
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో. బాహుబలి లాంటి బిగ్ హిట్ తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమాకావటంతో సాహో పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది యూవీ క్రియేషన్స్ సంస్థ. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా ప్రభాస్, శ్రద్ధా కపూర్‌లకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌తో రిలీజ్ డేట్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్. ముందుగా సాహో సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని భావించినా నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో ఆగస్టు 30న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఇవ్లిన్ శర్మ, మందిరా బేడీ, చుంకీ పాండేలతో పాటు తమిళ నటుడు అరుణ్ విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.