జ్యోతిలక్ష్మి కోసం కసరత్తులు | plans for jyothi lakshmi | Sakshi
Sakshi News home page

జ్యోతిలక్ష్మి కోసం కసరత్తులు

Published Wed, Nov 12 2014 1:12 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

జ్యోతిలక్ష్మి కోసం కసరత్తులు - Sakshi

జ్యోతిలక్ష్మి కోసం కసరత్తులు

ఒకప్పుడు నవలాధార చిత్రాలు విరివిగా వచ్చేవి. అప్పట్లో అదొక ట్రెండ్. ఇప్పుడా పరిస్థితి లేదు. కానీ, పూరి జగన్నాథ్ మాత్రం త్వరలో ఓ నవలాధార చిత్రం చేయనున్నారు. ప్రసిద్ధ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల ఆధారంగా ‘జ్యోతిలక్ష్మి’ పేరుతో ఆ సినిమా తెరకెక్కనుంది. టైటిల్ రోల్‌ను చార్మి పోషిస్తున్నారు. జ్యోతిలక్ష్మిగా కనబడడం కోసం చార్మి ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారు. ఆ విశేషాలను చార్మి వివరిస్తూ -‘‘పూరీ బాలీవుడ్‌లో రూపొందించిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాలో నేనూ నటించాను.

అమితాబ్‌తో నటించే అదృష్టం ఆ సినిమాతో నాకు కలిగించింది. ఆ సినిమా టైమ్‌లో ‘నువ్వు రెండు వారాల్లో పద్దెనిమిదేళ్ల అమ్మాయిలా కనబడాలి’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టే రెండువారాల్లో పద్దెనిమిదేళ్ల అమ్మాయిలా తయారయ్యాను. తాజాగా ‘జ్యోతిలక్ష్మి’ కథ గురించి చెప్పారు. ‘నువ్వే కథానాయిక’ అనగానే నా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఈ సినిమా కోసం నా పాత స్టిల్స్ కొన్ని నాకు చూపించారు. ‘ఇలా మారాలి’ అని చెప్పి చిన్న ఎన్టీఆర్ చిత్ర షూటింగ్‌కి గోవా వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఆయన చెప్పినట్లు మారే ప్రయత్నంలో ఉన్నాను. క్రమం తప్పకుండా వర్కవుట్లు చేస్తున్నాను. బెల్లీ డాన్స్, క్లబ్ డాన్స్ కూడా నేర్చుకుంటున్నాను. అంతేకాదు, మూడు నెలలుగా జట్టు కూడా కత్తిరించుకోలేదు. పొడవాటి కురులతో భారతీయ స్త్రీలా కనిపించాలనేదే నా తాపత్రయం’’ అని చెప్పుకొచ్చారు. ‘జ్యోతిలక్ష్మి’ సినిమా గురించి చెబుతూ -‘‘టైటిల్ విన్న ఎవరైనా ఇది ప్రముఖ నృత్యాతార జ్యోతిలక్ష్మిగారి జీవిత కథ అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. ఇది ఆమె కథ కాదు. ఎవర్నీ అనుకరించి, అనుసరించి చేస్తున్న సినిమా కాదు ఇది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్’’ అని తెలిపారు చార్మి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement