టైటిల్ : సాక్ష్యం
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే, జగపతి బాబు, వెన్నెల కిశోర్, అశుతోష్ రానా
సంగీతం : హర్షవర్థన్ రామేశ్వర్
దర్శకత్వం : శ్రీవాస్
నిర్మాత : అభిషేక్ నామా
అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జయ జానకీ నాయక సినిమాతో సూపర్ హిట్ సాధించి మంచి ఫాంలో ఉన్నాడు. అదే జోరులో శ్రీవాస్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సాక్ష్యం సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మరోసారి బెల్లంకొండకు సక్సెస్ అందించిందా..? ఇప్పటి వరకు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు తెరకెక్కించిన శ్రీవాస్ ఈ సినిమాతో భారీ యాక్షన్ చిత్రాలను కూడా డీల్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడా..?
కథ ;
రాజు గారు (శరత్‌కుమార్) స్వస్తిక్ నగరం అనే చారిత్రాత్మక ప్రాంతంలో ఉండే పెద్ద మనిషి. అదే ప్రాంతంలో ఉండే మును స్వామి (జగపతి బాబు) అతని తమ్ముళ్లు చేసే అన్యాయాలను ఎదిరిస్తుంటారు. ఇది సహించలేని మునుస్వామి మొత్తం రాజుగారి కుటుంబాన్ని చంపేస్తాడు. రాజుగారి భార్య తన కొడుకును ఓ లేగ దూడకు కట్టి తప్పిస్తుంది. అలా చావు నుంచి తప్పించుకున్న పిల్లాడిని ఓ వ్యక్తి తీసుకెళ్లి కాశీలో వదిలేస్తాడు. (సాక్షి రివ్యూస్) పిల్లలు లేని శివ ప్రకాష్ (జయ ప్రకాష్) దంపతులు ఆ పిల్లాడికి విశ్వాజ్ఞ (బెల్లంకొండ శ్రీనివాస్) అని పేరు పెట్టుకొని పెంచుకుంటారు. శివ ప్రకాష్‌కు విదేశాల్లో వ్యాపారాలు ఉండటంతో విశ్వా కూడా అక్కడే పెరిగి పెద్దవాడవుతాడు.
అడ్వంచరస్ లైఫ్‌ను ఇష్టపడే విశ్వా రియాలిటీ వీడియో గేమ్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు. అక్కకు తోడుగా ఉండేందుకు అమెరికా వచ్చిన సౌందర్య లహరి(పూజ హెగ్డే) ప్రవచనాలు చెపుతుండగా చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇండియన్ ట్రెడిషన్ పై తాను చేసే ఓ వీడియో గేమ్ కు సాయం చేయమని సౌందర్యను అడుగుతాడు. సౌందర్య.. వాల్మీకి (అనంత శ్రీరామ్) అనే వ్యక్తిని విశ్వకు పరిచయం చేస్తుంది. వాల్మీకి పంచభూతాల నేపథ్యంలో ఓ రివేంజ్ డ్రామా కాన్సెప్ట్ చెప్తాడు. అదే సమయంలో విశ్వ, సౌందర్యలు చిన్న అపార్థం కారణంగా విడిపోతారు. సౌందర్య ప్రేమకోసం ఇండియా వచ్చిన విశ్వను పంచభూతాలు ఎలా నడిపించాయి..? తనకు తెలియకుండా తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని విశ్వ ఎలా అంతమొందించాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు ;
బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా సినిమాకు మంచి పరిణితి చూపిస్తున్న ఈ యంగ్ హీరో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సాక్ష్యంలో మరింతగా మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్, డ్యాన్స్ లు ఇరగదీశాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన సినిమాకు తనవంతుగా పూర్తి న్యాయం చేశాడు. సౌందర్య లహరి పాత్రలో పూజా హెగ్డే ఒదిగిపోయింది. నటనపరంగా ఓకే అనిపించినా గ్లామర్, లుక్స్‌తో సూపర్బ్ అనిపించింది.(సాక్షి రివ్యూస్) విలన్ గా జగపతి బాబు మరోసారి తన మార్క్ చూపించారు. వేమన పద్యాలు చెపుతూ సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మంచి విలనిజం పండించారు. జగపతి బాబు తమ్ముళ్లుగా నటించిన అశుతోష్ రానా, రవికిషన్‌లు కూడా తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో జయ ప్రకాష్, పవిత్రా లోకేష్, రావూ రమేష్, వెన్నెల కిశోర్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
విశ్లేషణ ;
పంచభూతాలే ప్రతీకారం తీర్చుకుంటాయన్న డిఫరెంట్ (ఫాంటసీ) కాన్సెప్ట్ తో కథను రెడీ చేసుకున్న దర్శకుడు శ్రీవాస్ పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో సినిమాను తెరకెక్కించాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌కు గత చిత్రం జయ జానకీ నాయకతో వచ్చిన మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌తో కథ నడిపించాడు. ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని బ్యాలెన్స్ చేసిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో నడిపించాడు. (సాక్షి రివ్యూస్)హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. పాటలు వినడానికి, చూడటానికి బాగున్నా కథనం మధ్యలో స్పీడు బ్రేకర్లలా మారి ఇబ్బంది పెడతాయి. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అభిషేక్ నామా ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు.
ప్లస్ పాయింట్స్ :
బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్
సినిమాటోగ్రఫి
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ ;
కథనం మధ్యలో ఇబ్బంది పెట్టే పాటలు
సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్.
మరిన్ని రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment