
సాక్షి, సినిమా: నటి పార్వతీ మీనన్ నేనూ అలాంటి బాధితురాలినే అని అంటున్నారు. పూ, బెంగుళూర్ డేస్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ మలయాళీ భామ ఇటీవల మలయాళ సినీ సంఘం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అంతకు ముందు సంఘం నుంచి తొలగించబడ్డ హీరో దిలీప్‌ను మళ్లీ సంఘంలోకి తీసుకోవడాన్ని పలువురు నటీమణులు తీవ్రంగా వ్యతిరేకించి సంఘం నుంచి బయటకొచ్చారు. అందులో నటి పార్వతీ మీనన్ కూడా ఉంది.
నటి భావన కిడ్నాప్, అత్యాచారయత్నం కేసు విచారణలో ఉండగానే నటుడు దిలీప్‌ను సంఘంలో చేర్చుకోవడాన్ని పార్వతి ఖండించింది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ.. సహ నటి కిడ్నాప్‌నకు గురైన సంఘటన గురించి తెలిసి తాను షాక్ అయ్యానన్నారు. ఆమెకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఇది తనను మరింత దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలిపారు. తనకూ అలాంటి సంఘటన ఎదురైందని చెప్పారు. తనను కిడ్నాప్ చేసినవారెవన్నది ఇప్పుడు వెల్లడించి కూడా శిక్ష పడేలా చేయగలనని, అయితే అలా చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. వారు ఏం చేయడానికైనా తెగిస్తారని, తనకు జరిగిన సంఘటనకు తాను మూలన కూర్చుని ఏడవలేదని, దాని నుంచి బయటపడగలిగానని అన్నారు. ఇలాంటి విషయాల్లో స్త్రీలు అవగాహనతోనూ, హెచ్చరికగానూ మసలుకోవాలని పార్వతీమీనన్ హితవు పలికారు.