పిగ్గీ చాప్స్.. ట్రిపుల్ హ్యాపీనెస్!
ప్రియాంకా చోప్రా నిర్మించిన మొదటి మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’ దర్శకుడు రాజేశ్, ఎడిటర్ రామేశ్వర్ ఎస్. భగత్, సౌండ్ మిక్సింగ్ టెక్నీషియన్ అలోక్... ముగ్గురికీ జాతీయ అవార్డులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబం కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. వినాయక చవితికి కొన్ని రోజుల ముందు... ఓ పెద్దాయన అనారోగ్యానికి గురి కావడంతో వెంటిలేటర్‌పై పెడతారు. అప్పుడు ఉమ్మడి కుటుంబం, బంధువులు... వాళ్ల మధ్య జరిగే వాదోపవాదనలు, గొడవలే సినిమా కథ.
‘లగాన్’, ‘స్వదేశ్’, ‘జోధా అక్బర్’ వంటి చిత్రాలు తీసిన ప్రముఖ హిందీ దర్శకుడు, నటుడు, నిర్మాత అశుతోష్ గోవారికర్ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమాలో సుమారు వందమంది కీలక పాత్రల్లో కనిపించారు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి 3 నేషనల్ అవార్డులు రావడంతో పిగ్గీ చాప్స్ (ప్రియాంకా చోప్రా) ట్రిపుల్ హ్యాపీగా ఉన్నారు. నిర్మాతగా ఆమెకిది రెండో సినిమా. దీనికి ముందు భోజ్‌పురిలో ఓ సినిమా తీశారు.
‘‘ఐయామ్ స్పీచ్‌లెస్. నేను దర్శకత్వం వహించిన మొదటి మరాఠీ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చిందోచ్! నా కల నిజమైంది. ‘వెంటిలేటర్’ సినిమా యూనిట్‌కి, ముఖ్యంగా నాపై నమ్మకంతో ఈ సినిమా నిర్మించిన ప్రియాంకా చోప్రా, మధు చోప్రా (ప్రియాంక తల్లి)లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ – ‘వెంటిలేటర్’ దర్శకుడు రాజేశ్