లాస్‌ఏంజెలిస్ : 'లైంగిక వేధింపులకు పాల్పడేవాళ్లను క్షమించకూడదు. అలాంటివాళ్లు మనిషి రూపంలో ఉన్న మృగాలంటూ' గతంలో పేర్కొన్న నటి పమేలా అండర్‌సన్ తాజాగా ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల వివాదాల్లో ఇరుక్కున్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌ను తప్పుపట్టని ఈమె, తెలివి తక్కువగా ప్రవర్తించడంతోనే నటీమణులపై వేధింపులు జరిగాయని పమేలా అభిప్రాయపడ్డారు. హోటల్ గదులకు ఒంటరిగా వెళ్తే ఏం జరుగుతుందన్న కనీస జ్ఞానం వారికి లేదా అని ప్రశ్నించారు. నిర్మాత హర్వే వీన్‌స్టీన్ తమను గతంలో లైంగికంగా వేధించాడంటూ ఇటీవల కొందరు ఇండస్ట్రీకి చెందిన దాదాపు 50 మంది మహిళలు ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నటి పమేలా అండర్‌సన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. 'బాధిత నటీమణులు కొద్దిగా కామన్ సెన్స్ వాడి ఉంటే వేధింపుల భారిన పడకుండా సులువుగా తప్పించుకునేవారని, కానీ వారు ఆ పని చేయలేదు. హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో తనతో కొందరు అసభ్యంగా ప్రవర్తించాలని చూడగా.. కామన్ సెన్స్ వాడి వేధింపుల నుంచి తప్పించుకున్నాను. ఎవరైనా తనను ఒంటరిగా హోటల్ గదికి రమ్మని పిలిస్తే లౌక్యంగా ఆలోచించి అక్కడికి ఒంటరిగా వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ కచ్చితంగా హీరోయిన్లు ఆ హోటళ్లకు వెళ్లాల్సి వస్తే మరో వ్యక్తిని తనకు తోడుగా తీసుకెళ్తే ఏ సమస్యలు తలెత్తేవి కావని' పేర్కొన్నారు.
'నా స్నేహితురాలి బోయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లగా అతని అన్నయ్య ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అదను చూసి అతను నా మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఓ సందర్భంలో కొంతమంది నాపై సామూహిక అత్యాచారం జరిపారంటూ' గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించిన పమేలా అండర్‌సన్ ఇతర మహిళల విషయంలో మాత్రం ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. అత్యాచారానికి గురైనవాళ్లు మౌనంగా ఉండకూడదని, న్యాయం కోసం ఏ స్థాయికైనా వెళ్లి పోరాడాలని పిలుపునిచ్చిన నటి పమేలా.. హార్వే వీన్‌స్టీన్‌పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తగా ఇలా మార్చడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఇరుక్కున్న నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌పై అమెరికా నిర్మాతల గిల్డ్ (పీజీఏ) ఇటీవల జీవిత కాల నిషేధం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment