ఉప్మా తినేసింది.. హీరోయిన్‌ అయ్యింది.. | Poojitha Ponnada in Keerthy Suresh Miss India Movie | Sakshi
Sakshi News home page

నిజమేంటో.. సినీ పరిశ్రమకు తెలుసు..

Published Tue, Mar 17 2020 7:57 AM | Last Updated on Tue, Mar 17 2020 7:57 AM

Poojitha Ponnada in Keerthy Suresh Miss India Movie - Sakshi

పూజిత పొన్నాడ

ఎన్ని కష్టాలు పడితేగానీ సినిమా ఇండస్ట్రీలో అవకాశం రాదు.. అలాంటిది ఆమెకు మాత్రం ఈజీగా వచ్చింది. పుట్టింది వైజాగ్‌లో.. చదివింది ఢిల్లీ–చెన్నైలో.. బీటెక్‌ పూర్తయిన తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసింది హైదరాబాద్‌లో.. తన పని తాను చేసుకుంటుండగా ఓ షార్ట్‌ఫిలింలో అవకాశం వచ్చింది. కాదనకుండా నటించాల్సి వచ్చింది. అది కాస్తా సినిమా ఆఫర్లను తెచ్చిపెట్టింది. అందం.. అభినయం తోడవడంతో సినిమాల్లో హీరోయిన్‌గా బిజీగా మారిపోయింది. నటనా ప్రతిభతో తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోంది మన తెలుగమ్మాయి పూజిత పొన్నాడ. ఈ సందర్భంగా ఆమె తనఅనుభవాలను ‘సాక్షి’తో పంచుకుంది.

పెద్ద సినిమాల్లో అవకాశాలు..   
నాన్న బిజినెస్‌మెన్‌.. అమ్మ గృహిణి.. పుట్టింది వైజాగ్‌.. కానీ చదివింది ఢిల్లీ– చెన్నైలో.. చెన్నైలో ఇంజినీరింగ్‌ చేశాను. తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేశా.. ‘ఉప్మా తినేసింది’ అనే షార్ట్‌ఫిలింతో పరిచయమయ్యా. నా మొదటి సినిమా సుకుమార్‌ రైటింగ్స్‌లో వచ్చిన ‘దర్శకుడు’. అనంతరం రామ్‌చరణ్‌ రంగస్థలం, బ్రాండ్‌ బాబు, కల్కిలాంటి చిత్రాల్లో నటించాను. కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్‌ ఇండియా’ చిత్రంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాను. తెలుగులో ఆది, తరుణ్‌ హీరోగా నటిస్తున్న ‘కథ కంచికి.. మనం ఇంటికి’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నాను. 

మూడు చిత్రాలు విడుదలకు సిద్ధం
తమిళంలో మంచి అవకాశాలు వచ్చాయి. చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళం బాగా మాట్లాడతా.. ఈ సంవత్సరంలో మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘బాయ్స్‌’ మూవీలో హీరోగా నటించిన హీరో భరత్‌తో పాటు హీరోలు విమల్, అరిల చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నాను. మూడు చిత్రాలు మూడు విభిన్న కోణాల్లో రూపుదిద్దుకుంటున్నాయి. తెలుగు ఆహా వెబ్‌ యాప్‌లో వెబ్‌సిరీస్‌ను హీరో నవదీప్‌తో కలిసి చేశాను. వెబ్‌ సిరీస్‌లలో అవకాశాలు చాలా వస్తున్నాయి. హిందీలో ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ నుంచి మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. 

నిజమేంటో.. సినీ పరిశ్రమకు తెలుసు..

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో చేయాలని ఉంది. అంతేగాకుండా దర్శకుడు సుకుమార్‌తో మరోసారి కలిసి పనిచేయాలని ఉంది. తెలుగులో కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెప్పించేందుకు నా వంతు కృషిచేసి అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాను. నాపై పలు రూమర్స్‌ కూడా వచ్చాయి.. వాటిని నేను పట్టించుకోను. నిజం ఏంటో సినీ పరిశ్రమకు తెలుసు. పరిశ్రమలో కష్టపడితే తప్పకుండా ఫలితం లభిస్తుంది. సాధించాలనే తపన, నిజాయితీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement