ఆస్కార్ రేసు నుంచి మన సినిమా అవుట్
ఈ ఏడాది విశ్వ సినీ వేదిక మీద మన సినిమా సత్తా చాటుతుందని భావించిన సినీ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ పోటిలో సత్తా చాటుతుందని భావించిన తమిళ సినిమా విసారణై చివరి రౌండ్ కన్నా ముందే పోటి నుంచి తప్పుకుంది. ఆస్కార్ బరిలో భారత్ తరుపున నామినేషన్ సాధించటంతో పాటు, అవార్డు కోసం ఎంపిక చేసిన 29 చిత్రాల జాబితాలో కూడా విసారణైకి స్థానం తగ్గటంతో.., ఈ సారి విశ్వసినీ వేదిక మీద భారతీయ సినిమా సగర్వంగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు సినీ జనాలు.
అయితే ఫైనల్ రౌండ్ కోసం ఎంపిక చేసిన 9 చిత్రాల్లో విసారణైకి స్థానం దక్కలేదు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మాతగా వెట్రీమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడింది. విసారణై వెనక్కు వచ్చినా భారతీయులకు ఆస్కార్ ఆశలు ఇంకా ఉన్నాయి. ఇప్పటికే రెండు ఆస్కార్ అవార్డులు సాధించిన ఏఆర్ రెహమాన్, ఈ సారి కూడా రెండు విభాగాల్లో పోటి పడుతున్నాడు. పీలే చిత్రానికి గాను ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో బరిలో ఉన్నాడు రెహమాన్.