పాక్ లో దీపావళి జరుపుకున్న బాలీవుడ్ నటి
ముంబై: కశ్మీర్ లోని ఉడీ స్థావరంపై ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్థాన్ నటీనటులను మనదేశంలోని సినిమాల్లో నటించకుండా నిషేధం విధించారు. పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించాడన్న కారణంతో కరణ్ జోహర్ సినిమా 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు అవరోధాలు ఎదురయ్యాయి. ఈ సినిమా పాకిస్థాన్ లో విడుదల కాలేదు.
ఇన్ని ఉద్రిక్తతల నడుమ బాలీవుడ్ నటి, దర్శకనిర్మాత పూజాభట్ పాకిస్థాన్ వెళ్లారు. అంతేకాదు దీపావళి పండుగను కరాచీలో జరుపుకుని తిరిగివచ్చారు. గాయకుడు అలీ అజమాత్ ఆహ్వానం మేరకు అతిథిగా పాకిస్థాన్ వెళ్లారు. కరాచీకి వెళ్లిరావడం తనకెంతో సంతోషానిచ్చిందని పూజాభట్ పేర్కొన్నారు. గతంలోనూ పలుమార్లు పాకిస్థాన్ వెళ్చొచ్చానని వెల్లడించింది. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పూజాభట్ పాక్ పర్యటన బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.