టిక్కెట్టు లేకుండా సినిమా!!
సినిమాకు వెళ్లి, టిక్కెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఎంచక్కా చూస్తే ఎలా ఉంటుంది? దొంగదారిలో వెళ్దామనుకుంటున్నారా.. అక్కర్లేదు. ఓ మళయాళ నిర్మాత చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే భవిష్యత్తులో చాలావరకు సినిమాలను ఉచితంగానే చూడొచ్చు. కనీసం మొదటి వారం వరకైనా కూడా సినిమాను ఉచితంగా ప్రేక్షకులకు అందించాలని ఆ నిర్మాత ప్రయత్నం చేస్తున్నారు. ఎస్.వినోద్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'టెస్ట్ పేపర్' అనే సినిమాను ఇలా ఉచితంగా అందించాలని ఆ సినిమా నిర్మాత మనోజ్ కుమార్ భావిస్తున్నారు. అయితే, ఇది ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే.
ముందుగా థియేటర్ల వద్ద ఇచ్చే ఉచిత పాస్లు తీసుకుని ఈ సినిమాకు వెళ్లాలి. సినిమా ప్రదర్శనకు అయ్యే ఖర్చులను ప్రకటనల ద్వారా రాబడతామని నిర్మాత మనోజ్ కుమార్ చెప్పారు. ఇంతకుముందు టీవీ సీరియళ్లు, కార్యక్రమాలు రూపొందించామని, కానీ సినిమాను ఇలా స్పాన్సర్ చేయించడం మాత్రం భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారి అవుతుందని ఆయన అన్నారు. పెద్దపెద్ద బ్రాండ్ల కంటే స్థానిక ప్రకటనల మీదే తాము దృష్టి పెట్టామన్నారు. సీరియళ్లలో అయితే ఎప్పుడు పడితే అప్పుడే మధ్యలో ప్రకటనలు వస్తాయి. కానీ సినిమాలో మాత్రం అలా కాకుండా, మొదట్లోను, ఇంటర్వెల్ సమయంలోను మాత్రమే ప్రకటనలు ఇస్తారు. టెస్ట్ పేపర్ సినిమాలో జగదీష్, నందు, మున్నా, మహాలక్ష్మి లాంటి ప్రముఖ నటులున్నారు.