
వాళ్లకు నచ్చేదే తీస్తాను
‘‘నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టి పదేళ్లవుతోంది. లక్కీ మీడియా పతాకంపై ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ నుంచి ఆ మధ్య తీసిన ‘సినిమా చూపిస్త మావ’ వరకు దాదాపు విజయాలనే చవి చూశాం. మా బ్యానర్ నుంచి మంచి చిత్రాలు వస్తాయనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించగలిగాం’’ అని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు. నిర్మాతగా పదేళ్ల కెరీర్ గురించి ఈ విధంగా చెప్పారు.
నాకు మొదటి నుంచి కల్ట్ మూవీస్ అంటే ఇష్టం. బాలీవుడ్ దర్శకుడు నగేశ్ కుకునూర్ తరహా సినిమాలు తీయాలని అనుకునేవాణ్ణి. కానీ నా మిత్రుడు, హీరో శివాజీ కమర్షియల్ ఫార్మెట్‌లో వెళితే బాగుంటుందన్నాడు. అలా తీసిన సినిమానే ‘టాటా బిర్లా మధ్యలో లైలా’. ఈ సినిమా 2006 జనవరి 25న ప్రారంభమై, అక్టోబరు 12న విడుదలైంది.
ఈ పదేళ్లల్లో ‘సత్యభామ’, ‘మా ఆయన చంటిపిల్లాడు’, ‘తకిట తకిట’ సినిమాలు తీశా. చిన్న బడ్జెట్‌లో మంచి సినిమా చేయొచ్చన్న నమ్మకం కలిగించిన చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’. ఆ తర్వాత తీసిన ‘మేం వయసుకు వచ్చాం’ కూడా విజయం సాధించింది. ‘సినిమా చూపిస్త మావ’ మా గత చిత్రాలకు మించిన సూపర్ హిట్ అయ్యింది.
‘బొమ్మరిలు’్ల, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి చిత్రాలు తీయాలని కోరిక. నేను కథలు ఎంపిక చేసేముందు డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడతాను. మనం తీస్తున్న సినిమా ప్రేక్షకులకు ఎంతగా రీచ్ అవుతుందో తెలుసుకుని కథలు సెలెక్ట్ చేసుకుంటా. ప్రేక్షకులే నా టార్గెట్. వాళ్లకు నచ్చేదే తీస్తాను. కొన్ని సినిమాలకు డబ్బులు వస్తాయి. మరి కొన్నిటికి రావు. ఈ పదేళ్ల ప్రయాణం ద్వారా నిర్మాతగా నేను సంపాదించిన అనుభవం నా ఆస్తి అని నమ్ముతాను. మంచి సినిమాలు తీయాలేగానీ డబ్బులు రావడం పెద్ద కష్టమేం కాదు.
ప్రస్తుతం ‘ సినిమా చూపిస్త మావ’ ఫేమ్ త్రినాథ్‌రావు నక్కిన, మరో కొత్త దర్శకుడు చెప్పిన కథతో సినిమాలు నిర్మించనున్నా. అలాగే మరో సినిమా కూడా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఓ చిత్రం ఏప్రిల్‌లో ఆరంభమవుతుంది.