కల్యాణ్‌కి రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశం లేదు! | Pawan Kalyan not enter to Politics, says Nagababu | Sakshi
Sakshi News home page

కల్యాణ్‌కి రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశం లేదు!

Published Tue, Oct 29 2013 12:06 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

కల్యాణ్‌కి రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశం లేదు! - Sakshi

కల్యాణ్‌కి రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశం లేదు!

                  నాగబాబు బర్త్‌డే
 సినిమాలూ సీరియల్స్‌తో నాగబాబు ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు తన కుమారుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏదైనా బోల్డ్‌గా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. నేడు నాగబాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కెరీర్, రాజకీయాలు, పవన్‌కల్యాణ్, ఇతర విషయాల గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఫోన్‌లో ముచ్చటించారు.
 
 ఈ పుట్టినరోజుకు ప్రత్యేకత ఏమైనా ఉందా?
 ఏమీ లేదు. నాకు చిన్నప్పట్నుంచీ పుట్టినరోజులు చేసుకునే అలవాటు లేదు.
 
 గుడికి వెళ్లే అలవాటు కూడా లేదా?
 ప్రత్యేకంగా పుట్టినరోజు నాడు మాత్రమే కాదు.. నాకు ప్రతిరోజూ దేవుడు గుర్తుంటాడు. వెళ్లాలనిపించినప్పుడల్లా గుడికి వెళతాను. మొన్నీ మధ్యే శబరిమల వెళ్లొచ్చాను.
 
 ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరిస్తారా?
 అంతకుముందు రెగ్యులర్‌గా శబరిమల వెళ్లేవాణ్ణి. ఇటీవల కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్లీ ఈ మధ్యనే వెళ్లొచ్చాను.
 
 ఓకే.. సినిమాల విషయానికొద్దాం. బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న ‘లెజెండ్’లో కీలక పాత్ర చేస్తున్నారని వినికిడి. నిజమా?
 ఈ చిత్రంలో నేను నటిస్తున్నాననే వార్త ప్రచారంలో ఉంది. అయితే, ఆ యూనిట్ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు.
 
 సినిమాలతో పాటు టీవీ షోస్, సీరియల్స్‌తో కూడా బిజీగా ఉన్నారనిపిస్తోంది?
 అవును. ముఖ్యంగా ‘జబర్దస్త్’ షో అయితే నాకు పెయిడ్ హాలిడేలాంటిది. నెలలో రెండురోజులు ఆ షోకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఉదయం పదినుంచి రాత్రి మూడు గంటల వరకు నిరాటంకంగా చేస్తాం. నిద్రను త్యాగం చేసినా మంచి షో అయినందువల్ల చాలా సంతృప్తిగా ఉంది. అలాగే టీవీ సీరియల్స్ చేయడం కూడా మంచి అనుభూతినిస్తోంది. త్వరలో ఓ కొత్త సీరియల్‌లో నటించబోతున్నా.
 
 మీ అంజనా ప్రొడక్షన్స్ సంస్థలో మళ్లీ సినిమా నిర్మాణం ఎప్పుడు?
 ఇప్పట్లో సినిమా నిర్మించే ఉద్దేశం లేదు. సినిమాలు, టీవీ షోస్, సీరియల్స్‌లో యాక్ట్ చేయడం.. ఇదే నా ప్రస్తుత కర్తవ్యం.
 
 ఈ మధ్య పవన్‌కల్యాణ్ రాజకీయ రంగప్రవేశం గురించి బాగా చర్చ జరిగింది. మీరిద్దరూ కలిసి ఓ పార్టీలో చేరబోతున్నారని వార్తలొస్తున్నాయి...
 మా ఇద్దరికీ ఏ పార్టీతో సంబంధం లేదు. పవన్‌కల్యాణ్ ఇప్పుడు హీరోగా ‘టాప్ స్లాట్’లో ఉన్నాడు. 
 తనకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం లేదు. దక్షిణాదిన రజనీకాంత్‌గారి తర్వాత ఆ స్థాయి పేరున్న నటుడు పవన్‌కల్యాణ్. రాజకీయాల్లోకి వచ్చి తన సినిమా కెరీర్‌ని నాశనం చేసుకోడు. ఇక నా సంగతంటారా.. చిరంజీవిగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన ప్రచార కార్యక్రమాలు చేపట్టినప్పుడు నేనూ పాల్గొనాలనుకుంటున్నా. అంతకు మించి నాకు ప్రత్యేకంగా పొలిటికల్ అజెండా లేదు. అసలు రాజకీయాలపరంగా ఎస్టాబ్లిష్ అవాలన్న ఆలోచనే లేదు.
 
 మీ అబ్బాయి వరుణ్‌తేజ్ హీరోగా ఎప్పుడు రంగప్రవేశం చేయబోతున్నారు?
 ఈ డిసెంబర్‌లో పూర్తి వివరాలు ప్రకటిస్తాను.
 
 యాక్టింగ్‌లో వరుణ్ శిక్షణ ఏమైనా తీసుకుంటున్నారా?
 వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇంకా బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. ఈ తరం హీరోకి కావాల్సిన అర్హతలన్నీ పుష్కలంగా పుణికిపుచ్చుకునే పని మీదే ఉన్నాడు.
 
 మీ కెరీర్‌తో పాటు ఇక వరుణ్ కెరీర్‌ని కూడా ప్లాన్ చేయాలన్నమాట?
 అవును. వరుణ్ కెరీర్‌కి ఉపయోగపడే మంచి సినిమాలు ఎంపిక చేయాలనుకుంటున్నాను. అలాగే, తను మంచి నటుడు అని నిరూపించుకోదగ్గ పాత్రలు చేయించాలని ఉంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement