Saaho Review, in Telugu | 𝑺𝒂𝒉𝒐𝒐 𝑴𝒐𝒗𝒊𝒆 𝑹𝒂𝒕𝒊𝒏𝒈 (2.75/5) | ‘సాహో’ మూవీ రివ్యూ | Prabhas, Sujeeth - Sakshi
Sakshi News home page

‘సాహో’ మూవీ రివ్యూ

Published Fri, Aug 30 2019 10:53 AM | Last Updated on Tue, Jul 27 2021 3:21 PM

Prabhas Saaho Telugu Movie Review - Sakshi

టైటిల్‌ : సాహో
జానర్‌ : యాక్షన్‌ థ్రిల్లర్‌
నటీనటులు : ప్రభాస్, శ్రద్ధా కపూర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, చంకీ పాండే, జాకీ ష్రాఫ్‌, అరుణ్ విజయ్‌
సంగీతం : తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా
నేపథ్య సంగీతం : జిబ్రాన్‌
నిర్మాత : వంశీ, ప్రమోద్
దర్శకత్వం : సుజీత్‌

బాహుబలి తరువాత అదే స్థాయి హైప్‌ తీసుకువచ్చిన సినిమా సాహో. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్‌ యాక్షన్‌ సన్నివేశాలు, లొకేషన్లు ఆడియన్స్‌ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లటం ఖాయం అని చిత్ర యూనిట్ నమ్మకంగా చెప్పింది. మరి ప్రభాస్‌.. బాహుబలి తరువాత మరోసారి సాహో అనిపించాడా..? ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న సుజీత్‌ ఇంతటి భారీ చిత్రాన్ని ఎలా డీల్‌ చేశాడు..? మరోసారి సౌత్‌ సినిమా జాతీయ స్థాయిలో సత్తా చాటిందా.?

కథ :
వాజీ అనే సిటీ కేంద్రంగా గ్యాంగ్‌ స్టర్స్‌ తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. రాయ్‌ (జాకీ ష్రాఫ్‌‌) ఓ గ్రూప్‌ను ఫాం చేసి సిండికేట్ నడిపిస్తుంటాడు. ఆ క్రైమ్‌ వరల్డ్‌కు కింగ్ కావాలనుకున్న దేవరాజ్‌ (చంకీ పాండే), రాయ్‌ మీద పగ పెంచుకుంటాడు. ఓ పని మీద  ముంబై వచ్చిన రాయ్‌  ప్రమాదంలో చనిపోతాడు. ఇదే అదునుగా భావించిన దేవరాజ్‌ క్రైమ్‌ వరల్డ్‌ను తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాడు. కానీ అదే సమయంలో రాయ్‌ కొడుకు విశ్వక్‌ క్రైమ్‌ వరల్డ్‌లోకి అడుగుపెడతాడు. మరోవైపు ముంబైలో ఓ భారీ చోరీ జరుగుతుంది. రెండు వేల కోట్లకు సంబంధించిన ఈ కేసును దర్యాప్తు చేయడానికి అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) ఎంట్రీ ఇస్తాడు. క్రైమ్‌ బ్రాంచ్‌ ఆఫీసర్‌ అమృతా నాయర్‌ (శ్రద్ధా కపూర్‌) తో కలిసి కేసు విచారణ మొదలు పెడతాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. చివరకు అశోక్‌ ఆ కేసును సాల్వ్ చేశాడా..? అసలు క్రైమ్‌ సిండికేట్‌ను నడిపే రాయ్‌ ఎలా చనిపోయాడు? అశోక్‌, అమృత ప్రేమ ఏమైంది..? అసలు ఈ కథలో సాహో ఎవరు? అన్నదే మిగతా కథ.



నటీనటులు:
సినిమా అంతా తన భుజాల మీద మోసిన ప్రభాస్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. రెండు వేరియేషన్స్‌లోనూ ప్రభాస్‌ నటన ఆకట్టుకుంటుంది. లుక్స్‌ పరంగానూ ప్రభాస్‌ సూపర్బ్ అనిపించాడు. ఇక యాక్షన్‌ సీన్స్‌లో ప్రభాస్‌ చూపించిన ఈజ్‌, పర్ఫెక్షన్‌ వావ్‌ అనిపించేలా ఉంది. రొమాంటిక్‌ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. పోలీసు అధికారి పాత్రలో శ్రద్ధా కపూర్‌ ఒదిగిపోయింది. యాక్షన్‌ సీన్స్‌లోనూ మెప్పించింది. విలన్లుగా చాలా మంది నటులు తెర మీద కనిపించినా ఎవరికీ పెద్దగా స్క్రీన్‌ టైం దక్కలేదు. చంకీ పాండే, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్‌, లాల్‌లు తమ పాత్రల పరిధి మేరకు ఓకె అనిపించగా జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, మహేష్‌ మంజ్రేకర్‌ లాంటి నటులకు సరైన పాత్రలు దక్కలేదు. మరో కీలక పాత్రలో నటించిన మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల కిశోర్‌ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు.

విశ్లేషణ :
రన్‌ రాజా రన్‌ లాంటి చిన్న సినిమా చేసిన అనుభవం మాత్రమే ఉన్న సుజీత్‌కు ఇంత భారీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టడం అంటే రిస్క్‌ అనే చెప్పాలి. భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్‌, జాతీయ స్థాయి సినిమా... ఇంత ఒత్తిడిని హ్యాండిల్ చేయటంలో సుజీత్ తడబడ్డాడు. ప్రభాస్‌ను స్టయిలిష్‌గా, హాలీవుడ్ స్టార్‌లా చూపించటం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన దర్శకుడు కథా కథనాల విషయంలో ఆ స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఇంత భారీ ప్రాజెక్ట్‌కు ఒక రొటీన్‌ క్రైమ్‌ ఫార్ములా కథను ఎంచుకున్న సుజీత్‌, ఆ కథను కూడా ఆకట్టుకునేలా చెప్పలేకపోయాడు. లెక్కలేనన్ని పాత్రలు, ప్రతీ పాత్రకు ఓ సబ్‌ ప్లాట్‌తో కథనం గజిబిజీగా తయారైంది. అయితే డార్లింగ్ అభిమానులను మాత్రం ఖుషీ చేశాడు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత వెండితెర మీద కనిపించిన ప్రభాస్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి చూపించాడు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో కథ ఆసక్తికరంగా మారినా ద్వితీయార్థం లోనూ తడబాటు కనిపించింది. లవ్‌ స్టోరీ కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి.

చదవండి‘గద్దలకొండ గణేష్‌’ మూవీ రివ్యూ

పాటలు విజువల్‌గా వావ్‌ అనిపించేలా ఉన్నా కథనంలో మాత్రం స్పీడు బ్రేకర్లలా మారాయి. జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యింది. చాలా సన్నివేశాలను తన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో మరింతగా ఎలివేట్ చేశాడు జిబ్రాన్‌. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ యాక్షన్ కొరియోగ్రఫి. హాలీవుడ్ స్టంట్‌ మాస్టర్‌లు డిజైన్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ రెప్ప వేయకుండా చూసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫి కూడా సూపర్బ్‌. గతంలో ఎప్పుడు చూడని లొకేషన్లను ఎంతో అందంగా వెండితెర మీద ఆవిష్కరించారు. సినిమాకు మేజర్‌ డ్రా బ్యాక్‌ ఎడిటింగ్‌. ప్రతీ సన్నివేశం దేనికి దానికి వచ్చిపోతున్న ఫీలింగ్ కలుగుతుందే తప్ప ఫ్లో ఉండదు. నిర్మాణ విలువ అద్భుతం. ప్రభాస్‌ మీద ఉన్న ప్రేమతో నిర్మాతలు అవసరానికి మించి ఖర్చు చేశారు.

ప్లస్‌ పాయింట్‌ :
యాక్షన్‌ సీన్స్‌
ప్రభాస్
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫి

మైనస్‌ పాయింట్స్‌ :
కథా కథనాలు
నిడివి
ఎడిటింగ్‌

సతీష్‌ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement