
విభిన్న ప్రేమానుభవాలు
ప్రేమంటే... ఎడారిలో కురిసే వాన. ప్రేమంటే... వసంతం లేకపోయినా విరిసే పూలవనం. ప్రేమంటే... రెండు హృదయాల మౌన కచ్చేరీ. అయితే అన్ని ప్రేమలూ ఆ ప్రేమ తాలూకూ అనుభవాలూ ఒకేలా ఉండవు. ఎవరి ప్రేమ వారికే ప్రత్యేకం. ఓ మూడు జంటల ప్రేమకథల్ని ఓ కాఫీ షాప్ నేపథ్యంలో ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంది? దర్శకుడు పవన్ సాదినేని అదే చేశారు. డి.సురేష్‌బాబు సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’. షిర్డీసాయి కంబైన్స్ భాగస్వామ్యంతో రూపొందిన ఈ చిత్రంలో హర్షవర్థన్ రాణే, విష్ణు, హరీష్, వితిక షేరు, రీతూవర్మ, శ్రీముఖి ముందులో హీరో హీరోయిన్లు.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ -‘‘భారీ నిర్మాణ విలువలతో స్టయిలిష్‌గా రూపొందిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఇంతకు ముందు మా సంస్థలో వచ్చిన ‘టాటా బిర్లా మధ్యలో లైలా, సత్యభామ, మా ఆయన చంటిపిల్లాడు, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, మేం వయసుకు వచ్చాం’ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. శ్రావణ్ స్వరపరచిన పాటలు ఇప్పటికే విశేషాదరణ పొందాయి. సినిమా కూడా కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, కళ: మోహన్, కూర్పు: గౌతమ్ నెరుసు, పాటలు: కృష్ణచైతన్య.