ప్రస్తుతం నా జీవితం ఈ మూడింటికే అంకితం! | Pop Singer Smita Special Interview | Sakshi
Sakshi News home page

ప్రస్తుతం నా జీవితం ఈ మూడింటికే అంకితం!

Published Wed, Sep 3 2014 11:35 PM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM

ప్రస్తుతం నా జీవితం ఈ మూడింటికే అంకితం! - Sakshi

ప్రస్తుతం నా జీవితం ఈ మూడింటికే అంకితం!

‘‘నేను చేసే ఏ పని అయినా సమాజానికి ఉపయోగపడాలన్నది  నా ఆకాంక్ష’’ అని స్మిత అన్నారు. పాప్ గాయనిగా  ఆమె తెచ్చుకున్న పేరు, ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, కొంత కాలంగా  ఆమె ‘పాప్’ ఆల్బమ్స్ చేయడం లేదు. ఆధ్యాత్మిక బాటలో  నడుస్తున్నారని తెలిసింది. అసలు స్మిత ఇప్పుడేం చేస్తున్నారు? ఆమె భవిష్యత్తు ప్రణాళిక లేంటి? వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? తదితర ప్రశ్నలకు సమాధానమే ఆమెతో జరిపిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ...
 
 ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అసలు మీ లక్ష్యం ఏంటి?
 డిసెంబర్‌లో నేనో కార్యక్రమం చేయనున్నా. దాని గురించి ఇప్పుడు చెప్పను. కానీ, దాని కోసమే ప్రత్యేకంగా ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఇందులో భాగంగా ‘కిక్ బాక్సింగ్’ నేర్చుకుంటున్నా. ఇంకా హిందుస్తానీ మ్యూజిక్‌కి సంబంధించిన డాన్స్‌ని వేరే పద్ధతిలో జనం ముందు ప్రదర్శించాలన్నది నా కోరిక. అందుకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నా.
 
 ‘ఆలయం’, ‘బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ’, ఎక్స్‌ప్రెస్’... ఇలా పలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. వాటి గురించి చెబుతారా?
 ‘ఆలయం’ అనేది పూర్తిగా చేనేత వస్త్రాలకు సంబంధించినది. చీరలు, డ్రెస్‌లు అన్నీ వుంటాయి. నవరాత్రులప్పుడు ప్రత్యేకంగా ఒక్కోరోజు ఒక్కోరకం చేనేత చీరలను కొత్తగా డిజైన్ చేసి, ప్రదర్శిస్తుంటాం. బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీకి సంబంధించి రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటికే ఏడు శాఖలున్నాయి. ఇక, విజయవాడలో ఉన్న జిమ్ సెంటర్ ‘ఎక్స్‌ప్రెస్’ నిర్వహణ కూడా బాగుంది. ఇవే కాదు.. మ్యూజిక్‌కి సంబంధించి ‘మ్యాడ్’ అనే స్కూల్ కూడా నిర్వహిస్తున్నా. బేసిక్‌గా వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా చిన్నప్పుడు మా అమ్మా, నాన్న చేసే వ్యాపారాల మీద ఆసక్తి కనబర్చేదాన్ని.
 
 బహుశా ఇన్ని వ్యాపారాలతో బిజీగా ఉండటంవల్లే ‘పాప్’ మ్యూజిక్‌కి దూరంగా ఉంటున్నారేమో?
 పాప్ అంటే అదేదో వెస్ట్రన్ మ్యూజిక్ అనుకుంటారు చాలామంది. కానీ, ‘పాపులర్ అయిన మ్యూజిక్’ని పాప్ మ్యూజిక్ అంటారు. అలా చూస్తే.. మన భారతీయ జానపద గీతాలు కూడా ‘పాప్’ కిందకే వస్తాయి.  పాప్‌కి ఒక జానర్ అంటూ లేదు. నేను చేస్తున్న భక్తి గీతాలు కూడా పాప్ కిందే లెక్క.
 
 ఆ మధ్య ‘ఐ క్యాండీ’ అనే సంస్థ ఆరంభించి, బుల్లితెర కోసం ‘షో’ చేశారు. ఆ తర్వాత మళ్లీ చేయకపోవడానికి కారణం?
 వాస్తవానికి రెగ్యులర్‌గా షోస్ చేయాలనే ఆలోచనతో ఆ సంస్థ ఆరంభించలేదు. ప్రతిభ గల నృత్యకళాకారులను ప్రోత్సహించాలనే ఆకాంక్షతోనే అది చేశాను. ఆ షో ముగిసింది. భవిష్యత్‌లో మంచి మ్యూజిక్ బేస్డ్ షో చేయాలనిపిస్తే అప్పుడు చేస్తా.
 
 కొంత కాలంగా ఆధ్యాత్మిక బాటలో వెళుతున్నట్లనిపిస్తోంది.. ముఖ్యంగా ‘ఇషా ఫౌండేషన్’పై మమకారం పెంచుకున్నట్లున్నారు?
 అవును. ఇషా గురించి నా స్నేహితురాలు చెబితే, కోయంబత్తూరు వెళ్లాను. అక్కడో మూడు రోజులున్నాను. ఆ మూడు రోజులూ నాకు లభించిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. మాతా, పితా, దైవం కన్నా మంచి సద్గురువు ముఖ్యం. జగ్గీ వాసుదేవ రూపంలో సద్గురువు దొరికారు. ఇషా ఫౌండేషన్ నుంచి వచ్చిన తర్వాత నా ఆలోచన విధానం, జీవితాన్ని చూసే కోణం మారింది. నిర్ణయాలు తీసుకునే విషయంలో అంతకుముందుకన్నా వేగం, స్పష్టత వచ్చింది. జీవితంలో జరిగే ప్రతిదానికీ కారణం ఉంటుందనే నమ్మకం ఏర్పడింది.
 
 అక్కడ పొందిన అనుభూతి వల్లేనా ‘యోగేశ్వరాయ...’ ఆల్బమ్ చేశారు?
 అవును. నాకో మంచి అనుభూతి కలిగేలా చేసిన నా గురువు జగ్గీ వాసుదేవ కోసం నేనేమైనా చేయాలనుకున్నాను. ఆల్బమ్ చేస్తానని నా గురువు దగ్గర చెప్పాను. సరే అన్నారు. ఆరు నెలల్లో పూర్తి చేశా.
 
 ఆల్బమ్ ద్వారా వచ్చిన డబ్బు సేవా కార్యక్రమాలకు వినియోగించినట్లున్నారు?
 సంగీతానికి సంబంధించి నేనేం చేసినా.. నా ట్రస్ట్‌కి కొంత డబ్బు వెళ్లిపోతుంది. ముఖ్యంగా నా ముందున్న లక్ష్యం ఖమ్మంలోని ఓ సంస్థ. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్‌కి సంబంధించిన ఆ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితురాలినయ్యాను. అందుకే, నా వంతుగా ఆర్థిక సహాయం చేస్తున్నా. ఈ మధ్యకాలంలో నేను ‘షో’స్ చేయలేదు. కానీ, ఈ సంస్థకు ఓ నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న సదాశయంతో ఈ 20న యూఎస్‌లో ఓ షోలో పాల్గొంటున్నా.
 
 మీ జీవన శైలి ఆధునికం. మీరేమో ఆధ్మాత్మికమంటున్నారు. పొంతన కుదరట్లేదే?
 ఆధ్యాత్మికం అంటే అన్నీ త్యజించాల్సిన అవసరం లేదు. జీవితాన్ని తెలుసుకోవడం. మంచి పనులపై మనసుని కేంద్రీకరించడం. మా కుటుంబంలో మా అమ్మమ్మ లక్ష్మీ కాంతమ్మ ఆధ్యాత్మిక బాటలోనే వెళ్లేవారు. రాజకీయ నాయకురాలిగా ఆవిడకున్న పేరు నాటి తరం వారికి తెలుసు. అప్పట్లో తను ధ్యానంలో ఎంత లీనం కాగలిగిందో, ఇప్పుడు నేనూ ఆ స్థాయిలో లీనం కాగలుతున్నాను.
 
 అంతా బాగానే ఉంది.. మరి మీ వ్యక్తిగత జీవితం సంగతేంటి?
 నా కుటుంబం అండదండలు లేకపోతే నేననుకున్నవన్నీ చేయగలిగేదాన్ని కాదు. పెద్దయిన తర్వాత మనం హౌస్‌వైఫ్ కావాలని, మంచి హోమ్ మేకర్ కావాలని నేను అనుకోలేదు. నా కాళ్ల మీద నేను నిలబడాలనుకునేదాన్ని. మా అమ్మమ్మ, అమ్మలా ఓ స్ట్రాంగ్ ఉమన్‌గా ఉండాలనుకునేదాన్ని. ఢిల్లీ యూనివర్శిటీకి జాయింట్ సెక్రటరీగా చేసేది. అప్పట్లో అమ్మని రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి చేసినా తను ఒప్పుకోలేదు. అమ్మది మంచి గాత్రం. కానీ, గాయని కావాలనే తన కలను నెరవేర్చుకోలేకపోయింది. నేను గాయని అయినప్పుడు తన కలని నాలో చూసుకుంటుందేమో అనుకున్నాను. నా బలం మా అమ్మే.
 
 మీ భర్త గురించి... మీరిద్దరూ విడిపోయారనే టాక్ ఉంది?
 (నవ్వుతూ) ప్రముఖుల గురించి వదంతులు ప్రచారం చేసి, ‘నిప్పు లేనిదే పొగ రాదు’ అని చిన్న మెలిక పెడతారు. కానీ, ఇక్కడ నిప్పే లేదు.. ఇక పొగ ఎలా వస్తుంది? నేనూ, నా భర్త శశాంక్ హాయిగా ఉన్నాం. నేనేం చేసినా ఆయన కాదనరు. మాకో మూడేళ్ల పాప ఉంది. పేరు ‘షివి’.
 
 ‘షివి’ అంటే అర్థం ఏంటి?
 పాప పుట్టిన తర్వాత నా గురువు జగ్గీ వాసుదేవ్ ‘మీ అమ్మాయికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావ్’ అనడిగితే ఆయన సలహా కోరా. ‘షివి’ అన్నారు. నేను కోరుకున్నట్లు.. ఎస్ అక్షరంతోనే పేరు ఉండటం, ఆ పేరుకి   శివుడిలో ఒక భాగం అనే అర్థం ఉండటంతో ఆనందంగా అంగీకరించాం.
 
 ‘మల్లీశ్వరి’ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించకపోవడానికి కారణం?
 ఆ సినిమా ఒప్పుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. యాక్ట్ చేయాలని ఉండేది కాదు. కానీ, ఎందుకు ఒప్పుకున్నానో ఇప్పటికీ తెలియదు. అయితే, ఆ సినిమా చేయడం ద్వారా ఛాయాగ్రాహకుడు సమీర్‌రెడ్డి వంటి అన్న దొరికాడు. ‘యోగేశ్వరాయ..’ ఆల్బమ్ చేయాలనుకున్నప్పుడు, కెమెరామేన్‌గా సమీర్ అయితే బాగుంటుందనుకున్నా. కానీ, తను ఫుల్ బిజీ. అందుకని, మొహమాటపడుతూనే అడిగా. ‘ఇది అడగడానికి నువ్వింతగా ఫీలవ్వాలా’ అంటూ డేట్స్ అడ్జస్ట్ చేసిచ్చారు. అలాగే... కెమెరా, లైట్.. అన్నీ ఉచితంగా ఇచ్చారు.
 
 అంటే.. ఇక నుంచి సినిమాల్లో అస్సలు నటించరా?
 కమర్షియల్ సినిమాలైతే చెయ్యను. గొప్ప సందేశం ఉన్న సినిమా అయితే ఓకే. ఆ సినిమా ద్వారా పది మందికీ ప్రయోజనం చేకూరుతుందనిపిస్తే చేస్తాను.
 
 ఆధ్యాత్మికం, దేశభక్తి, సేవ... మీ జీవితం వీటి చుట్టూ తిరుగుతోందన్నమాట?
 అవును. ఏ వ్యాపారం చేసినా కొంత సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నా. ప్రస్తుతం నా జీవితం మీరు చెప్పిన ఈ మూడింటికీ అంకితమైపోయింది.
 
 నరేంద్ర మోదీకి మద్దుతుగా ‘వేకప్ ఇండియా’ ఆల్బమ్ చేశారు.. మీ అమ్మమ్మగారిలా రాజకీయాల్లోకి వస్తారా?
 రాజకీయాలపరంగా నాకు అజెండా ఏదీ లేదు. నాకు దేశభక్తి ఎక్కువ. అందుకే మోదీగారంటే అభిమానం. ఆ కారణంగానే ఆయనకు మద్దతు ఇచ్చాను. కానీ, ఇప్పుడు ప్రపంచం ఎలా తయారయ్యిందంటే.. ఎవరికైనా ఏదైనా చేస్తే, ఏదో ఆశించే చేస్తున్నారు. కాబట్టి, పదవుల కోసమే చేస్తున్నాననుకుంటున్నారు. ‘వేకప్ ఇండియా’ చేసిన తర్వాత నాలోని దేశభక్తిని గౌరవిస్తున్నారు. ఆ సమయంలో నాకు లభించే అనుభూతి ఏ పదవి ఇస్తుంది?
 
 డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement