అలివేలు, శ్రీకాంత్, బాబ్జీ
‘‘ప్రస్తుతం సమాజంలోని పరిస్థితులకి అనుగుణంగా తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. ఈ మధ్యకాలంలో నేను నటించిన చిత్రాల్లో నాకు నచ్చిన చిత్రమిది. మా సినిమాని ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని శ్రీకాంత్ అన్నారు. శ్రీకాంత్, మంచు మనోజ్, సునీల్ ముఖ్య తారలుగా కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. అలివేలమ్మ ప్రొడక్షన్స్ సమర్పణలో టి. అలివేలు నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. నిర్మాత, బయ్యర్లు అందరూ సేఫ్. కానీ కొన్ని రివ్యూస్ వల్ల మాకు కొంచెం అసంతృప్తిగా ఉంది.
మేము వారి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం. కానీ, ఒక రివ్యూ రాసేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ప్రొడ్యూసర్ చాలా కష్టపడి చిత్రాన్ని నిర్మిస్తాడు. ఎంతోమంది టెక్నీషియన్లకి పని దొరుకుతుంది. కేవలం రేటింగ్స్ చూసి సినిమాకి వెళ్లేవారు చాలా మంది ఉంటారు. ఒక సక్సెస్ వస్తే ఇండస్ట్రీలో చాలా మంది టెక్నీషియన్లకి పని దొరికినట్లేనని గుర్తించాలి’’ అన్నారు. ‘‘ఓ డైరెక్టర్‌గా ఫీల్ అయి ఈ సినిమా తీయ లేదు.. డబ్బుల కోసం కూడా కాదు.. ఓ బాధ్యత గల పౌరుడిగా తీశా. ప్రేక్షకుల ఆదరణ చాలా బావుంది’’ అన్నారు కరణం బాబ్జీ’. ‘‘ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే మంచి కథాంశంతో వచ్చిన చిత్రమిది. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు అలివేలు. నటుడు శివకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment