ఔడదం చిత్ర ఆడియో ఆవిష్కరణ
తమిళసినిమా: ఔడదం చిత్రం గీతాలావిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్‌కేవీ.స్టూడియోలో జరిగింది. చిత్ర ఆడియోను దర్శకుడు పేరరసు ఆవిష్కరించగా తొలి సీడీని దర్శకుడు నితిలన్ అందుకున్నారు. రెడ్‌చిల్లీ బ్లాక్ పేపర్ సినిమాస్ పతాకంపై నేతాజీ కథ రాసి, నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రం ఔడదం.
ఢిల్లీకి చెందిన సమీరా కథానాయకిగా, సంతోష్ రెండవ కథానాయకుడిగానూ నటించిన ఈ చిత్రానికి కథనం, దర్శకత్వం బాధ్యతలను రమణి నిర్వహించారు. దర్శి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ద్వారా ప్రఖ్యాత రచయిత పట్టుకోట్టై కల్యాణసుందరం అన్న కొడుకు షణ్ముగసుందరం గీత రచయితగా పరిచయం అవుతున్నారు. ఆయనతో పాటు సింగపూర్ కల్వైందన్, తమిళ్ ముదన్, చో.శివకుమార్, విజయ్‌కృష్ణన్ ఈ చిత్రానికి పాటలు రాశారు. ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది మెడికల్ థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు.
ప్రజలకు హాని కలిగించే మందులను తయారు చేసి అధికారులు, రాజకీయనాయకుల సహకారంతో వాటిని మార్కెటింగ్ చేసే సంఘద్రోహుల గురించిన చిత్రంగా ఔడదం చిత్రం ఉంటుందన్నారు. చెన్నైకి చెందిన ఇక మధుమేహ వైద్యుడు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే మందులను నిషేధించేలా చేసి మళ్లీ అవి అమల్లోకి వచ్చే 10 రోజుల్లో జరిగే మెడికల్ థ్రిల్లర్ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. చిత్రాన్ని కమర్శియల్ అంశాలతో పాటు ప్రజలకు మంచి సంధేశానిచ్చే చిత్రంగా ఔడదం చిత్రం ఉంటుందని తెలిపారు. జాగ్వుర్‌తంగం, శ్రీరామ్, కేవీ.గుణశేఖర్ పాల్గొన్నారు.