పవన్‌కు జోడిగా మలయాళీ బ్యూటీ
భారీ అంచనాల మధ్య విడుదలైన సర్దార్ గబ్బర్‌సింగ్ నిరాశపరచటంతో తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు పవన్ కళ్యాణ్. గతంలోలా.., లాంగ్ గ్యాప్ తీసుకోకుండా వెంటనే ఎస్ జె సూర్య డైరెక్షన్ లో ఓ సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో సర్దార్ గబ్బర్‌సింగ్ హీరోయిన్ ఎంపిక విషయంలో అభిమానులకు షాక్ ఇచ్చిన పవర్ స్టార్, మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నాడట.
సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ మొదలు కాకముందు అనీషా ఆంబ్రోస్‌ను, ఆ సినిమాకు హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్టు ప్రకటించాడు పవన్. అయితే అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పవన్, కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశాడు. అయితే తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాన్నే పవన్ తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
బెంగళూర్ డేస్ సక్సెస్‌తో ఆకట్టుకున్న మలయాళీ భామ పార్వతీ మీనన్‌ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. మాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెప్పించిన పార్వతి స్టార్ హీరోయిన్గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. అలాంటి హీరోయిన్, పవన్ ఇమేజ్‌కు ఎలా సూట్ అవుతుందన్న డైలామాలో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మరి పవన్ ఈ సారి రిస్క్ చేస్తాడా.? లేక అభిమానుల కోరిక మేరకు స్టార్ హీరోయిన్ వైపు మొగ్గుచూపుతాడా..? చూడాలి.