ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ పూజ హెగ్డే. తరువాత ముకుంద సినిమాతో టాలీవుడ్కు మంచి చేరువైంది. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో.. వరుస అవకాశాలను అందుకోలేకపోయింది. అదే సమయంలో బాలీవుడ్లో అవకాశాలు వచ్చినా సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో తిరిగి టాలీవుడ్ మీద దృష్టిపెట్టిన ఈ బ్యూటి ఓ క్రేజీ ప్రాజెక్ట్లో చాన్స్ కొట్టేసింది.
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో హీరోయిన్గా నటించింది పూజ. తొలి రెండు చిత్రాల్లో పద్దతిగా కనిపించిన ఈ భామ, డీజేలో మాత్రం గ్లామర్ లుక్ ఇరగదీసింది. అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్ అవుతోంది. ప్రస్తుతం మురుగసదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు, ఆ తరువాత సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు.
ఆ తరువాత తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమైన ఈ సినిమాలో మహేష్కు జోడిగా పూజ హెగ్డేను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మహేష్ మూవీ హీరోయిన్పై అధికారిక ప్రకటన లేకపోయినా.. పూజ హెగ్డేనే ఫైనల్ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది.