) నిలువెత్తు మంచితనం’’ అన్నారు. పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘నా ఉద్దేశంలో చిరంజీవిగారే హీరో, నేను కాదు. ‘సుస్వాగతం’ పెద్ద హిటై్టన తర్వాత కర్నూల్‌లో ఫంక్షన్‌కి పిలిచారు.
(కాటమరాయుడు ప్రీ–రిలీజ్ ఫోటోలు)
వెళ్లకపోతే పొగరనుకుంటారని వెళ్లా. ఐదు కిలోమీటర్లు ర్యాలీగా తీసుకువెళతామన్నారు. ‘అన్నయ్యను చూడడానికి వస్తారు. నన్నెవరు చూస్తారు’ అన్నా. హోటల్ బయట రోడ్ల పై విపరీతమైన జనం. ప్రేమతో చేతులు ఊపుతున్నారు. నేను చేతులు జోడించి నమస్కరించా. నా జీవితంలో నేను నేర్చుకున్నవి లేదా అర్థం చేసుకున్నవి కావొచ్చు... నా సినిమాల్లో వచ్చాయి. అది యాదృచ్ఛికమో.. యాక్సిడెంటో.. నాకు తెలీదు. ‘సుస్వాగతం’ క్లైమాక్స్‌లో నిజంగా ఏడ్చాను. ఆ సీన్ 40 టేకులు చేశా. అది చేసిన తర్వాత ఏడుపు ఆపుకోలేకపోయా.
నిజంగా నా తండ్రి చనిపోతే నేనింక ఏడుస్తానా? అనిపించింది. ‘జల్సా’ చేసే టైమ్‌లో మా నాన్నగారు చనిపోతే... నాకు ఏడుపు రాలేదు. సినిమా నా జీవితం, నన్ను కదిలించిన సంఘటనలు, నాలో చాలా రేకెత్తించిన భావాలు. నేను మొదట్నుంచీ ‘మన భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతా. అది మన యువతీ యువకుల్లో ఉన్న శక్తి. ‘నువ్వు ఇది చేయలేవు. నీవల్ల కాదు’ అనే హక్కు ఎవ్వరికీ లేదని చెప్పడానికి నిదర్శనం ‘తమ్ముడు’ సినిమా. ‘ఖుషి’ సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు హైటెక్ సిటీ థియేటర్‌లో మా టీమ్‌తో కలసి సినిమా చూస్తున్నప్పుడు.. ‘రాబోయే కొన్ని సంవత్సరాలు నీకు గడ్డుకాలం ఉంటుంది. చాలా కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి’ అనే భావన కలిగింది. మనసు కీడు శంకించింది. నీరసం, బాధ వచ్చేశాయి.
ఆ రోజు కోల్పోయిన శక్తి ‘గబ్బర్‌సింగ్’లో పోలీస్ స్టేషన్ సీన్ చేసేవరకూ పుంజుకోలేకపోయా. అప్పటివరకూ భగవంతుడిని యాచించా. నేనెప్పుడూ తమ్ముణ్ణే. నా జీవితంలో ఎవరికీ అన్నయ్యను కాదు. అలాంటిది మొదటిసారి ఈ సినిమాలో అన్నయ్యను అయ్యా. ప్రతి సినిమా కష్టపడి చేస్తా. మీకు నచ్చితే చూడండి. నచ్చకపోతే ఎలాంటి రిజల్ట్ ఇచ్చినా మనస్ఫూర్తిగా తీసుకుంటా’’ అన్నారు. శరత్ మరార్ మాట్లాడుతూ – ‘‘మా టీమ్ లీడర్ కాటమరాయుడే (పవన్).
కల్యాణ్‌గారు హార్వర్డ్ యూనివర్శిటీకి వెళ్లినప్పుడు సూట్‌లో హ్యాండ్సమ్‌గా ఉన్నారు. ఇప్పుడీ పంచెకట్టులో డబుల్ హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు’’ అన్నారు. ‘‘పవన్‌కల్యాణ్‌గారికి ఒక్క సినిమా అయినా చేస్తానో లేదో అనుకున్నా. కానీ, రెండో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు’’ అన్నారు అనూప్ రూబెన్స్. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకుల మధ్య ట్రైలర్ చూస్తుంటే నేనే తీశానా? అనిపిస్తోంది. ‘గోపాల గోపాల’ అప్పుడు కల్యాణ్‌గారితో ఫుల్ సినిమా చేయాలనిపించింది. ఇప్పుడీ సినిమా చేశా క ఐదారు సినిమాలు చేస్తే గానీ నా దాహం తీరేలా లేదు’’ అన్నారు.