
డిక్టేటర్ సరసన ప్రణీత
వరుసగా సినిమాలు చేస్తూ జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 99వ సినిమా బిజీలో పడ్డారు. బుధవారం పుట్టినరోజు జరుపుకొన్న ఈ హీరో, శ్రీవాస్ దర్శకత్వంలో ‘డిక్టేటర్’గా అలరించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇటీవల లాంఛనంగా పూజ జరుపుకొన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై 20 నుంచి ప్రారంభం కానుందని ఆంతరంగిక వర్గాల సమాచారం. బాలకృష్ణను పవర్‌ఫుల్ పాత్రలో చూపే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటారని సమాచారం.
ఒక హీరోయిన్‌గా నటి అంజలిని ఇప్పటికే ఎంపిక చేశారు. మిగిలిన రెండో హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి దాకా సస్పెన్స్‌గా మిగిలింది. ఆ పాత్రకు నటి ప్రణీతను ఎంపిక చేసినట్లు ‘సాక్షి’ పక్కా సమాచారం. కన్నడ అమ్మాయి ప్రణీతా సుభాష్ ఇప్పటికే పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది?’ తదితర చిత్రాల ద్వారా మన ప్రేక్షకులకు సుపరిచితురాలు. బాలకృష్ణ లాంటి అగ్ర హీరో సరసన అవకాశం రావడంతో సహజంగానే ప్రణీత సంతోషంగా ఉన్నారు.
కొంతకాలంగా కన్నడంపై దృష్టి పెడుతున్న తనకు ఈ ‘బిగ్ ఛాన్స్’తో మళ్ళీ తెలుగులో దశ తిరుగుతుందని భావిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ తదితర అయిదుగురు రచయితలు కలసి రూపొందించిన ఈ చిత్ర కథ మీద దర్శకుడు శ్రీవాస్ కూడా అపారంగా నమ్మకం పెట్టుకున్నారు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ లాంటి తన గత హిట్స్ జోరును ‘డిక్టేటర్’ మరింత పెంచుతుందని భావిస్తున్నారు. అందుకే, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఈరోస్’తో పాటు ఆయన కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.