
సీటీమార్... సీటీమార్... సీటీమార్... ‘డీజే–దువ్వాడ జగన్నాథమ్’లోని ఈ పాట చూశారా? అందులోనూ, ఆ సినిమాలోనూ పూజా హెగ్డేను చూశారా? ఎంత అందంగా ఉంటుందో కదూ! ఈ మంగుళూరు బ్యూటీ అందానికి కుర్రకారు ‘సీటీమార్... సీటీమార్...’ అంటున్నారు. చూపులను మాత్రమే కాదు... మనసునూ కదిలించే అందం పూజాది! అందమైన ముఖం, శరీరాకృతి మాత్రమే కాదు... తనకు అందమైన మనసూ ఉందని నిరూపించుకుంటున్నారీ సుందరి.
మొన్నే అక్టోబరులో క్యాన్సర్‌ను జయించే చిన్నారుల మధ్య తన పుట్టినరోజును జరుపుకున్నారు పూజా హెగ్డే. వాళ్లతో కొంతసేపు గడిపి ధైర్యం నింపారు. అంతే కాదు... వీలు చిక్కినప్పుడల్లా సమాజ సేవ చేస్తున్నారు. ఇటీవల బెల్లకొండ సాయిశ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సాక్ష్యం’ చిత్రీకరణ కోసం హోస్‌పేట్ వెళ్లారు పూజ. అక్కడ షెడ్యూల్ పూర్తయిన తర్వాత వందమంది చిన్నారులకు పుస్తకాలు, ఫుడ్ ఐటమ్స్ పంచిపెట్టారు. పూజ అందంతో పాటు ఆమె చేస్తున్న సమాజసేవకీ సీటీమార్ అనాలనిపిస్తోంది కదూ!!