ఒంగోలు కల్చరల్ : సినీ రంగంలో ప్రముఖ దర్శకురాలు, నటీమణి భానుమతి రామకృష్ణ స్థానం శాశ్వితమైనదని ఆమె పేరిట తనను పురస్కారంతో సత్కరించడం ఆనందంగా ఉందని కళాభినేత్రి వాణిశ్రీ పేర్కొన్నారు. ఘంటశాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక గుంటూరు రోడ్డులోని ఏ వన్ ఫంక్షన్ హాలులో ఏర్పాటైన అభినందన సభలో వాణిశ్రీ పాల్గొని ప్రసంగించారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకునేందుకు తాను కృషి చేశానని ఆమె వివరించారు.
తమ గొప్పతనానికి తెరవెనుక ఎంతో మంది ప్రోత్సాహం కారణమని పేర్కొన్నారు. అభిమానులు చెక్కిన శిల్పంగా ఆమె తనను తాను అభివర్ణించుకున్నారు. డాక్టర్ భానుమతి రామకృష్ణ కాంస్య విగ్రహాన్ని ఒంగోలులో ప్రతిష్టించేందుకు అభిమానులు పూనుకోవాలని ఆమె కోరారు. సినీ రంగంలో భానుమతిని అనుకరించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. 50, 60 ఏళ్ల క్రితమే చండీ రాణి అనే సినిమాతో దర్శకత్వం వహించడం ద్వారా భానుమతి తమ గొప్పతనాన్ని నిరూపించుకున్నారన్నారు.
భానుమతి నటన, గానం, సంభాషణా చాతుర్యం ఎవరూ అనుకరించలేరని ఆమె శ్లాఘించారు. ప్రముఖ గాయని పి.సుశీల పాటలు వింటూ తాను ఎదిగానని, ఇది మల్లెల వేళయనీ వంటి పాటల ద్వారా గాయనిగా పీ సుశీల గొప్ప అభినయం ప్రదర్శించే అవకాశాన్ని తనకు కల్పించారని తెలిపారు. నేడు సృజనాత్మకత లోపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు సైతం సెల్‌ఫోన్లు, వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు, యూట్యూబ్ వంటి వాటికి అలవాటు పడుతున్నారని, చదువుకోవాల్సిన వయసులో వారు అటువంటి వాటికి ఆకర్షితులు కావడం వారి భవిష్యత్తుకు ప్రమాదమని హెచ్చరించారు.
మా నటనను చూడండి తప్ప, మా తప్పులు ఎంచకండి అని హితవుపలికారు. మళ్లీ జన్మంటూ ఉంటే వాణిశ్రీగానే పుడతానని ఆమె తెలిపారు. అనంతరం నిర్వాహకులు ఆమెను డాక్టర్ భానుమతి రామకృష్ణ పురస్కారంతో వాణిశ్రీని సత్కరించారు. ఘంటశాల పురస్కారాన్ని ప్రముఖ గాయని పి.సుశీలకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లవకుశ సినిమా తనకు, మరో గాయని లీలకు గాయనిలుగా ప్రాణం పోసిందన్నారు. 83 మంది హీరోయిన్‌లకు పాటలు పాడిన ఘనత మీదేనంటూ అభిమానులు ప్రశంసలు కురిపించారని ఆమె గుర్తుచేసుకున్నారు.
జగమే రామమయం అనే శ్లోకాన్ని, సోగ్గాడే చిన్నినానయన పాటను పాడి వినిపించారు. ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో మంది కొత్త గాయకులను తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి ఎంజె.ప్రయదర్శిని అధ్యక్షత వహించారు. హైకోర్టు జడ్జి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాణిశ్రీ, సుశీలను సత్కరించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్సీ పోతుల సునీత, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎల్.సునీల్‌కుమార్‌రెడ్డి , ఘంటశాల నేషనల్‌ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు టి.విజయకాంత్, కలెక్టర్ వినయ్‌చంద్ తల్లి గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురిని పురస్కారాలతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment