మరిచిపోలేని ప్రయత్నం...పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం
బీఆర్ పంతులు అంటే లబ్ద ప్రతిష్టుడైన దర్శక నిర్మాత. పద్మినీ పిక్చర్స్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పెద్ద ఎత్తున సినిమాలు తీశారు.
బీఆర్ పంతులు అంటే లబ్ద ప్రతిష్టుడైన దర్శక నిర్మాత. పద్మినీ పిక్చర్స్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పెద్ద ఎత్తున సినిమాలు తీశారు. ఆయన తెలుగువాడే. పూర్తి పేరు రామకృష్ణయ్య పంతులు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తీసిన బాలల చిత్రం ‘పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం’. 1960 జూన్ 25న విడుదలైన ఈ చిత్రానికి డీవీ నరసరాజు (సంభాషణలు), దాదా మిరాసి (కథ), సముద్రాల, కొసరాజు (పాటలు), టీజీ లింగప్ప (సంగీతం), డబ్ల్యు.ఆర్. సుబ్బారావు (ఛాయాగ్రహణం)లాంటి హేమాహేమీలు పనిచేశారు. సినిమాకు టైటిల్ పెట్టింది కొసరాజు. తమిళ అగ్రనటుడు శివాజీ గణేశన్ ఇందులో అతిథిగా కనిపిస్తారు.
మిక్కిలినేని, రాజనాల, రమణారెడ్డి, బి.ఆర్. పంతులు, బేబీ లక్ష్మి, బేబీ సుమ, బేబీ విమల, మాస్టర్ గోపి, మాస్టర్ వెంకటేశం తదితరులు నటించారు. అంజిబాబు (పాతాళభైరవి) ప్రధానపాత్ర పోషించారు. ఓ చిన్న పాత్రలో చిడతల అప్పారావు తళుక్కున మెరుస్తారు. అలాగే బాపు సినిమాలో ఎక్కువగా కనిపించే ఝాన్సీ కూడా చిన్న పాత్ర చేశారు.సినిమా కథ విషయానికొస్తే... గుణసేనుడనే రాజు రాచరిక వ్యవస్థను అంతం చేసి ప్రజారాజ్యాన్ని స్థాపించాలనుకుంటాడు. ఇది నచ్చక మహామంత్రి, సేనాధిపతి తదితరులు కుట్రపన్ని రాజు ఉన్న వేదికను పేల్చేస్తారు. దాంతో మహామంత్రి ఆ రాజ్యానికి రాజవుతాడు. కానీ గుణసేనుడు ఆ ప్రమాదం నుంచి బయటపడి భార్యతో సహా పాతాళానికి చేరతాడు. ముని శాపం వల్ల రాజు మామిడి చెట్టు అయిపోతాడు.
రాణి, విజయసేనుడికి జన్మనిస్తుంది. చిన్నతనం నుంచే అతను విప్లవ నాయకుడుగా ఎదుగుతాడు. ఎక్కడ అన్యాయం జరిగినా పిల్లలందర్నీ కూడగట్టుకుని ఎదిరిస్తాడు. విజయసేనుడికి యువరాణితో స్నేహం ఏర్పడుతుంది. వీరంతా కలిసి రాజుపై తిరుగుబాటు చేస్తారు. అందరిలో మార్పు తీసుకువచ్చి ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ చిత్రంలోని తారల నటన, మేకప్ చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. రాజనాల నటన చాలా వింతగా తోస్తుంది. హాస్యం చాలా సుకుమారంగా ఉంటుంది. కొరియోగ్రఫీ అత్యద్భుతంగా చేశారు. ముఖ్యంగా బాలతారల నటన అద్భుతం. అక్షరాలను స్పష్టంగా పలకడం, ఐదు నిముషాల పాటు సింగిల్ టేక్‌లో డైలాగులు చెప్పడం ఈ బాలల ప్రతిభకు నిదర్శనం. సుమారు వందమందికి పైగా పిల్లలు ఇందులో నటించారు. మళ్లీ మళ్లీ ఇటువంటి చిత్రాన్ని తీయలేరేమోనన్నంత చక్కటి ప్రయత్నమిది. ఇటువంటి చిత్రాలు మరిన్ని వస్తే బాగుండుననిపిస్తుంది. కానీ మళ్లీ మళ్లీ రావు.
- డా.వైజయంతి