వాళ్లే నా సైన్యం!
‘‘సెలబ్రిటీగా అందరి దృష్టిలో పడడం ఎవరికైనా ఆనందమే. ఓ స్టార్‌గా మనల్ని ఓ కంట కనిపెట్టే కళ్లు కోట్లలో ఉంటాయి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని ప్రియాంకా చోప్రా అంటున్నారు. బాలీవుడ్‌లో తిరుగులేని తార అనిపించుకుని, ‘క్వాంటికో’ టీవీ షోతో హాలీవుడ్ స్టార్ అయిపోయారామె. హోదా పెరిగే కొద్దీ ప్రశంసలతో పాటు కొన్ని అపాయాలు కూడా పొంచి ఉంటాయి. ఆ అపాయాల్లో ‘సైబర్ క్రైమ్’ ఒకటి.
సెలబ్రిటీల్లో సోషల్ మీడియా బాధితులు చాలామంది ఉన్నారు. ఆ విషయం గురించి ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ - ‘‘సామాజిక మాధ్యమం ద్వారా నన్ను ప్రోత్సహించే అభిమానులతో పాటు ఫేక్ ఐడీతో అభ్యంతరకర పోస్ట్‌లు చేసేవాళ్లూ ఉన్నారు. కొంతమంది అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ ఉంటారు. అవి చదివినప్పుడు రక్తం మరిగినంత పని అవుతుంది. సెలబ్రిటీ అయిన కారణంగా ఈ బాధ పడక తప్పదు’’ అని వాపోయారు.
అయితే, ‘‘అభిమానులే నా సైన్యం’’ అంటూ, సోషల్ మీడియాలో ఏవైనా పోస్ట్ చేసినప్పుడు ఏదైనా పొరబాటు దొర్లితే వివరణ ఇవ్వడానికి వెనకాడనన్నారు. ‘‘ఎప్పుడైనా పొరపాటున ఏదైనా వార్త పోస్ట్ చేస్తే వివరణ ఇచ్చేస్తాను. అయినా ఆ వివరణ వినేవాళ్లు చాలా తక్కువే. కామెంట్లు పెట్టడానికి ఇచ్చే టైమ్, వివరణ తెలుసుకోవడానికి ఇవ్వరు. అలాగని నేను వాళ్లతో ఆన్‌లైన్‌లో యుద్ధాలకు దిగను’’ అన్నారు