అతన్ని ప్రేమలో పడేసిన పూనంబాజ్వా
ఎంతవారుగానీ, వేదాంతులైనగానీ కాంతదాసులే అన్నారో కవి. అలా 40 ఏళ్ల బ్రహ్మచారి, రాజకీయమే జీవితంగా సాగిపోతున్న సుందర్.సీని ఒక్క చూపుతోనే ప్రేమలో పడేసింది నటి పూనంబాజ్వా. ఆమె ప్రేమ మైకంలో పడి సుందర్.సీ గిలగిలా కొట్టుకున్న వైనం చూడాలంటే ఇంకొంచెం రోజులు ఆగాల్సిందే. విషయం ఏమిటంటే దర్శకత్వం, నటన అంటూ మారి మారి రెండు విధాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న దర్శకుడు సుందర్.సీ తాజాగా కథానాయకుడు,నిర్మాతగా మారి నటి పూనంబాజ్వాతో రొమాన్స్ చేస్తున్నారు. మలయాళంలో మంచి విజయం సాధించిన వెళ్లిమూంగా చిత్ర తమిళ్ రీమేక్‌లో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. దీనికి సుందర్.సీ శిష్యుడు వెంకటరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు.
అరణ్మణై-2 చిత్రంలో పరిధి తక్కువ పాత్రలో అయినా అందాలారబోసి ఆకట్టుకున్న పూనంబాజ్వాకు సుందర్.సీ ఈ చిత్రంలో సోలో హీరోయిన్‌గా అవకాశం ఇవ్వడం విశేషం. ఈ చిత్రంలో తన పాత్ర గురించి పూనంబాజ్వా తెలుపుతూ ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో తాను పూర్తిగా డీగ్లామర్ పాత్రను పోషిస్తున్నానని చెప్పింది. అయితే తన పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని తెలిపింది. ఇది ఒక చిన్న పట్టణంలో జరిగే కథాంశంతో రూపొందుతున్న చిత్రం అని చెప్పింది. ఈ చిత్రంతో తన టైమ్ బాగుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
పెళ్లికి దూరంగా రాజకీయమే జీవితంగా సాగే 40 ఏళ్ల సుందర్.సీ యుక్త వయసు విద్యార్థి పూనంబాజ్వా కంట పడగానే తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడట. ఇక ఆ తరువాత ఇటు ప్రేమ, అటు రాజకీయాలతో ఎదురయ్యే సమస్యలను వినోదాల విందుగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం ఇదని యూనిట్ వర్గాలు వెల్లడించారు. తిరునల్వేలి, చెన్నై, ఢిల్లీ ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రానికి రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. దీనికి సిద్ధార్థ్‌విపిన్ సంగీత బాణీలు కడుతున్నారు.