సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు! | Prabhas, Shraddha Kapoor Saaho Chennai Press Meet | Sakshi
Sakshi News home page

సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!

Published Sun, Aug 18 2019 7:56 AM | Last Updated on Sun, Aug 18 2019 12:47 PM

Prabhas, Shraddha Kapoor Saaho Chennai Press Meet - Sakshi

బాహుబలి చిత్రాన్ని మెచ్చిన ప్రేక్షకులను సాహో అలరిస్తే చాలని నటుడు ప్రభాస్‌ పేర్కొన్నారు. బాహుబలి 1, 2 చిత్రాలతో భారతీయ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులను అలరించిన నటుడు ప్రభాస్‌. ముఖ్యంగా తమిళంలో మంచి పేరు తెచ్చుకున్నారు. బాహుబలి 1, 2 చిత్రాల తరువాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం సాహో. బాహుబలి చిత్రాలకు మించిన భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్న చిత్రం సాహో.

బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో నటుడు అరుణ్‌విజయ్, నీల్‌నితిన్‌ ముఖేశ్, జాకీష్రాఫ్‌ ముఖ్యపాత్రలను పోషించారు. యువదర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న  ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా సాహో నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 30న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ సందర్భంగా సాహో చిత్ర తమిళ వెర్షన్‌ ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు ప్రభాస్‌ మాట్లాడుతూ ‘సాహో అంటే జయహో అని అర్థం. చిత్రం చూస్తే అది మీకే అర్థం అవుతుంది. సాహో చిత్రం కోసం రెండేళ్లు కాల్‌షీట్స్‌ ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదు. బాహుబలి చిత్రాల తరువాత ఆ స్థాయిలో మంచి కథా చిత్రాన్ని చేయాలని అనుకున్నా. అలాంటి సమయంలో సుజిత్‌ చెప్పిన కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించా’ అని తెలిపారు.

నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెట్టారని, ఒక్కో యాక్షన్‌ సన్నివేశానికి ముందు చాలా ప్రీ ప్రొడక్షన్‌ చేయాల్సి వచ్చిందని తెలిపారు. తమిళ్, తెలుగు, హాలీవుడ్‌లకు చెందిన పలువురు స్టంట్‌మాస్టర్లు కలిసి ఫైట్స్‌ సన్నివేశాలను రూపొందించినట్లు చెప్పారు. అందుకు చాలా సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని అన్నారు. ఇకపోతే తాను పుట్టింది చెన్నైలోనేనని, తమిళంలో స్ట్రయిట్‌ చిత్రం చేయాలని చాలా ఆశగా ఉందని అన్నారు. అందుకు మంచి కథ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.

త్వరలోనే తమిళంలో స్ట్రయిట్‌ చిత్రంలో నటిస్తానని ప్రభాస్‌ అన్నారు. బాహుబలి చిత్రాన్ని మెచ్చిన ప్రేక్షకులను ఈ సాహో చిత్రం అలరిస్తే చాలునని ఆయన పేర్కొన్నారు. అయితే సాహో చిత్రాన్ని బాహుబలి చిత్రంతో పోల్చరాదని, అది చారిత్రక కథా చిత్రం కాగా సాహో ఈ కాలానికి చెందిన సోషల్‌ కథా చిత్రం అని అన్నారు. అయితే ఇందులో మీరు ఇంత వరకూ చూడనటువంటి యాక్షన్‌ సన్నివేశాలను చూస్తారని అన్నారు.

ఇకపోతే తమిళ ప్రేక్షకులకు సాహో చిత్ర యూనిట్‌ నుంచి చిన్న సర్‌ఫ్రైజ్‌ ఉంటుందన్నారు. అదేమిటన్నది ఈ నెల 23న తెలుస్తుందని ప్రభాస్‌ పేర్కొన్నారు. అదేవిధంగా  తనకు హిందీ, ఇంగ్లిష్‌ చిత్రాల్లో నటించాలన్న ఆశ లేదని చెప్పారు. ఈ సమావేశంలో నటి శ్రద్ధాకపూర్, అరుణ్‌విజయ్, దర్శకుడు సుజిత్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement