తమిళసినిమా: దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కి నిర్మాతల మండలికి మధ్య ఒప్పందం అవసరం అని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి పేర్కొన్నారు. ఈయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ సమ్మె కారణంగా సినీ కార్మికులకు రూ.50 కోట్లు నష్టం వాటిల్లిందని అన్నారు. 50 ఏళ్ల సినీ చరిత్రలో 50 రోజుల పాటు సమ్మె కొనసాగడం, తమిళ ఉగాదికి కూడా కొత్త చిత్రాలు విడుదల కాకపోవడం ఇదే ప్రప్రథమం అని పేర్కొన్నారు. ఎట్టకేలకు చర్చల ద్వారా పరిష్కారం లభించి సమ్మె విరమణ కావడం సంతోషం అని, ఇందుకు ప్రభుత్వానికి, నిర్మాతల మండలికి కృతజ్ఞతలు తెలిపారు.
ఫెఫ్సీలో మొత్తం 22 శాఖలున్నాయన్నారు. అందులో 12 శాఖలు ఒప్పందం విధానంలోనూ, 10 శాఖలు రోజూవారి వేతనాల విధానంలోనూ కొనసాగుతున్నాయని తెలిపారు. ఇకపై నిర్మాతల మండలిలో ఫెఫ్సీకి చెందిన 12 శాఖలకు చెందిన వారికి ఎంత పారితోషకం, ఎన్ని రోజులు షూటింగ్ అన్న అంశాల గురించి ఒప్పందం చేసుకుని నిర్మాతల మండలి నిర్వాహకుల సంతకాలతో కూడిన ఆ పత్రాలు ఫెఫ్సీకి అందిన తరువాతే టెక్నీషియన్స్ షూటింగ్‌కు వెళతారని చెప్పారు. అదే విధంగా రోజూవారి వేతనాల కార్మికులకు ఆ రోజు షూటింగ్ ముగిసిన వెంటనే చెల్లించాలని అన్నారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును నియమించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment