Parvathi Menon
-
నేనూ బాధితురాలినే: నటి
సాక్షి, సినిమా: నటి పార్వతీ మీనన్ నేనూ అలాంటి బాధితురాలినే అని అంటున్నారు. పూ, బెంగుళూర్ డేస్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ మలయాళీ భామ ఇటీవల మలయాళ సినీ సంఘం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అంతకు ముందు సంఘం నుంచి తొలగించబడ్డ హీరో దిలీప్‌ను మళ్లీ సంఘంలోకి తీసుకోవడాన్ని పలువురు నటీమణులు తీవ్రంగా వ్యతిరేకించి సంఘం నుంచి బయటకొచ్చారు. అందులో నటి పార్వతీ మీనన్ కూడా ఉంది. నటి భావన కిడ్నాప్, అత్యాచారయత్నం కేసు విచారణలో ఉండగానే నటుడు దిలీప్‌ను సంఘంలో చేర్చుకోవడాన్ని పార్వతి ఖండించింది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ.. సహ నటి కిడ్నాప్‌నకు గురైన సంఘటన గురించి తెలిసి తాను షాక్ అయ్యానన్నారు. ఆమెకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఇది తనను మరింత దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలిపారు. తనకూ అలాంటి సంఘటన ఎదురైందని చెప్పారు. తనను కిడ్నాప్ చేసినవారెవన్నది ఇప్పుడు వెల్లడించి కూడా శిక్ష పడేలా చేయగలనని, అయితే అలా చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. వారు ఏం చేయడానికైనా తెగిస్తారని, తనకు జరిగిన సంఘటనకు తాను మూలన కూర్చుని ఏడవలేదని, దాని నుంచి బయటపడగలిగానని అన్నారు. ఇలాంటి విషయాల్లో స్త్రీలు అవగాహనతోనూ, హెచ్చరికగానూ మసలుకోవాలని పార్వతీమీనన్ హితవు పలికారు. -
మౌనం వీడిన మమ్ముట్టి
‘కసాబా’ వివాదానికి ఫుల్స్టాప్ ఎప్పుడు? ‘‘ఇంత జరుగుతున్నా మమ్ముట్టి ఎందుకు మౌనంగా ఉన్నారు. ఆయన ఎవరికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు’’... కేరళ రాష్ట్రంలో జరుగుతోన్న చర్చ ఇది. దీనికి కారణం ‘కసాబా’లో ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్. అసలేం జరిగిందనే విషయంలోకి వెళితే.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ ప్యానల్ మెంబర్‌గా ఉన్న కథానాయిక పార్వతి మీనన్ ‘కసాబా’ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు దూమారం రేపిన విషయం తెలిసే ఉంటుంది. ఆ చిత్రంలో మమ్ముట్టి పోలీసాఫీసర్ పాత్రను పోషించారు. ఓ సన్నివేశంలో భాగంగా ఆయన ఒక లేడీ కానిస్టేబుల్ బెల్ట్ పట్టుకుని స్త్రీల సామర్థ్యం గురించి తక్కువ చేసి మాట్లాడతాడు. ఆ డైలాగ్ గురించి పార్వతీ మీనన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ – ‘‘సమాజంలో ఉన్న ప్రతి అంశాన్ని సినిమా ప్రతిబింబించేలా ఉండాలి. స్త్రీలను తక్కువగా చిత్రీకరించటాన్ని ఎంటర్టైన్మెంట్గా భావించకూడదు. ఒక స్టార్ హీరో అటువంటి సంభాషణలు పలకటం వల్ల మిగతా వారు తప్పు దోవ పట్టే అవకాశాలు ఉన్నాయి’’ అని ఆమె నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ వ్యాఖ్యలు మమ్ముట్టి అభిమానులను ఆగ్రహానికి గురి చేశాయి. పార్వతి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్›చేశారు. కొంతమందైతే ఏకంగా చంపేస్తాం, రేప్ చేస్తాం అంటూ బెదిరించారు. పార్వతీ మీనన్ వీళ్లపై పోలీసులకు కంప్లైట్ కూడా చేశారు. పోలీసులు కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. దాదాపు నెల రోజులుగా జరుగుతున్న ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడే అవకాశం కనిపించడంలేదు. ఇంత జరుగుతున్నా మమ్ముట్టి ఎందుకు స్పందించడంలేదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. దానికి సమాధానం దొరికేసింది. ఫ్యాన్స్‌ని ఎంకరేజ్ చేయను: మమ్ముట్టి ఎట్టకేలకు మమ్ముట్టి మౌనం వీడారు. గత కొంతకాలంగా సాగుతున్న ‘కసాబా’ డ్రామాకు తెర దించే ప్రయత్నం చేశారు. మమ్ముట్టి మాట్లాడుతూ – ‘‘వివాదాల్లో భాగం కావడం నాకు ఇష్టం ఉండదు. ఈ విషయం గురించి వేరేవాళ్ల దగ్గర నా అభిప్రాయం చెప్పడం ఇష్టం లేదు. ఆ మాటలు వేరే వివాదానికి దారి తీసే అవకాశం ఉంది. అందుకే స్వయంగా నేనే మాట్లాడుతున్నా’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారాయన. ‘‘పార్వతి ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకు వచ్చింది. ఇలాంటి వాటిని సీరియస్‌గా తీసుకోవద్దని తనతో చెప్పాను. ఇలాంటి చర్యలకు పాల్పడటానికి నా అభిమానులను ఎంకరేజ్ చేయను. వాక్ స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు తెలియజేసే హక్కు ఉంది’’ అని మమ్ముట్టి అన్నారు. మరి.. ఇప్పుడైనా ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడుతుందో లేదో కాలమే చెప్పాలి. అరెస్టయిన యువకుడికి జాబ్ ఆఫర్ ఈ కసాబా కాంట్రవర్శీలో తనను అమానుషంగా దూషిస్తున్న వారిలో కొందరి గురించి పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు ప్రింటో అనే వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన ప్రింటో బెయిలు పై బయటకు వచ్చాడు. అతనికి ‘కసాబా’ నిర్మాత జాబీ జార్జ్ ఓ ఆఫర్ ఇచ్చారు. ‘‘నువ్వు ఎక్కడున్నా సరే నన్ను నా ఆఫీస్ లేదా ఇంట్లో కలిస్తే నేను బ్రతికున్నంత వరకూ నీ జాబ్ బాధ్యతలు చూసుకునే పూచీ నాది. ఇండియా, దుబాయ్, యూకె, ఆస్ట్రేలియా.. ఎక్కడ కావాలంటే అక్కడ నీకు జాబ్ ఇప్పిస్తా’’ అని ఫేస్బుక్ ద్వారా జాబీ జార్జ్ పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే.. అరెస్టుల తతంగం ఒక్క ప్రింటోతో ఆగేట్లు కనిపించడంలేదు. రోజన్ అనే యువకుణ్ణి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. -
మరోసారి పల్లెటూరి యువతిగా..
పల్లెటూరి యువతిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించిన పార్వతీ మీనన్ తాజాగా ఉదయనిధి స్టాలిన్‌తో నటిస్తున్న చిత్రంలో కూడా గ్రామీణ యువతిగా కనిపించనుందట. ఇందులో పార్వతీమీనన్ పాత్రకు మరింత ప్రాముఖ్యత ఇచ్చారట. ఉదయనిధి స్టాలిన్‌తో హీరోయన్ పార్వతీ మీనన్ రొమాన్స్ చేయనుంది. అప్పుడప్పుడు కోలీవుడ్‌లో మెరిసిపోతున్న మాలీవుడ్ అమ్మడు పార్వతీమీనన్. అప్పుడెప్పుడో పూ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టి ఆ తరువాత ధనుష్‌తో మరియాన్ చిత్రంలో చాలా సన్నిహితంగా నటించి వార్తల్లోకెక్కింది. పూ చిత్రంలో పల్లెటూరి యువతిగా మొదటిసారి నటించింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని బెంగళూర్ నాట్కళ్, కమలహాసన్‌తో ఉత్తమ విలన్ చిత్రాల్లో మెరిసింది. తొలి చిత్రంలోనే మంచి నటిగా నిరూపించుకుంది. అయితే దురదృష్టం ఏమిటంటే ఈ భామ నటించిన తమిళ చిత్రాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. తనకి వచ్చిన అవకాశాలను అంగీకరించడం లేదట. మాతృభాషలో బాగానే అవకాశాలు వస్తున్నాయట. కాగా మరోసారి తమిళ సినీ అభిమానులను పలకరించడానికి పార్వతీమీనన్ రెడీ అవుతోంది. వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్న యువ నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్ నటించిన తాజా చిత్రం పొదువాగ ఎన్ మనసు తంగం గత శుక్రవారం తెరపైకి వచ్చింది. అంతకుముందే ఆయన తన తరువాత చిత్రానికి రెడీ అయిపోయారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. ఆ చిత్ర షూటింగ్ ఇటీవలేకేరళలోని షూకుట్రాళంలో ప్రారంభమైంది. సినిమా పేరును ఇంకా నిర్ణయించలేదు. ఈ చిత్రంలో హీరోయిన్గా పార్వతీమీనన్ నటించనుంది. -
పవన్‌కు జోడిగా మలయాళీ బ్యూటీ
భారీ అంచనాల మధ్య విడుదలైన సర్దార్ గబ్బర్‌సింగ్ నిరాశపరచటంతో తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు పవన్ కళ్యాణ్. గతంలోలా.., లాంగ్ గ్యాప్ తీసుకోకుండా వెంటనే ఎస్ జె సూర్య డైరెక్షన్ లో ఓ సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో సర్దార్ గబ్బర్‌సింగ్ హీరోయిన్ ఎంపిక విషయంలో అభిమానులకు షాక్ ఇచ్చిన పవర్ స్టార్, మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నాడట. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ మొదలు కాకముందు అనీషా ఆంబ్రోస్‌ను, ఆ సినిమాకు హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్టు ప్రకటించాడు పవన్. అయితే అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పవన్, కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశాడు. అయితే తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాన్నే పవన్ తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. బెంగళూర్ డేస్ సక్సెస్‌తో ఆకట్టుకున్న మలయాళీ భామ పార్వతీ మీనన్‌ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. మాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెప్పించిన పార్వతి స్టార్ హీరోయిన్గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. అలాంటి హీరోయిన్, పవన్ ఇమేజ్‌కు ఎలా సూట్ అవుతుందన్న డైలామాలో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మరి పవన్ ఈ సారి రిస్క్ చేస్తాడా.? లేక అభిమానుల కోరిక మేరకు స్టార్ హీరోయిన్ వైపు మొగ్గుచూపుతాడా..? చూడాలి. -
వసంత్ దర్శకత్వంలో పార్వతీ మీనన్
వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకులు పేర్లతో వసంత్ పేరు కచ్చితంగా ఉంటుంది. కేలడీ కణ్మణి, నీ పాది నాన్ పాది, ఆశై, నేరుక్కునేర్, రిథం లాంటి పలు విభిన్న కథా చిత్రాలు సృష్టికర్త వసంత్. దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ శిష్యుడైన ఈయన చివరి చిత్రం మూండ్రుపేర్ మూండ్రు కాదల్. తాజాగా తన్నీర్ అనే మరో వైవిధ్యభరిత కథా చిత్రాన్ని సెల్యులాయిడ్‌పై కెక్కించడానికి సిద్ధం అయ్యారు వసంత్. ఇది ప్రముఖ రచయిత అశోక్ మిత్రా రాసిన నవల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం. ఇందులో కథానాయకి పాత్రకు నటి పార్వతి మీనన్ అయితే పక్కాగా నప్పుతుందని వసంత భావించినట్లు తెలిసింది. పార్వతి మీనన్ ఇంతకుముందు పూ మరియన్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొం దారు. ఇటీవల విడుదలైన ఉత్తమవిలన్ చిత్రంలో కమల్ కూతురిగా నటిం చారు. మంచి పాత్రల కోసం తాపత్రయపడే పార్వతి చిత్రం తన్నీర్ ద్వారా మరోసారి తన సత్తా చాటుకోనున్నారన్న మాట. -
ప్రేయసి చెంతకు చేరాడా?
‘రఘువరన్ బీటెక్’, ‘అనేకుడు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో ధనుష్ ఈసారి ‘మరియన్’గా రానున్నారు. ధనుష్, పార్వతీ మీనన్ జంటగా భరత్‌బాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్వీఆర్ మీడియా అధినేత శోభారాణి తెలుగులోకి అనువదించారు. ఏఆర్ రహ్మాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటలను, ప్రచార చిత్రాలను నిర్మాత కె. అచ్చిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ -‘‘నిజజీవిత సంఘటనల ఆధారంగా భరత్ బాల ఈ చిత్రం రూపొందించారు. కడలికే రారాజునని భావించే ఓ యువకుడు అనుకోకుండా ఉగ్రవాదుల చేతుల్లో బందీ అవుతాడు. వారి నుంచి ఎలా తప్పించుకుని తన ప్రియురాలిని చేరుకున్నాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. తమిళంలో మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ వేడుకలో ఆర్.పి. పట్నాయక్, మల్టీ డెమైన్షన్ వాసు, రవి, ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. -
విదేశంలో కిడ్నాప్
ధనుష్, పార్వతి మీనన్ జంటగా భరత్ బాల దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘మరియన్’, అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఎస్వీఆర్ మీడియా పతాకంపై పలు విజయవంతమైన అనువాద చిత్రాలు అందించిన శోభారాణి ఈ చిత్రాన్ని అనువదించారు. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో నిర్మాత సి. కల్యాణ్ విడుదల చేశారు. ఈ వేడుకలో నిర్మాతలు దామోదరప్రసాద్, టి. ప్రసన్నకుమార్, హీరో ప్రిన్స్, సెన్సార్ బోర్డ్ సభ్యురాలు రాధాదేవి తదితరులు పాల్గొన్నారు. శోభారాణి మాట్లాడుతూ - ‘‘కొంత విరామం తర్వాత మేం విడుదల చేస్తున్న చిత్రం ఇది. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. విదేశాల్లో కిడ్నాప్‌కు గురైన ముగ్గురు భారతీయులు, 21 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెర నుంచి ఎలా బయటపడ్డారు? అనేది ఈ చిత్రం కథాంశం. ఏ.ఆర్. రహమాన్‌గారు స్వరపరచిన పాటలు ఓ ప్రధాన ఆకర్షణ. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అని చెప్పారు. -
మరో చిత్రానికి ఓకే
నటుడు అజిత్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. ఈయన నటించిన తాజా చిత్రం ఎన్నైఅరిందాల్. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క, త్రిష, పార్వతిమీనన్ హీరోయిన్లు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రాన్ని జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అజిత్ తరువాత శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. వీరి కలయికలో ఇంతకుముందు వీరం వంటి విజ యవంతమైన చిత్రం తెరకెక్కిందన్నది గమనార్హం. ఈ చిత్రం తరువాత మరో చిత్రానికి కూడా అజిత్ పచ్చజెండా ఊపారు. ఇంతకుముందు బిల్లా వంటి స్టైలిష్ చిత్రాన్ని, ఆరంభం వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అజిత్ హీరోగా రూపొందించిన యువ దర్శకుడు విష్ణువర్దన్ ముచ్చటగా మూడవసారి అజిత్‌తో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్ర విషయమై దర్శకుడు విష్ణువర్దన్ ఇటీవల అజిత్‌ను కలిసి చర్చించినట్టు తెలిసింది. విష్ణువర్దన్ ప్రస్తుతం ఆర్య, కృష హీరోలుగా యట్చన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీపా సన్నిధి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి పూర్తి చేసిన తరువాత అజిత్ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
మూడో హీరోయిన్ అయితేనేం?
అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని మనం కావాలనుకున్నప్పుడు అవి రావు. నటి పార్వతీమీనన్ వ్యవహారమే ఇందుకు ఒక ఉదాహరణ. ఈ మలయాళ కుట్టి పూ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ చిత్రం ప్రేక్షకుల మధ్య పర్వాలేదనిపించుకుంది. పార్వతిమీనన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విమర్శకులు సైతం ప్రశంసించారు. ఇంకేముంది పార్వతికి మరిన్ని అవకాశాలు తలుపుతట్టాయి. అయితే ఆ సమయంలో ఈ కేరళకుట్టి గ్లామర్ పాత్రలు చేయను.. ఈత దుస్తులు ధరించను.. అవకాశాలు లేకపోతే ఇంట్లో కూర్చొంటా.. అంటూ తెగ స్టేట్మెంట్ ఇచ్చేసింది. దీంతో ఆ అవకాశాలన్నీ తిరుగుముఖం పట్టాయి. చాన్నాళ్ల తరువాత ఆ మధ్య ధనుష్ సరసన మరియాన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. పార్వతిమీనన్తో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. మడికట్టుకు కూర్చొంటే లాభం లేదనుకుందో ఏమో! సొంతంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని అందాలారబోస్తూ ఫొటోలు తీసుకుని వెబ్సైట్ తదితర ఇతర ప్రసార సాధనాల్లో ప్రచారం చేసుకుంది. కొంతవరకు సక్సెస్ అయ్యింది కూడా. నటుడు కమలహాసన్ చిత్రం ఉత్తమవిలన్ చిత్రంలోను, అజిత్ హీరోగా నటిస్తున్న ఎన్నై అరిందాల్ చిత్రంలోను నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఉత్తమ విలన్ చిత్రంలో కమలహాసన్ సరసన పూజాకుమార్, ఆండ్రియాలు నటిస్తునారు. అదే విధంగా ఎన్నై అరిందాల్‌లో అజిత్‌కు జంటగా అనుష్క, త్రిషలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ పార్వతి మీనన్ మూడో హీరోయిన్ పాత్రకే పరిమితమైంది. అయితే కమలహాసన్ అజిత్ లాంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో మూడో హీరోయిన్గా నటించే అవకాశం రావడం ఆనందమే నంటోంది పార్వతి మీనన్. -
సినిమా రివ్యూ: ట్రాఫిక్
నటీనటులు: ప్రకాశ్ రాజ్, రాధిక, శరత్ కుమార్, సూర్య (గెస్ట్ అప్పియరెన్స్) చెరన్, ప్రసన్న, పార్వతి మీనన్, ఇనియా నిర్మాత: రాధిక శరత్ కుమార్, లిసిన్ స్టిఫెన్ కథ: బాబీ సంజయ్ ఫోట్రోగ్రఫి: షెహనాద్ జలాల్ మ్యూజిక్: మేజో జోసెఫ్ దర్శకత్వం: షాహిద్ ఖాదర్ ఓ యాక్సిడెంట్ సంఘటనకు అనేక ట్విస్ట్ లను జోడించి ప్రకాశ్ రాజ్, రాధిక, శరత్ కుమార్, చెరన్, ప్రసన్నలతో కలిసి రూపొందించిన చిత్రం ట్రాఫిక్. తమిళంలో విజయవంతమైన చెన్నాయిల్ ఓరు నాల్ చిత్రం తెలుగులో 'ట్రాఫిక్'గా ఫిబ్రవరి 14న విడుదలైంది. అన్ని దానాలలో అవయవ దానం గొప్పదనే ఓ సందేశంతో రూపొందిన కథేంటో ముందు చూద్దాం. యాంకర్ గా రాణించాలనే కార్తీక్ (సచిన్) కు ఓ టెలివిజన్ చానెల్ లో అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో చేరిన కార్తీక్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ గౌతమ్ కృష్ణ (ప్రకాశ్ రాజ్)ను ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది. కానీ కార్తీక్ ఓ యాక్సిడెంట్ కు గురై.. అతని బ్రెయిన్ డెడ్ అవుతుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గౌతమ్ కృష్ణ కూతురుకు గుండె మార్పిడి చికిత్స అవసరమవుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన కార్తీక్ తల్లి తండ్రులను గుండె మార్పిడికి ఒప్పించడంలో వైద్యులు సఫలమవుతారు. కోదాడలో విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్న గౌతమ్ కృష్ణ కూతురుకు గంటన్నరలోనే గుండెను అమర్చాలి. స్వల్ప వ్యవధిలో గుండె మార్పిడి జరిగిందా? హైదరాబాద్ నుంచి కోదాడకు గంటన్నరలో ఎలా చేరుకున్నారు?. మార్గమధ్యంలో ఎదురైన సంఘటనలు ఏంటి? ప్రయాణంలో ట్రాఫిక్ ఇబ్బందులను ఎలా అధిగమించారు? అనే ప్రశ్నలకు సమాధానమే ట్రాఫిక్ చిత్రం. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న గౌతమ్ కృష్ణ పాత్రలో ప్రకాశ్ రాజ్, ఆయన భార్యగా రాధిక, పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్, ట్రాఫిక్ కానిస్టేబుల్ గా చెరన్ లు తమ పాత్రలను గొప్పగా పోషించారు. క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ ప్రేక్షకులను మరింత ఆలరించింది. విశ్లేషణ: పరిమితమైన సమయంలో గమ్యం చేరుకోవాలనే ఓ టార్గెట్ ను ప్రేక్షకులకు ముందే నిర్దేశించి.. ముందే కథలో లీనమయ్యేలా చేయడంలో సఫలమయ్యారు దర్శకులు షాహిద్ ఖాదర్. తొలి భాగంలో పాత్రలు వాటి స్వరూపాలను చక్కగా చిత్రీకరించిన దర్శకుడు.. రెండో భాగంలో తన నైపుణ్యానికి పనిచెప్పారు. హైదరాబాద్ - కోదాడ ప్రయాణంలో ఓ టెంపోను క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలు, అడ్డంకులు సహజంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపింది. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి గుండె మార్పిడి జరుగుతుందా లేదా అనే ఆసక్తిని రేకెత్తించడం దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టింది. దర్శకుడి టేకింగ్ కు మేజో జోసెఫ్ బ్యాంక్ గ్రౌండ్ స్కోరు అదనపు అకర్షణగా మారింది. ప్రేక్షకుడికి చక్కటి ఫీల్ తోపాటు చిత్రాన్ని అందంగా, ఉత్కంఠను రేపే ఫొటోగ్రఫితో హెహనాద్ జలాల్ ఆకట్టుకున్నారు. రాధిక శరత్ కుమార్, లిసన్ స్టిఫెన్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. ఈ చిత్రంలో ఇగో ఉన్న నటుడిగా ప్రకాశ్ రాజ్, పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్, డ్రైవర్ పాత్రను పోషించిన చెరన్ లు అతి కీలకమైన పాత్రలు. వైద్యుడుగా ప్రసన్న కటుంబ వ్యవహారాలు, ట్రాఫిక్ కానిస్టేబుల్ చెరన్ జీవితం, కార్తీక్ ప్రేమకథ, కార్తీక్ తల్లితండ్రుల భావోద్వేగం, కూతురు రక్షించుకోవాలనే బాధతో గౌతమ్ కృష్ణ గా ప్రకాశ్ రాజ్ లాంటి అంశాలు, పలు కోణాలు ఈ కథకు మరింత బలాన్నిచ్చాయి. చక్కటి ఫీల్, భావోద్వేగం, ఓ సామాజిక నేపథ్యమున్న అంశాలను జోడించి నిర్మించిన ట్రాఫిక్ చిత్రం ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం చూశామనే భావన కలిగిస్తుంది. ప్రస్తుతం వస్తున్న రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఓ మంచి చిత్రాన్ని చూడాలనుకునే ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్ ట్రాఫిక్ అని చెప్పవచ్చు.