జ్ఞాపకాలు హౌస్‌ఫుల్
దేవుడు కట్ చెప్పాడు.
విధాత కదా... చెబుతాడు.
ప్రేక్షకులం కదా... మనం నొచ్చుకుంటాం.
ఇంకో వంద సీన్లుంటే బాగుండు... అనుకుంటాం.
చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలిచ్చినా
దాసరి లేకపోవడాన్ని భరించలేకపోతున్నాం.
మానవ సంబంధాలను అల్లి... తెలుగు సినిమాకు
కండువాగా వేసి వెళ్లిన
దర్శకుడు... దార్శనికుడు దాసరి.
దాసరి గారూ...
మీరూ– మీ సినిమా
మీరూ – మీ ప్రేమ
మీరూ – మీ పరంపర
ఎప్పుడూ ఆడుతూనే ఉంటాయి.
మీ జ్ఞాపకాలు ఎప్పుడూ హార్ట్‌ఫుల్... హౌస్ ఫుల్.
ఆకాశ దేశాన... ఆషాఢ మాసాన...
డైలాగులతో పైకి వచ్చిన దాసరి పాటను పట్టుకున్నాడట. సంగీత ప్రధానమైన సినిమా తీస్తున్నాడట.
‘ఆ.. ఆయన వల్ల కాదు’ అనుకున్నారు ప్రత్యర్థులు.
‘మేఘసందేశం’ రిలీజైంది. అవును... డైలాగులనే నమ్ముకున్న దాసరి అసలు డైలాగులకే ప్రాధాన్యం ఇవ్వకుండా గొప్ప భావుకత్వంతో సంగీత ప్రధానంగా సినిమా తీయగలడని
నిరూపించుకున్నాడు. ఆ సమయంలోనే ఒక తమిళ దర్శకుడు ఈ సినిమా గురించి విని
దాసరితో కలిసి ప్రత్యేకంగా ఆ సినిమాను చూశాడు. సినిమా పూర్తయ్యాక ‘ఇన్స్పైర్ అయ్యాను నారాయణరావ్’ అని మెచ్చుకున్నాడు.
ఆ స్ఫూర్తితో ఆయన తమిళంలో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాను తీశాడు.
దాని పేరు ‘సింధుభైరవి’. ఆ దర్శకుడు కె. బాలచందర్.
…
తమిళంలో వచ్చిన గొప్ప దర్శకుడు శంకర్. భారీ సినిమాలు జనరంజక సినిమాలు తీయడంలో పేరు సాధించాడు. ఆయన కమలహాసన్‌తో ఒక సినిమా తీశాడు. స్వాతంత్య్ర సమరయోధుడొకడు వర్తమాన సమాజంలో పేరుకునిపోయిన అవినీతిని చూసి దాని మీద పోరాటం మొదలుపెడతాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. చాలా డబ్బు సంపాదించింది. కాని – దాసరి నారాయణరావు అదే సినిమాను చాలా కాలం క్రితమే తీసేశారు. పేరు సర్దార్ పాపారాయడు. అలాంటి కథాంశమే శంకర్ చేతిలో పడి ‘భారతీయుడు’గా బయటికొచ్చింది.
…
పి.వాసు అంటే తమిళంలో పెద్ద దర్శకుడు. రజనీకాంత్‌ను హీరోగా పెట్టి, విజయశాంతిని హీరోయిన్గా పెట్టి ‘మన్నన్’ అనే సినిమా తీశాడు. తమిళంలో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. దానిని తెలుగులో చిరంజీవితో ‘ఘరానా మొగుడు’ అని రీమేక్ చేస్తే ఇక్కడా పెద్ద హిట్.
కాని ఈ సినిమాను కన్నతండ్రి దాసరినారాయణరావే. కృష్ణంరాజు కార్మికవర్గ నాయకుడిగా, జయప్రద ఫ్యాక్టరీ యజమానిగా ఆయన తీసిన ‘సీతారాములే’ మళ్లీ తారలను మార్చుకుని తెర మీదకు వచ్చింది.
…
మణిరత్నం గ్రేట్ డైరెక్టరే. ‘దళపతి’ సినిమా తీశాడు. ఈ కథ భారతంలో కర్ణుడి ఉదంతం. కాని దాసరి నారాయణరావు ఇంకా గ్రేట్. దాని కంటే చాలా ఏళ్ల ముందే అదే కథాంశాన్ని ‘కటకటాల రుద్రయ్య’గా తీశారు.
హుందాగా బతికారు... అలానే వెళ్లిపోయారు-మోహన్‌బాబు
గురువుగారు హఠాత్తుగా ఇలా కనుమరుగవుతారని ఊహించలేదు. ఆయనకు కూడా ఎలాంటి సందేహం లేదు. ఆపరేషన్ చేయించుకుని, ఇంటికి వచ్చేస్తా అనుకునేవారు. మొదటిసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, ఆయన ఇంటికి తిరిగొచ్చాక నేను ప్రతి రోజూ వెళ్లకపోయినా ఫోన్ చేసి, క్షేమసమాచారాలు తెలుసుకునేవాణ్ణి. అప్పుడప్పుడూ వెళుతుండేవాణ్ణి. అప్పుడు ‘ఇదిగో నిలబడ్డా చూడు.. నడుస్తున్నాను కూడా’ అని నాలుగు అడుగులు వేసి, చూపించేవారు. ఒకవేళ అలా చేయకపోతే, ‘ఏంటి గురువుగారూ.. నిలబడాలి, నడవాలి’ అని దబాయించేవాణ్ణి. అప్పుడు నడవడానికి ప్రయత్నించేవారు. ఆయన చాలా హుందాగా బతికారు. గురువుగారి అంతిమ క్రియలు కూడా అంతే హుందాగా జరిగాయి. అది నాకు తృప్తిగా ఉంది. ఆయన మరణవార్త విన్న వెంటనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు వచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి విషయం తెలియజేశారు. కేసీఆర్‌గారు గురువుగారి పట్ల చూపించిన మర్యాద అద్భుతం, అమోఘం. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా హాస్పిటల్ నుంచి ఇంటి వరకు ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఇంటి దగ్గర విపరీతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ లాంఛనాలతో దాసరిగారి అంత్యక్రియలను నిర్వహించారు. ఒక వ్యక్తిని ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేయాలంటే కేబినేట్ మీటింగ్ పెట్టాలని ఇంకోటని... ఇంకోటని రకరకాలు చెప్పి, తప్పించుకుంటారు. కానీ, విషయం తెలిసిన కాసేపటికి అన్నీ ఏర్పాటు చేశారు. మా గురువుగారి పట్ల చూపించిన ఆదరాభిమానాలను నేను మరచిపోలేను.
…
దర్శకులు చాలా మంది ఉండొచ్చు.
దాసరి నారాయణరావు మాత్రం ‘దర్శకులకే దర్శకుడు’ .
…
చిత్ర పరిశ్రమలో ఒక ఘనమైన పరంపర ఉంది. అది ప్రొడక్షన్ హౌస్‌ల పరంపర. ఇది వాహినివారి చిత్రం... ఇది విజయా వారి చిత్రం... ఇది ఏవీఎం వారి చిత్రం... సినిమా– ప్రొడక్షన్ హౌస్ వారిది. పోస్టర్ మీద ప్రొడక్షన్ హౌస్ ఎలివేట్ అవుతుండేది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఎలివేట్ అయ్యేవారు. దర్శకుడు అనేవాడు ఆ ప్రొడక్షన్లో ఒక ఉద్యోగి హోదాలో ఉండేవాడు. ఈ పరంపరలో ఉంటూనే తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ను ఏర్పరుచుకున్న దర్శకుడు కె.వి.రెడ్డి. మరో నలుగురైదుగురు ఈ స్థాయికి దగ్గరగా ఉన్నా పోస్టర్ మీద పేరును పైకి చేర్చిన తెలుగు దర్శకుడు మాత్రం దాసరి నారాయణరావు. తమిళంలో ఆయన కంటే కొద్దిగా ముందు కె.బాలచందర్ ఇదే పనిని చేశాడు. పోస్టర్లో ఒక ‘ఫిల్మ్ ముక్క’లో ఆయన పేరు కనిపిస్తే ఇక్కడ తెలుగులో ఒక ‘మబ్బు తుంట’లో దాసరి నారాయణరావు పేరు కనిపించేది. ఓడలో ఎవరు ఏ అంతస్తులో ఉన్నా కెప్టెన్ పై అంతస్తులో ఉండి ఓడను నడిపిస్తాడు. సినిమాలో దర్శకుడిది కూడా పై స్థానమే అని దాసరి చిత్ర పరిశ్రమకు చెప్పగలిగారు.
నిర్మాత గౌరవం నిర్మాతకు ఇస్తూ దర్శకుడుగా తాను పొందాల్సిన గౌరవాన్ని పొందినవారు దాసరి నారాయణరావు. అంతేకాదు భిన్న శాఖలను ఒక్క మనిషే నిర్వహించవచ్చు అని ఆయన నిరూపించారు. సాధారణంగా ఒకప్పుడు దర్శకుడంటే కథ కోసం ఒక మనిషి దగ్గరకు, మాటల కోసం మరో మనిషి దగ్గరకు, పాటల కోసం వేరో మనిషి దగ్గరకు, స్క్రీన్ ప్లే కోసం ఇంకో మనిషి దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దాసరి నారాయణరావు వచ్చి అవన్నీ తానే చేసుకోగలను అని చేసి చూపించారు. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం– దాసరి నారాయణరావు అని టైటిల్స్ చివర పడటం ప్రేక్షకులు అబ్బురంగా చూడటం మొదలుపెట్టారు.
నా ఫ్యామిలీకి మంచి గైడ్-జయసుధ
కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకున్నాను. అందుకే మే 29న నేను విదేశాలకు వెళ్లాను. 30న దాసరిగారు చనిపోయారు. ఆ విషయం నాకు తెలిసేసరికే ఆలస్యం అయింది. చివరి చూపు కోసం వచ్చేద్దామంటే నేనిక్కడికి వచ్చే లోపే ఆయన అంతిమ క్రియలు జరుగుతాయని తెలిసింది. చాలా బాధపడ్డాను. దాసరిగారు నా కుటుంబానికి పెద్దదిక్కు లాంటివారు. ఆయన నాకు ‘ఫాదర్ ఫిగర్’. నా లైఫ్‌కి గైడ్. నితిన్‌గారికి, నాకూ పెళ్లి చేసింది ఆయనే. దాసరిగారి దగ్గరే మా ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా చేసేవారు. అప్పుడే మేము ప్రేమలో పడ్డాం. మాకు అండగా దాసరిగారు నిలబడ్డారు. అప్పటి నుంచి మాకే సమస్య వచ్చినా ఆయన దగ్గర చెప్పుకునేవాళ్లం. మా ఆయన డిప్రెషన్లోకి వెళ్లిపోయినప్పుడు దాసరిగారు కౌన్సెలింగ్ ఇచ్చేవారు.
కానీ, నితిన్‌గారు డిప్రెషన్ నుంచి బయట పడలేకపోయేవారు. నితిన్‌గారి మరణం నాకు పెద్ద షాక్ అయితే... దాసరిగారి మరణం ఇంకో షాక్. బహుశా నేనిక్కడ ఉండి ఉంటే... ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయి ఉండేదాన్ని. అందుకే ఆ దైవమే నన్ను తీర్థయాత్రలకు పంపించాడేమో అనిపిస్తోంది. దాసరిగారు దూరం కావడం ద్వారా ఇండస్ట్రీలో ఓ ‘పెద్ద వాయిస్’ మిస్ అయింది. ఇతరుల కోసం ఫైట్ చేసేవాళ్లు ఎవరున్నారు చెప్పండి? ఈ భూమ్మీద నిర్వహించాల్సిన పనులన్నింటినీ ఆయన సక్రమంగా చేశారు. బతికి ఉండగానే దాసరిగారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చి ఉంటే బాగుండేది. ఇతరుల కోసం జీవించారు. అందరి మనసుల్లో జీవించే ఉంటారు.
…
ఒక గురువును గురువు అని చెప్పాలంటే ఆయన పరంపర ఎలా సాగుతుందనేది చూడాలి. చరిత్రలో కొందరు గొప్పవారు తమ పరంపరను కొనసాగించగలిగే శిష్యులను ఇవ్వలేదు. దర్శకులలో కూడా బాపు, కె.విశ్వనాథ్, వంశీ వంటివారు తాము నిత్య విద్యార్థులుగా ఉంటూ శిష్యపరంపరను కొనసాగించే ఆనవాయితీకి దూరంగా ఉన్నారు. కాని దాసరి నారాయణరావు అలా కాదు. ఒక ఫ్యాక్టరీని స్థాపించినట్టుగా శిష్యులను ఉత్పత్తి చేశారు. ఒక దర్శకుడు వంద సినిమాలు తీయడం అతి గొప్ప. దాసరి ఆ ఘనతను చిటికెలో సాధించారు. ఆ దర్శకుడి శిష్యుడు కూడా వంద సినిమాలు తీయడం విడ్డూరం. కాని కోడి రామకృష్ణ ఆ ఘనతను సాధించి గురువుకు దక్షిణ చెల్లించారు. వంద సినిమాలు తీసిన గురుశిష్యులు భారతదేశంలో కాదు కదా ప్రపంచంలోనే లేరు. కోడి రామకృష్ణ అనే ఏముంది రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి, ఎం.ఎస్.కోటారెడ్డి. ధవళ సత్యం, రాజా చంద్ర ఇలా ఎందరో దర్శకులు దాసరి దగ్గర తయారయ్యారు. దర్శకత్వం జోలికి రాకుండా కో డైరెక్టర్లుగా వెలిగినవారు మరెందరో.
ఆయన శ్రామికుల హీరో -జయప్రద
దాసరిగారి గురించి మాట్లాడాలంటే ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలో అర్థం కావడంలేదు. ఆయనకు ఆపరేషన్ జరిగే ముందు ఆస్పత్రికి వెళ్లి, కలిశాను. ‘‘మంచి ఆరోగ్యంతో ఇంటికి వస్తారు సార్.. గెట్ వెల్ సూన్’’ అంటే, ‘‘అలాగే’’ అని నవ్వారు. కాసేపయ్యాక ‘‘నీకు ఫ్లైట్‌కి టైమ్ అవుతోంది కదా... వెళ్లు... ఏం ఫర్వాలేదులే జయా’’ అన్నారు. దాసరిగారితో నేను మాట్లాడిన చివరి మాటలవే. నేను ఆయన్ను కలవడం అదే చివరిసారి అవుతుందనుకోలేదు. దాసరిగారు చనిపోయినప్పుడు ఇక్కడ లేను. చివరి సారి చూద్దామనుకుంటే ఫ్లైట్ టికెట్స్ దొరక్క రాలేకపోయాను. అందుకే ఈ రోజు పెద్ద కర్మను మిస్ కాకూడదనుకున్నా. దాసరిగారు పైకి గంభీరంగా కనిపించే చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవారు. ‘విశ్వనాథ నాయకుడు’ షూటింగ్ అప్పుడు నేను ఒకరోజు ఆలస్యంగా షూటింగ్‌కి వెళ్లాను.
సాంగ్ షూట్ అన్నమాట. మేకప్ హెవీగా చేసుకోవాల్సి వచ్చింది. హెయిర్ సై్టల్‌కి చాలా టైమ్ పట్టేసింది. లొకేషన్‌కి వెళ్లాక, దాసరిగారు ఏం మాట్లాడలేదు. సాంగ్ షూట్ మొదలైంది. డాన్స్ మాస్టర్ చెప్పిన స్టెప్స్ వేయడం మొదలుపెట్టాను. మాస్టర్ ‘ఓకే’ అంటున్నారు కానీ, దాసరిగారు మాత్రం ‘కట్’ అనేవారు. అలా పదీ పదిహేను టేక్స్ అయ్యాయి. దాంతో ‘సార్.. మాస్టర్ చెప్పినట్లే చేస్తున్నాను కదా.. ఏదైనా ప్రాబ్లమా?’ అనడిగితే, గట్టిగా నవ్వేశారు. ‘‘నువ్వు లేట్‌గా వచ్చావు కదా జయా.. అందుకే’’ అన్నారు. నా మీద అలిగారని అప్పుడు అర్థమైంది. ఇద్దరం నవ్వుకున్నాం. లొకేషన్‌కి వెళ్లగానే, ‘ఏంట్రా జయా... ఎలా ఉన్నావ్’ అని ఆప్యాయంగా పలకరించేవారు. ఇక ఆ పిలుపు వినపడదంటే బాధగా ఉంది. దాసరిగారు శ్రామికుల హీరో. ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు. ఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కుని కోల్పోయింది.
…
కొందరు నటులు కొందరు దర్శకులకు సూట్ అవుతారు. లేదా కొందరు దర్శకులు కొందరు నటులకు సూట్ అవుతారు. దాసరి కూడా కొందరు నటీనటులతోనే ఎక్కువగా తన సినిమా ప్రయాణాన్ని కొనసాగించారు. కమెడియన్‌గా ఉన్న రాజబాబు అంటే దాసరికి ఇష్టం. ఆయనను దాసరి ‘తాత–మనవడు’, ‘తిరుపతి’, ‘యవరికి వారే యమునా తీరే’ సినిమాలలో హీరోగా చేశారు. మురళీమోహన్ సినీ జీవితంలో స్థిరపడటానికి కారణం దాసరి. ఎన్టీఆర్ ఏఎన్నార్ ప్రభంజనంలో మురళీమోహన్ తనకుంటూ సినిమాలు మిగుల్చుకోగలిగారంటే దాసరి వాత్సల్యమే కారణం. దాసరి– మురళీమోహన్ కాంబినేషన్లో ‘భారతంలో ఒక అమ్మాయి’, ‘ముద్దబంతిపువ్వు’, ‘ఓ మనిíషీ తిరిగి చూడు’, ‘ఇదెక్కడి న్యాయం’, ‘అద్దాల మేడ’ వంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక మోహన్‌బాబుకు సినిమా జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలుసు. దాసరి–మోహన్‌బాబు కాంబినేషన్లో ‘స్వర్గం–నరకం’, ‘శివరంజని’, ‘సర్దార్ పాపారాయుడు’, ‘ప్రేమాభిషేకం’, ‘దీపారాధన’ వంటి సినిమాలు ఎన్నో వచ్చాయి.
ఆర్.నారాయణమూర్తి, శ్రీహరి, ఈశ్వరరావు... వీరంతా దాసరి నీరు పోసి పెంచిన మొక్కలు. కాని దాసరి అనగానే వెంటనే తలుకోవడానికి వచ్చే పేరు అక్కినేనే. ఒక సందర్భంలో కె.రాఘవేంద్రరావు– ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమాలు ఎక్కువగా వచ్చేవి. పారలల్‌గా దాసరి–అక్కినేని కాంబినేషన్లో ఎక్కువగా సినిమాలు వచ్చేవి. రాఘవేంద్రరావు ఎన్టీఆర్‌తో ‘అడవిరాముడు’ ఇస్తే దాసరి అక్కినేనితో ‘ప్రేమాభిషేకం’ ఇచ్చారు. రాఘవేంద్రరావు ‘జస్టిస్ చౌదరి’ ఇస్తే దాసరి ‘రాముడు కాదు కృష్ణుడు’ ఇచ్చారు. రాఘవేంద్రరావు సినిమాల్లో యాక్షన్, గ్లామర్ ఉంటే దాసరి సినిమాల్లో మెసేజ్, డ్రామా ఉండేది. తెలుగులో కమర్షియల్ సినిమా తరాజును దాసరి ఎప్పుడూ తన సినిమాలతో సరిచేస్తూ ఉండేవారు. తెలుగు సినిమాల్లో కథ అంటూ ఒకటి బతికి ఉండటానికి దాసరి చాలా ముఖ్యమైన ఒక కారణం.
…
దాసరి తన జీవిత కాలంలో ఒక రోత పుట్టించే హారర్ సినిమా తీయలేదు. తన జీవిత కాలంలో ఒక అశ్లీలమైన మాటను రాయలేదు. తన జీవితకాలంలో కుటుంబాలు చూడటానికి ఇబ్బంది పడే సినిమా తీయలేదు. తెలంగాణ భాషను కొందరు కొన్ని సినిమాల్లో వినోదానికీ విలనిజానికీ వాడుకుంటే దాసరి తెలంగాణ ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేశారు. తెలం గాణ గొప్పతనం చూపే ‘ఒసే రాములమ్మ’, ‘సమ్మక్క–సారక్క’ సినిమాలు తీశారు. వర్కింగ్ క్లాస్ అంటే దాసరికి ముందు నుంచి అభిమానమే. అందుకే ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’, ‘ఏడంతస్తుల మేడ’, ‘సూరిగాడు’, ‘ఎంకన్నబాబు’, ‘ఒరేయ్.. రిక్షా’, ‘మేస్త్రీ’ వంటి సినిమాలు తీశారు. ఇక ఆయన స్త్రీ పక్షపాతి. ఆడవాళ్ల కోసం తీసిన సినిమాలకు లెక్క లేదు. ‘బంట్రోతు భార్య’, ‘రాధమ్మ పెళ్లి’, ‘యవ్వనం కాటేసింది’, ‘కన్యాకుమారి’, ‘శివరంజని’, ‘గోరింటాకు’, ‘స్వప్న’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘కాంచనసీత’, ‘అమ్మ రాజీనామ’, ‘అక్క పెత్తనం–చెల్లెలి కాపురం’, ‘కంటే కూతుర్నే కను’... ఇన్ని సినిమాలు తీశారు. ఆయన చిన్న సినిమాల పెద్ద దర్శకుడు. పెద్ద సినిమాల పెను దర్శకుడు. మీడియం బడ్జెట్ ఆయనకు కొట్టిన పిండి. ఓవర్ బడ్జెట్ ఆయన డిక్షనరీలో లేదు.
…
దాసరి నారాయణరావు మే 30న మరణించారు.
కాని ఆయన అసలైన ఘన జీవితం ఆ రోజు నుంచే తిరిగి ప్రారంభమైంది.
కొత్త తరాలు, భావితరాలు ఈ దర్శక శిఖరాన్ని అధ్యయనం చేయడం, పరిశోధన చేయడం, ఆయన వేసిన దారిని తిరిగి కనగొనడం, ఆ సాధించిన ఘన విజయాలను పునర్ మూల్యాంకనం చేయడం ఇప్పుడే సరిగ్గా మొదలవుతుంది. మహారథం ఆగినప్పుడే అది ఎంత దూరం ప్రయాణించిందో అంచనాకొస్తుంది.
…
దాసరి సినీ ఘనతను ఇప్పుడు సరిగ్గా అంచనా వేయాల్సిన సమయం వచ్చింది. ఆయన పేరున ఒక యూనివర్సిటీని తెరవాల్సిన సందర్భం వచ్చింది. దాసరి అనే పేరు వెలుతురులో ఎన్నో కొత్త తారలు, కలాలు, దర్శక దివ్వెలు వెండితెరను వెలిగించాల్సిన సన్నివేశం వచ్చింది. అది జరిగినప్పుడే ఆ దర్శకుడికి అది సినీ పరిశ్రమ అర్పించే ప్రేమాభిషేకం అవుతుంది. నిజమైన కృతజ్ఞతాభివందనం అవుతుంది. వందనం అభివందనం దాసరికి స్మరణాభి వందనం.
ఆయన ఓ ఇన్స్టిట్యూషన్
దాసరిగారి డైరెక్షన్లో నేను పది సినిమాల వరకు చేశాను. ఆయనతో నేను చేసిన ఫస్ట్ మూవీ ‘బహుదూరపు బాటసారి’. మల్టీస్టారర్ మూవీ అన్నమాట. దాసరిగారి సినిమాల గొప్పతనం ఏంటంటే.. చిన్న పాత్ర అయినా ఆ పాత్ర చేసిన ఆర్టిస్ట్‌కి మంచి గుర్తింపు వస్తుంది. అలా నాకు ‘బహుదూరపు బాటసారి’ మంచి పేరు తెచ్చింది. మిగతా డైరెక్టర్స్‌కి, ఈయనకీ ఉన్న తేడా ఏంటంటే.. దాసరిగారు ఒక డైలాగ్ ఇచ్చి, ‘‘ఈ డైలాగ్‌ని ఎలా చెప్పాలనుకుంటున్నావో చెప్పు’’ అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. చెప్పిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే, వాటి గురించి చెప్పేవారు. ఆయన డైరెక్షన్లో చేసిన వాటిలో నాకు ‘తిరుగుబాటు’ సినిమా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే, అందులో నాది పూలన్ దేవి టైప్ క్యారెక్టర్. ‘ఈ క్యారెక్టర్ చేయగలనా’ అని నాలో నేనే అనుకున్నాను. పైగా లెంగ్తీ డైలాగ్స్ ఉండేవి. అవి చెప్పగలనా అని సందేహం. అది గమనించి, దాసరిగారు ‘‘ఏంటీ... చేయలేననుకుంటున్నావా? నువ్వు అమ్మాయిని అనే సంగతి మరచిపో. నిన్ను నువ్వు చిరంజీవి అనుకో. హీరోని అనుకుని చేసేయ్’’ అన్నారు. ఆ మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. ఆ పాత్రను సునాయాసంగా చేసేశాను. నటీనటులకు ఆయన చెప్పే విధానం చాలా క్లియర్‌గా ఉంటుంది. దాసరిగారు ‘హార్ట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ’. తెలుగు సినిమాకి ఇన్స్టిట్యూట్ లాంటివారు. ఆయన మరణం తీరని లోటు.
– సాక్షి ఫీచర్స్ ప్రతినిధి