చైతూకి జోడీగా...
మిస్సిండియా పూజా హెగ్డే త్వరలో తెలుగుతెరపై తళుక్కున మెరవనున్నారు. అక్కినేని నటవారసుడు నాగచైతన్యకు జోడీగా ఈ ముద్దుగుమ్మ నటించనున్నారు. ఇంతకీ వీరిద్దరూ కలిసి నటించనుంది ఏ సినిమాలో అనుకుంటున్నారా? ‘గుండెజారి గల్లంతయ్యిందే...’ లాంటి అందమైన విజయాన్ని టాలీవుడ్‌కి అందించిన విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించనున్న చిత్రంలో వీరి జోడీ అలరించనుంది.
డిసెంబర్‌లో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రంలో నటించనున్నందుకు పూజా చెప్పలేనంత ఆనందంగా ఉన్నారు. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ బ్యూటిఫుల్ మూవీ ఇదని, ఇందులో తన పాత్ర నేటి టీనేజ్ అమ్మాయిలకు ప్రతినిథిలా ఉంటుందని పూజా చెబుతున్నారు. నాగచైతన్య కూడా ఇందులో హుషారైన యువకునిగా, అన్యాయాన్ని ప్రతిఘటించే ధీరునిగా కనిపిస్తారట. అక్కినేని అభిమానులు పండగ చేసుకునేలా విజయ్‌కుమార్ కొండా ఈ చిత్రం స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.