ప్రముఖ నటి శ్రీదేవి మరణంపై టాలీవుడ్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. భారతీయ వెండి తెరపై తనదైన ముద్రను వేసిన శ్రీదేవి గారి హఠాన్మరణం నమ్మలేనిదన్నారు. దుబాయిలో వివాహానికి వెళ్ళిన శ్రీదేవిగారు చనిపోయారని తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. ఆమె మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని తెలియజేస్తూ ‘అసమానమైన అభినయ ప్రతిభతో భారత ప్రేక్షక లోకం అభిమానాన్ని ఆమె చూరగొన్నారు. శ్రీదేవి గారు ఇక లేరు అనే మాట నమ్మలేనిది... కానీ ఆమె వెండి తెరపై పోషించిన భిన్నమైన పాత్రలన్నీ చిరస్మరణీయాలే.
భౌతికంగా ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర చిత్ర సీమలో సుస్థిరం. శ్రీదేవి గారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకొనే మానసిక స్థైర్యాన్ని భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నాను. బాల నటిగా, కథానాయకిగా దక్షిణ భారత సినీ రంగంలో విజయాలు అందుకొన్న శ్రీదేవి గారు అదే స్థాయిలో హిందీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. బడి పంతులు సినిమాలో బాల నటిగా ‘బూచాడమ్మ బూచాడు’ అనే పాటలో కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ పలికింఛిన హావభావాల్ని ప్రేక్షకులు మరచిపోలేరు.
అన్నయ్యతో జగదేక వీరుడు అతిలోక సుందరిలో దేవకన్య ఇంద్రజగా కనిపించిన తీరు ‘మానవా..’ అంటూ చెప్పే సంభాషణలు కూడా అందరూ గుర్తు చేసుకొనేవే. శ్రీదేవిగారు అమాయకత్వంతో పలికించే నటన మరచిపోలేనిది. విరామం తరవాత ఇంగ్లిష్ వింగ్లీష్, మామ్ చిత్రాల్లో నటించి తన శైలిని ఈ తరానికీ చూపించారు. పెద్ద కుమార్తెని కథానాయకిగా చిత్ర సీమకి తీసుకువస్తున్న తరుణంలో ఈ లోకాన్ని వీడటం బాధాకరం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment