మూడు తరాల కథ
‘‘తండ్రీ, కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. చక్కని ఫీల్ ఉన్న సినిమా. ఇలాంటి మంచి చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది’’ అని సీనియర్ నరేశ్ చెప్పారు. మధు మహంకాళి దర్శకత్వంలో నరేశ్, ఆమని ముఖ్య తారలుగా రూపాదేవి మహంకాళి నిర్మించిన చిత్రం ‘పరంపర’. అర్జున్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నరేశ్ ఆవిష్కరించి, అతిథిగా పాల్గొన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి అందజేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘మూడు తరాలకు చెందిన కథ ఇది. తన ముందు తరంవాళ్లు చేసిన తప్పును తాను చేయకూడదని తనకు జరిగిన నష్టం తన కొడుక్కి జరగకూడదని ఓ తండ్రి పడే తపనే ఈ చిత్రం’’ అని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఇదే వేదికపై మరో రెండు చిత్రాల ఆడియో ఆవిష్కరణలు జరపడం విశేషం. అవి ‘దేవ్’, ‘మళ్లీ రాదోయ్ లైఫ్’. చార్మి ప్రధాన పాత్రలో ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో డా. శిల్ప రమేష్ రమణి ‘దేవ్’ నిర్మించారు. జెస్సీ గిఫ్ట్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆవిష్కరించి, డిజిక్వెస్ట్ బసిరెడ్డికి అందించారు. ‘మళ్లీ రాదోయ్ లైఫ్’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రఘు బెల్లంకొండ నిర్మించారు. విజయ్ కురాకుల స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించి, సునీల్‌కుమార్ రెడ్డికి ఇచ్చారు.