సినిమా రివ్యూ: ట్రాఫిక్
సినిమా రివ్యూ: ట్రాఫిక్
Published Fri, Feb 14 2014 2:39 PM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM
నటీనటులు:
ప్రకాశ్ రాజ్,
రాధిక,
శరత్ కుమార్,
సూర్య (గెస్ట్ అప్పియరెన్స్)
చెరన్,
ప్రసన్న,
పార్వతి మీనన్,
ఇనియా
నిర్మాత: రాధిక శరత్ కుమార్, లిసిన్ స్టిఫెన్
కథ: బాబీ సంజయ్
ఫోట్రోగ్రఫి: షెహనాద్ జలాల్
మ్యూజిక్: మేజో జోసెఫ్
దర్శకత్వం: షాహిద్ ఖాదర్
ఓ యాక్సిడెంట్ సంఘటనకు అనేక ట్విస్ట్ లను జోడించి ప్రకాశ్ రాజ్, రాధిక, శరత్ కుమార్, చెరన్, ప్రసన్నలతో కలిసి రూపొందించిన చిత్రం ట్రాఫిక్. తమిళంలో విజయవంతమైన చెన్నాయిల్ ఓరు నాల్ చిత్రం తెలుగులో 'ట్రాఫిక్'గా ఫిబ్రవరి 14న విడుదలైంది. అన్ని దానాలలో అవయవ దానం గొప్పదనే ఓ సందేశంతో రూపొందిన కథేంటో ముందు చూద్దాం.
యాంకర్ గా రాణించాలనే కార్తీక్ (సచిన్) కు ఓ టెలివిజన్ చానెల్ లో అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో చేరిన కార్తీక్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ గౌతమ్ కృష్ణ (ప్రకాశ్ రాజ్)ను ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది. కానీ కార్తీక్ ఓ యాక్సిడెంట్ కు గురై.. అతని బ్రెయిన్ డెడ్ అవుతుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గౌతమ్ కృష్ణ కూతురుకు గుండె మార్పిడి చికిత్స అవసరమవుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన కార్తీక్ తల్లి తండ్రులను గుండె మార్పిడికి ఒప్పించడంలో వైద్యులు సఫలమవుతారు. కోదాడలో విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్న గౌతమ్ కృష్ణ కూతురుకు గంటన్నరలోనే గుండెను అమర్చాలి. స్వల్ప వ్యవధిలో గుండె మార్పిడి జరిగిందా? హైదరాబాద్ నుంచి కోదాడకు గంటన్నరలో ఎలా చేరుకున్నారు?. మార్గమధ్యంలో ఎదురైన సంఘటనలు ఏంటి? ప్రయాణంలో ట్రాఫిక్ ఇబ్బందులను ఎలా అధిగమించారు? అనే ప్రశ్నలకు సమాధానమే ట్రాఫిక్ చిత్రం.
సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న గౌతమ్ కృష్ణ పాత్రలో ప్రకాశ్ రాజ్, ఆయన భార్యగా రాధిక, పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్, ట్రాఫిక్ కానిస్టేబుల్ గా చెరన్ లు తమ పాత్రలను గొప్పగా పోషించారు. క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ ప్రేక్షకులను మరింత ఆలరించింది.
విశ్లేషణ:
పరిమితమైన సమయంలో గమ్యం చేరుకోవాలనే ఓ టార్గెట్ ను ప్రేక్షకులకు ముందే నిర్దేశించి.. ముందే కథలో లీనమయ్యేలా చేయడంలో సఫలమయ్యారు దర్శకులు షాహిద్ ఖాదర్. తొలి భాగంలో పాత్రలు వాటి స్వరూపాలను చక్కగా చిత్రీకరించిన దర్శకుడు.. రెండో భాగంలో తన నైపుణ్యానికి పనిచెప్పారు. హైదరాబాద్ - కోదాడ ప్రయాణంలో ఓ టెంపోను క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలు, అడ్డంకులు సహజంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపింది. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి గుండె మార్పిడి జరుగుతుందా లేదా అనే ఆసక్తిని రేకెత్తించడం దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టింది. దర్శకుడి టేకింగ్ కు మేజో జోసెఫ్ బ్యాంక్ గ్రౌండ్ స్కోరు అదనపు అకర్షణగా మారింది. ప్రేక్షకుడికి చక్కటి ఫీల్ తోపాటు చిత్రాన్ని అందంగా, ఉత్కంఠను రేపే ఫొటోగ్రఫితో హెహనాద్ జలాల్ ఆకట్టుకున్నారు. రాధిక శరత్ కుమార్, లిసన్ స్టిఫెన్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. ఈ చిత్రంలో ఇగో ఉన్న నటుడిగా ప్రకాశ్ రాజ్, పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్, డ్రైవర్ పాత్రను పోషించిన చెరన్ లు అతి కీలకమైన పాత్రలు. వైద్యుడుగా ప్రసన్న కటుంబ వ్యవహారాలు, ట్రాఫిక్ కానిస్టేబుల్ చెరన్ జీవితం, కార్తీక్ ప్రేమకథ, కార్తీక్ తల్లితండ్రుల భావోద్వేగం, కూతురు రక్షించుకోవాలనే బాధతో గౌతమ్ కృష్ణ గా ప్రకాశ్ రాజ్ లాంటి అంశాలు, పలు కోణాలు ఈ కథకు మరింత బలాన్నిచ్చాయి. చక్కటి ఫీల్, భావోద్వేగం, ఓ సామాజిక నేపథ్యమున్న అంశాలను జోడించి నిర్మించిన ట్రాఫిక్ చిత్రం ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం చూశామనే భావన కలిగిస్తుంది. ప్రస్తుతం వస్తున్న రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఓ మంచి చిత్రాన్ని చూడాలనుకునే ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్ ట్రాఫిక్ అని చెప్పవచ్చు.
Advertisement
Advertisement