ఎమ్మెస్ విశ్వనాథన్, వాణీ జయరామ్‌లకు పీబీఎస్ పురస్కారం
అమరగాయకుడు పీబీ శ్రీనివాస్ పురస్కారం-2013 ప్రదానోత్సవం ఆదివారం హైదరా బాద్‌లో జరిగింది. అరుణా అండ్ నృత్య గోపాల్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్‌కు పీబీఎస్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. అదే విధంగా ప్రముఖ గాయని వాణీజయరామ్‌కు పీబీఎస్ పురస్కారం అందజేశారు.
ఈ సందర్భంగా భారతీయ విద్యాభవన్ వైస్‌ఛైర్మన్ డాక్టర్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ... వెన్నెల రేయిని తలపించేలా వేడుకలు జరిగాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అరుణా అండ్ నృత్యగోపాల్ ఫౌండేషన్ నిర్వాహకులు నృత్యగోపాల్ మాట్లాడుతూ... పీబీఎస్ శ్రీనివాస్ ఆశీర్వాదంతోనే వేదికపై ప్రేక్షకుల ముందు నిలబడే భాగ్యం దక్కిందన్నారు. 2015లోనే చేయాలనుకున్న ఈ కార్యక్రమం 2013లో రెండేళ్లకు ముందుగా దైవ సంకల్పంతోనే చేపట్టినట్లు వివరించారు.
ప్రతీయేటా డాక్టర్. పీబీ శ్రీనివాస్ పేరిట జీవిత సాఫల్య పురస్కారం, వార్షిక పురస్కారాలను అందజేస్తామని తెలిపారు. అంతకు ముందు పీబీఎస్ గాన విభావరి జరిగింది. పురస్కారగ్రహీత ఎంఎస్ విశ్వనాథన్ అందరికీ నమస్కారాలు తెలిపారు. పీబీఎస్ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని వాణీజయరామ్ అన్నారు. ఈ సందర్భంగా అరుణా అండ్ నృత్యగోపాల్ ఫౌండేషన్ వారిని అభినందించారు.
నటి మంజుభార్గవి మాట్లాడుతూ... నగరంలో ఎన్నో ఆటంకాలు ఉన్నా పురస్కార కార్యక్రమానికి ఇంత పెద్ద స్థాయిలో ప్రేక్షకులు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రముఖ గాయనీ వాణీజయరాం తన గానంతో ప్రేక్షకులను అలరించారు. డ్రమ్స్ విధ్వాంసుడు ఎ. శివమణి తన తనయులైన కుమారన్, సుబేరన్‌లతో కలిసి చేసిన సంగీత కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్‌తేజ, గుండు హనుమంతరావు, లోటస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ వి.ఎస్.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.