ఆ ఆలోచన నాకు లేదు
‘‘ముప్పై ఏళ్లుగా ఆర్.డి. బర్మన్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకూ చాలామంది సంగీతదర్శకులతో పనిచేశా. ఇప్పుడు కూడా రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న రజనీకాంత్ ‘2.0’ చిత్రానికి సంగీతం బృందంలో చేస్తున్నా. అనుభవం ఉన్న సంగీతదర్శకుల దగ్గర పని చేయడం వల్లే సంగీతదర్శకుడిగా నేనెక్కువ సినిమాలు చేయలేకపోయా’’ అన్నారు ‘ప్రాణం’ కమలాకర్. విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం జంటగా డి. సురేశ్‌బాబు సమర్పణలో అనుదీప్ కె.వి.దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్ పి. నిర్మించిన ‘పిట్టగోడ’ ఈ నెల 24న విడుదల కానుంది.
ఈ చిత్రానికి స్వరాలు అందించిన కమలాకర్ మాట్లాడుతూ –‘‘రామ్మోహన్‌గారు ‘పిట్టగోడ’కు సంగీతం అందించమన్నప్పుడు మాంటేజ్ సాంగ్స్ షూట్ చూసి, పాటలకు ప్రాధాన్యం ఉందనిపించి ఒప్పుకున్నా. నేను సినిమాలకు సంగీతం అందించడం మానలేదు. మానేయాలనే ఆలోచనా లేదు. ఇప్పుడు కొన్ని చిత్రాలకు సంగీతం ఒకరు, నేపథ్య సంగీతం మరొకరు అందిస్తున్నారు. అది నాకిష్టం ఉండదు. అందుకే ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం రెండూ నేనే అందించా’’ అన్నారు.