సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పుస్తకాల ముద్రణా సంస్థ ‘పెంగ్విన్ ర్యాండమ్ హౌస్’ ఏటా నిర్వహించే పెంగ్విన్ లెక్చర్ కార్యక్రమానికి ఈసారి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను ఆహ్వానించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్వీట్లు హోరెత్తుతున్నాయి. పెంగ్విన్ సంస్థ మంగళవారం ఢిల్లీలో ‘బ్రేకింగ్ ది గ్లాస్ రూఫింగ్ ఛేజింగ్ డ్రీమ్ (అద్దాల రూఫ్‌ను బద్దలుకొట్టి కలను సాకారం చేసుకోవడం)’ అంశంపై ఏర్పాటుచేసిన లెక్చర్‌కు ప్రధాన వక్తగా ప్రియాంక చోప్రా హాజరయ్యారు.
చోప్రాను వందమంది ప్రభావశీలురైన వ్యక్తుల్లో ఒకరిగా టైమ్ మేగజైన్ గుర్తించడంతోపాటు అత్యధిక పారితోషకం తీసుకునే పది మంది టీవీ తారల్లో ఒకరిగా ఫోర్బ్స్ గుర్తించింది. హాలీవుడ్‌లో ప్రముఖ నటిగా, సింగర్‌గా కూడా చోప్రా రాణించారు. చక్కని అందచందాలు కలిగిన చోప్రాను ఆహ్వానించడంలో తప్పేముందని అనేవాళ్లు ఉండవచ్చు. కానీ ఉత్తమ పుస్తకాలను ముద్రించే సంస్థ పెంగ్విన్. పుస్తకాలతోని ఎలాంటి సంబంధం లేని అంటే, రచయితలు, జర్నలిస్టులు, ఎడిటర్లు, పబ్లిషర్లు, పుస్తకాల అమ్మకందార్లలో ఒకరు కాకపోయినా ఆమెను ఆహ్వానించడం ఏమిటన్నదే విమర్శకుల ప్రశ్న. గతంలో పెంగ్విన్ సంస్థ వార్షిక లెక్చర్ కార్యక్రమానికి రష్కిన్ బాండ్, రామచంద్ర గుహ, దలైలామా, అబ్దుల్ కలామ్ లాంటి వారిని పిలిపించింది.
ఫెమినిస్ట్ పుస్తకాలను ప్రచురించే జుబాన్ సంస్థను సంప్రదిస్తే ‘పిగ్గీ చాప్స్’కు బదులుగా ఓ మంచి ఫెమినిస్ట్ పేరును సూచించేదిగదా! అంటూ ఒకరు ట్వీట్ చేశారు. పంది లేదా అసహ్యమైన బుగ్గలు కలిగిన వారిని పిగ్గీ చాప్స్ అని పిలుస్తారు. ప్రియాంక చోప్రాకు ఈ పేరును బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ 2005లో ‘బ్లఫ్ మాస్టర్’ షూటింగ్ సందర్భంగా పెట్టారు. అప్పటి నుంచి ఆమెను సన్నిహితులు పిగ్గీ చాప్స్ అని పిలవడం అలవాటయింది. ఈ ట్వీట్‌కు జుబాన్ బుక్స్ సంస్థ వెంటనే స్పందించి వచ్చే ఏడాది లెక్చర్‌కు తప్పకుండా తగిన పేర్లను సూచిస్తామంటూ ట్వీట్ చేసింది. కిరణ్ దేశాయ్, జుంపా లహరి, తహమీమా ఆనమ్, శోభాడే లాంటి రచియితల పేర్లనే కాకుండా పబ్లిషర్ల పేర్లను, జర్నలిస్టుల పేర్లను ఉదాహరణగా పేర్కొంది. సినీతారను పిలవడంలో తప్పేముందంటూ ఆమెను సమర్థించిన వారు కూడా ఉన్నారు. ‘బ్రేకింగ్ ది గ్లాస్‌రూఫింగ్ చేజింగ్ ఏ డ్రీమ్’ అంశంపై ప్రసంగించిన చోప్రా, బాలివుడ్‌లోని సెక్సిజం, రేసిజం గురించి నిర్భయంగా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment