నేను కోరుకున్నదేదీ నాకు దక్కలేదు
నేను కోరుకున్నదేదీ నాకు దక్కలేదు
Published Tue, Jun 24 2014 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM
‘నాక్కొంచెం తిక్కుంది... అయితే... దానికో లెక్కుంది’ అని ‘గబ్బర్‌సింగ్’లో పవన్‌కల్యాణ్ అన్నట్లు... ‘నాక్కొంచెం పొగరెక్కువ. అందుకని నేను గర్విష్టిని మాత్రం కాను’ అని మీడియా ముందు అదిరిపోయే స్టైల్లో చెప్పేశారు ప్రియాంక చోప్రా. ఇటీవల ఓ చానల్ రియాలిటీ షోలో అతిథిగా పాల్గొన్న ప్రియాంక... తన గురించి పలు అసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘‘నా జీవితమే ఒక విచిత్రం. ఎందుకంటే... నా లైఫ్‌లో నేను దేని గురించీ పోరాడింది లేదు.
అసలు నేను కోరుకున్నదేదీ నాకు దక్కలేదు. అయితే... కోరుకున్న దానికంటే ఎక్కువ నాకు దక్కింది. ఇంజినీరింగ్ కానీ, క్రిమినల్ సైకాలజీ కానీ చదవాలనేది నా యాంబిషన్. అదే లక్ష్యంగా స్కూల్‌కి వెళ్లేదాన్ని. స్కూల్ చదువు పూర్తయింది. మిస్ వరల్డ్ కిరీటం తలపైకొచ్చింది. ఎక్కడ లేని కీర్తి ప్రతిష్టలు చుట్టుముట్టాయి. ప్రపంచ స్థాయి మీడియా నా ముందుకొచ్చి నిలబడింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సెలబ్రిటీ అయిపోయాను. అయితే... ఎంత ఎదిగినా నా కళ్లు మాత్రం నెత్తిపైకి ఎక్కవు. ఎందుకంటే... నా తిక్కను దించడానికి పక్కనే మా అమ్మ సిద్ధంగా ఉంటుంది’’ అని చెప్పారు ప్రియాంక.
‘‘కెరీర్‌లో నేను అనుకున్నదేం జరగ్గపోయినా... ఒక విషయంలో మాత్రం పోరాడాలని నిశ్చయించుకున్నా. అదే ‘మ్యూజిక్’. గతంలో కొన్ని పాప్ ఆల్బమ్స్ పాడాను. అనుకోకుండా పాడినా... మంచి పేరొచ్చింది. నాకు తెలిసి ప్రపంచంలో నటిగా ఉండి పాప్ మ్యూజిక్ పాడింది జెన్నిఫర్ లోపెజ్ తర్వాత నేను మాత్రమే. భవిష్యత్తులో పాప్ మ్యూజిక్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉంది’’ అని ప్రియాంక ఆశాభావం వెలిబుచ్చారు.
Advertisement