ఐశ్వర్యా.. వెయ్యి కాకులు!
ఐశ్వర్యా.. వెయ్యి కాకులు!
Published Sun, Feb 16 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా తమిళ, తెలుగు భాషల్లో పి.వాసు ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. ఐశ్వర్య కోసం వాసు ఒక అద్భుత కథను తయారు చేశారట. ఈ కథ విని, ఐష్ ఎగ్జయిట్ అయ్యారని వినికిడి. ఈ చిత్రానికి తమిళంలో ‘ఐశ్వర్యావుం ఆయిరమ్ కాక్కావుమ్’ అనే పేరును నిర్ణయించారట. అంటే.. ఐశ్వర్యా.. వెయ్యి కాకులు అని అర్థం. ఇప్పటి వరకు భారతీయ తెరపై రానటువంటి అద్భుత కథాంశంతో ఈ చిత్రం ఉంటుందట.
ఈ చిత్రానికి యానిమేషన్ సన్నివేశాలను రూపొందించడానికి పలు ప్రముఖ విజువల్ ఎఫెక్ట్ సంస్థలతో పి. వాసు చర్చిస్తున్నట్లు తెలిసింది. షూటింగ్‌ను కాంబోడియాలో వేసిన భారీ సెట్‌లోను, కొండ ప్రాంతాల్లోను జరపనున్నారట. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ సరసన నటించే ఇద్దరు ప్రముఖ హీరోల ఎంపిక జరుగుతోందట. ఇందులో పలు సాహస పోరాట సన్నివేశాలు ఉంటాయని, వాటి కోసం ఐష్ ఫైట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ప్రియమణి హీరోయిన్‌గా ‘చారులత’ చిత్రాన్ని నిర్మించిన గ్లోబల్ ఒన్ స్టూడియోస్ అధినేత కె.రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని చెన్నయ్ టాక్.
Advertisement
Advertisement