దర్శకనటుడు పాండిరాజన్ వారసుడు పృధ్వీరాజన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం తొడర్. జేఎస్.అపూర్వ ప్రొడక్షన్స్ పతాకంపై చంద్ర సరవణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కే.భాగ్యరాజ్ శిష్యుడు మధురాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో పృధ్వీరాజన్ కు జంటగా వీణ అనే నవ నటి కథానాయకిగా పరిచయం అవుతోంది. సరవణకుమార్ విలన్ గా నటిస్తున్న ఇందులో దర్శకుడు ఏ.వెంకటేశ్, మైనా సూచన్, టీపెట్టి గణేశన్, కూల్‌సురేశ్ తదితరులు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.
చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఒక ప్రేమ జంట ఎదుర్కొనే సమస్యలు ఇతి వృత్తంగా రూపొందుతున్న చిత్రం తొడర్ అన్నారు. తమిళనాడును ఊపేసిన ఉత్తరాది జిల్లాల్లో జరిగిన రెండు యథార్ధ సంఘటనల ఆధారంగా తెరెక్కిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. పేదవాడి ప్రేమకు అన్నీ సమస్యలేనన్న అంశాలను తెరపై ఆవిష్కరించే చిత్రంగా తొడర్ ఉంటుందని చెప్పారు.
చిత్ర షూటింగ్‌ను పొల్లాచ్చిలో ఇంతకు ముందు దేవర్‌మగన్ చిత్రాన్ని చిత్రీకరించిన ప్రాంతాల్లో నిర్వహించామని తెలిపారు. కన్నడ చిత్రం ఆప్తమిత్ర–2 ఫేమ్ సంగీత దర్శకుడు ఉత్తమరాజా ఈ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారని తెలిపారు. అంజి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment