ప్రేయసి చెంతకు చేరాడా?
‘రఘువరన్ బీటెక్’, ‘అనేకుడు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో ధనుష్ ఈసారి ‘మరియన్’గా రానున్నారు. ధనుష్, పార్వతీ మీనన్ జంటగా భరత్‌బాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్వీఆర్ మీడియా అధినేత శోభారాణి తెలుగులోకి అనువదించారు. ఏఆర్ రహ్మాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటలను, ప్రచార చిత్రాలను నిర్మాత కె. అచ్చిరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ -‘‘నిజజీవిత సంఘటనల ఆధారంగా భరత్ బాల ఈ చిత్రం రూపొందించారు. కడలికే రారాజునని భావించే ఓ యువకుడు అనుకోకుండా ఉగ్రవాదుల చేతుల్లో బందీ అవుతాడు. వారి నుంచి ఎలా తప్పించుకుని తన ప్రియురాలిని చేరుకున్నాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. తమిళంలో మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ వేడుకలో ఆర్.పి. పట్నాయక్, మల్టీ డెమైన్షన్ వాసు, రవి, ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.