
దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి లక్కీ చాన్స్ కొట్టేశారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. ఆ చిత్రం నుంచి కీర్తి సురేశ్ తప్పుకోవడంతో ప్రియమణి ఆ పాత్రను దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటిస్తున్న తాజా చిత్రం మైదాన్. భారత ఫుట్‌బాల్ మాజీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. అజయ్‌దేవ్‌గణ్ కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో కీర్తి సురేశ్‌ను ఎంపిక చేశారు. జీ స్టూడియోస్, బోని కపూర్ మైదాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా ఈ చిత్రం నుంచి కీర్తి డ్రాప్ అయ్యారు. కీర్తి ఈ చిత్రంలో పెద్ద వయస్కురాలి పాత్రలో నటించాల్సి ఉండగా.. అందుకు ఆమె సరిపోదని చిత్ర నిర్మాతలు భావించారు. ఈ చిత్రం అంగీకరించినప్పుడు కీర్తి కొద్దిగా బరువుగా ఉన్నారని.. ప్రస్తుతం ఆమె సన్నబడ్డారని నిర్మాతలు తెలిపారు. కీర్తి కూడా తను ఆ పాత్రకు సరిపోననే భావనలో ఉండటంతో ఆమె ఈ చిత్రం నుంచి తప్పకున్నట్టు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ చిత్రంలో కీర్తి పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం నిర్మాతలు ప్రియమణిని సంప్రదించగా.. ఆమె కూడా ఆసక్తి కనబరిచినట్టుగా సమాచారం. కాగా, ప్రసుత్తం ప్రియమణి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో శశికళ పాత్రలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment