ఆ ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటా!
పరిణీతి చోప్రాకి ఎప్పట్నుంచో ఓ కల ఉంది. ఉదయం నిద్రలేవగానే సముద్రాన్ని చూడాలన్నదే ఆ కల. ఆ కల నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి? సముద్రం కనిపించేలా ఇల్లు కట్టుకోవాలి. పరిణీతి అదే పనిలో ఉన్నారు. ఈ విషయం గురించి ఆమె చెబుతూ -‘‘ఉదయాన్నే కళ్లు తెరవగానే సముద్రాన్ని చూడాలి. ఆ సాగరఘోష అనునిత్యం నా జీవితంలో భాగం అయిపోవాలి. సముద్రానికి ఆటుపోట్లు ఎలాగో, మన జీవితంలో కష్టసుఖాలు కూడా అలానే. నా అభిరుచికి తగ్గట్టుగా నా కలల గృహాన్ని తీర్చిదిద్దుకుంటున్నాను’’ అన్నారు. ముంబయ్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బాంద్రాలో ఈ డ్రీమ్ హౌస్‌ని నిర్మించుకుంటున్నారామె.
ఈ ఇంటి గురించి వివరంగా చెబుతూ - ‘‘పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నా. మొత్తానికి నా పేరుతో బాంద్రాలో ఇల్లు కట్టుకుంటున్నా. ఇదంతా ఓ కలలా ఉంది. చిన్నతనం నుంచి నేను పుస్తకాల పురుగుని. అందుకే నా ఇల్లు ఏకంగా వెయ్యి పుస్తకాలతో నిండిపోవాలని నా ఆశ. పుస్తకాలన్నీ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఫర్నీచర్ కొనుగోలు చేస్తున్నా. విషయం ఏంటంటే... ఈ ఇంట్లో నేనొక్కదాన్నే ఉండబోతున్నా. అందుకే, ఏ టైల్స్ వేయాలి? ఏ రంగులైతే బాగుంటాయి? లాంటివన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నా’’ అని పరిణీతి తెలిపారు.