
ఎన్టీఆర్ సినిమాకు టాప్ టెక్నీషియన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాల సక్సెస్లతో సత్తా చాటిన జూనియర్ ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు పవర్ ఫేం బాబీ దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం కాస్టింగ్, టెక్నిషియన్స్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తుండటంతో గ్రాఫిక్స్, షూటింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ద అవసరమవుతుందని భావిస్తున్నారు. జాతీయ స్థాయి సినిమాటోగ్రాఫర్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన యూనిట్ సభ్యులు ఓ టాప్ టెక్నిషియన్ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. బాలీవుడ్లో పీకే, త్రీ ఇడియట్స్, మొహెంజొదారో లాంటి భారీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన సీకె మురళీధరన్ను ఈ సినిమాకు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న మురళీధరన్ను భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసైనా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.