చెన్నై : పెళ్లి, మంచి భర్త, పిల్లలు ఇలా అందమైన జీవితాన్ని కోరుకోని స్త్రీ ఉండదనేది గత మాట. మారుతున్న కాలంలో మనుషుల మనస్థత్వాలు మారుతున్నాయి. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం అని కొందరంటుంటే, పెళ్లిపై నమ్మకం లేదు అనేవారు మరికొందరు. ఇక నటి ఓవియ విషయానికొస్తే ఈ అమ్మడు రెండో కోవకు చెందింది. అసలు పెళ్లితో పనేంటి అని అంటోంది. ఈ మలయాళీ జాణ నటిగా రంగప్రవేశం చేసి దశాబ్దం దాటింది. స్టార్‌డమ్‌ను పెద్దగా పొందకపోయినా, పాపులారిటీని మాత్రం బాగానే పెంచుకుంది. వివాదాంశ పాత్రలతో వార్తల్లో సంచలన నటిగా ముద్రవేసుకున్న ఓవియ ఇటీవల 90 ఎంఎల్ అనే చిత్రంలో మగాడికి మగువ ఏ విషయంలోనూ తక్కువ కాదన్నట్లుగా విచ్చలవిడిగా నటించేసింది. తాజాగా ఈ అమ్మడు కథానాయకిగా నటించిన కలవాణి–2 చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.
ఈ సందర్భంగా నటి ఓవియ ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొంటూ కలవాణి చిత్రం తన మనసుకు దగ్గరైన కథా చిత్రం అని పేర్కొంది. హెలన్ అనే తన అసలు పేరును ఓవియగా మార్చింది ఆ చిత్ర దర్శకుడు సర్గుణంనేనని తెలిపింది. తాజాగా ఆయన దర్శకత్వంలో నటించి కలవాణి–2లో నటించడం సంతోషంగా ఉందని అంది. ఇందులో తాను మహిళా సంఘం అధ్యక్షురాలిగా నటించానని చెప్పింది. నిజజీవితంలో తాను స్వేచ్ఛా జీవినని, వివాహ బంధంపై తనకు నమ్మకం లేదని చెప్పింది. కాబట్టి పెళ్లితో పని లేదని అంది. జీవితంలో పెళ్లే చేసుకోనని, స్వతంత్ర భావాలతో జీవించడం తనకు ఇష్టం అని పేర్కొంది. అందువల్ల మగతోడే అవసరం లేదని పేర్కొంది. జీవితాంతం నటిస్తూనే ఉండాలని ఆశపడుతున్నానని అంది. తనకు స్నేహితులంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరని, అలాగని శత్రువులూ లేరని అంది. అందరితోనూ ఒకేలా మసలుకుంటానని చెప్పింది. తనకు నచ్చితే ఎలాంటి పాత్రనైనా నటించడానికి రెడీ అని, అయితే సూపర్ ఉమెన్‌గా నటించాలన్న కోరిక మాత్రం ఉందని తెలిపింది.అలాంటి పాత్ర లభిస్తే సంతోషంగా నటిస్తానని అంది. నయనతార, కాజల్ అగర్వాల్, అమలాపాల్ వంటి నటీమణులు నిర్మాతలుగా మారారు. మీకు అలాంటి ఆలోచన ఉందా అని అడుగుతున్నారని, తాను నటిగా పరిచయం అయ్యింది ఇటీవలేనని, ఇంకా సంపాదించలేదని అంది. అందువల్ల సొంతంగా చిత్రాలు చేసే ఆలోచనలేదని స్పష్టం చేసింది. ఇక రాజకీయాలపై ఆసక్తి ఉందా అని అడుగుతున్నారని, తనకు రాజకీయాల గురించి తెలియదని, అందువల్ల ఆ ఆలోచనే లేదని ఓవియ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment