ఫోన్‌లో మాట్లాడితే బాయ్‌ఫ్రెండేనా?
సెలబ్రిటీలు బయటికొస్తే... లక్షల కళ్లు వాళ్లనే గమనిస్తుంటాయి. వాళ్లు ఆనందంతో ఉన్నా, బాధతో ఉన్నా ఆ కళ్లు ఇట్టే పట్టేస్తుంటాయి. అందుకే... ఎన్ని బాధలున్నా... మనసులోనే దాచుకొని, లేని నవ్వును మొహాన పులుముకుని బయటకు కనిపిస్తుంటారు కథానాయికలు. అలా కనిపించినా... వాళ్ల మానసిక పరిస్థితికి తగ్గట్టుగా కథనాలు మాత్రం యథాప్రకారంగా వచ్చేస్తుంటాయి. మరి మీడియానా మజాకా. ఇటీవల ప్రియాంక చోప్రా విషయంలో అదే జరిగింది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ప్రైవేటు పార్టీకి హాజరయ్యారు ప్రియాంక. అయితే... ఆ పార్టీలోకి ఎంటరైనప్పట్నుంచీ ఆమె చాలా సీరియస్‌గా కనిపించారు. ప్రియాంకలో పార్టీ మూడ్ ఏ మాత్రం లేకపోవడం అక్కడ చర్చనీయాంశమైంది.
కొత్త బాయ్‌ఫ్రెండ్ సాహిల్ ష్రాఫ్‌తో మాట పట్టింపులొచ్చి ఉంటాయని, ప్రియాంక సీరియస్‌గా ఉండటానికి కారణం అదేనని అక్కడికక్కడే ఎవరికి తోచినట్లు వారు కథలు అల్లేసుకున్నారు. ఇంతలో ప్రియాంక ఫోన్ రింగయ్యింది. అంతే... ఈ ముద్దుగుమ్మ పార్టీలో మాయమై పోయింది. ప్రియాంక ఎక్కడికెళ్లిందబ్బా.. అని అందరూ వెతుకుతుండగా.. ఈ అందాలభామ వాయిస్ బాత్రూమ్‌లో వినిపించిందట. ఫోన్ రాగానే బాత్రూమ్‌లోకి వెళ్లి డోర్ బిగించి మరీ... సీరియస్‌గా మాట్లాడుతున్నారట ప్రియాంక. ఇంకేముంది.. వారి అనుమానాలకు కొండంత బలం రానేవచ్చింది. ఇక పార్టీ మొత్తం సందడే సందడి.
ఆ వార్త అలా అలా మీడియా చెవిన కూడా పడింది. ఇక వాళ్లెందుకు ఊరుకుంటారు.. ప్రియాంక పార్టీలో సీరియస్‌గా ఉండటం, ఫోన్ రాగానే.. బాత్రూమ్‌లోకి వెళ్లి సీరియస్‌గా సంభాషించడం... ఇదంతా ఓ కామెడీ స్టోరీగా డూప్ కేరక్టర్లతో ప్రసారం చేశారట. దాంతో ప్రియంకకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘నా వ్యక్తిగత జీవితం గురించి ఆరా తీయాల్సిన అవసరం ఎందుకొచ్చింది. నేనేం పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటున్నారా? ఫోన్‌లో మాట్లాడితే... బాయ్‌ఫ్రెండేనా’’ అని పార్టీకి వచ్చిన కొంతమందికి ఫోన్ చేసి మరీ.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారట ప్రియాంక. ఇంట్లోవాళ్లతో, స్నేహితులతో మాట్లాడేటప్పుడు బాత్రూమ్‌లోకెళ్లి మాట్లాడటం దేనికి? అంటూ బాలీవుడ్‌లో పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.