తెరపై చిచ్చుబుడ్డిలా చెలరేగిపోవడం.. తెర వెనుక ఒద్దికకు మరో రూపంగా కనిపించడం సాయిరామ్శంకర్ ప్రత్యేకత. పూరిజగన్నాథ్ వంటి స్టార్ డెరైక్టర్ తమ్ముడైనా.. అహంభావం ఇసుమంతైనా కనిపించదాయనలో. నేటి స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ప్రతిభ సాయిరామ్శంకర్ సొంతం. తేజ దర్శకత్వంలో సాయి నటించిన ‘1000 అబద్ధాలు’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ ‘దిల్లున్నోడు’తో కాసేపు.
*** రెండున్నర గంటల్లో 1000 అబద్ధాలు ఎలా చెప్పేశారు?
ఆ క్రెడిట్ మొత్తం తేజ గారిదే. ఆయన చెప్పేయమన్నారు... చెప్పేశాను.
*** తేజ కోపిస్టి అంటారు. ఆయన్ను ఎలా ఫేస్ చేశారు?
చెప్పింది చేయకపోతేనే కదా కోపం. ఆయనకు ఏం కావాలో తెలుసుకొని చేసేవాణ్ణి. ఇక కోపానికి తావెక్కడిది. ఇంకో విషయం ఏంటంటే... ఇది కామెడీ సినిమా. దాంతో ఆయన కూడా సరదాగా ఉండేవారు సెట్లో.
*** ఈ కథలో మీకు నచ్చిన పాయింట్?
ఈ కథ తేజ నాకు చెప్పేముందు ఓ మాటన్నారు. ‘ఇది నీ గత సినిమాలతో పోలిస్తే కచ్చితంగా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల్లో నీపై ఓ సింపతీ క్రియేట్ చేస్తుందీ పాత్ర’ అని. షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడో అది నిజమవుతుందని నమ్మకం బలపడింది. ఈ కథలో ఓ చిన్న పెయిన్ ఉంటుంది. ఆ బాధే నాపై సింపతీని క్రియేట్ చేస్తుంది.
*** ఇప్పటిదాకా మాస్ పాత్రలే చేశారు. ఇప్పుడేమో సింపతీ అంటున్నారు?
‘ఓ నలుగుర్ని కొట్టేస్తేనే హీరో అనేవాడు జనాల్లోకెళతాడు’ అనుకోవడం పొరపాటు. తెరపై హీరో భావోద్వేగానికి లోనైతే.. ప్రేక్షకునికి కూడా అదే ఫీలింగ్ కలగాలి. అప్పుడు సదరు హీరో జనాభిమానం పొందుతాడు.
*** మీ అన్నయ్య, తేజ వీరిద్దరిలో మీరు గమనించిన తేడా ఏంటి?
వీరిద్దరికీ ఉన్న లక్షణం ఏంటంటే.... నటించి చూపించడం. ఆర్టిస్టుల శారీరకభాషని బట్టే కాకుండా... వారిలో ఇంకా ఏదైనా వేరే యాంగిల్ ఉందా? అని కూడా చూస్తారు. అందుకే... ఆర్టిస్టులు వారి ప్రీవియస్ చిత్రాల్లో ఒకలా కనిపిస్తే... పూరిజగన్నాథ్, తేజ చిత్రాల్లో ఒకలా కనిపిస్తారు. ఇక సంబంధం లేని విషయాలేంటంటే, షాట్లు తీయడంలో ఇద్దరివీ డిఫరెంట్ స్టైల్. అన్నయ్య.. షాట్బై షాట్ తీసుకుంటూ వెళ్లిపోతారు. తేజ అలాకాదు.. ఒక సీన్ మొత్తాన్ని ముందు రిహార్సల్స్ చేయిస్తారు. ‘చేయగలుగుతున్నారు’ అని ఆయనకు అనిపించాకే కెమెరా ముందుకు తెస్తారు. అవసరమైతే అప్పుడప్పుడు షాట్లు కూడా తీస్తారు. ఇద్దరి దగ్గరా చాలా విషయాలు నేర్చుకున్నా.
*** మళ్లీ అన్నయ్యతో సినిమా ఎప్పుడు?
అన్నయ్య దర్శకత్వంలో నటించాలంటే... ముందు నన్ను నేను నిరూపించుకోవాలి. దర్శకుడికి మాత్రమే బిజినెస్ ఉంటే సరిపోదు. హీరోక్కూడా బిజినెస్ అనేది ఉండాలి. అప్పుడే నిర్మాతలకు ఉపయోగం. అందుకే... ఓ రెండుమూడు హిట్లు పడాలి. నాకంటూ ఓ మంచి బిజినెస్ క్రియేటవ్వాలి. అప్పుడు నేనే.. స్వయంగా వెళ్లి అన్నయ్యను అడుగుతాను.
*** సొంత ప్రొడక్షన్ ‘వైష్ణో’ ఉందిగా? మీ చిత్రాలు వేరెవారెందుకు తీయాలి?
నా 143, బంపర్ ఆఫర్ చిత్రాలను అన్నయ్య ‘వైష్ణో’లోనే నిర్మించారు. మళ్లీ అలాంటి ప్రయత్నమే చేయమని అడగలేను. ఎందుకంటే... మధ్యలో మేం కొన్ని ఆర్ధిక బాధల్ని ఎదుర్కోవలసి వచ్చింది. పైగా అన్నయ్య ప్రస్తుతం మా ‘వైష్ణో’లోనే నితిన్తో సినిమా చేస్తున్నారుగా.
*** అన్ని అర్హతలూ ఉన్నా... అనుకున్నస్థాయికి ఎందుకు చేరలేకపోయారు?
ఇక్కడ అర్హతలు కాదు ముఖ్యం. టైమ్ ముఖ్యం. అది మనదైతే... మనల్ని ఎవ్వరూ ఆపలేరు. దానికోసమే నా ఎదురుచూపులు.
*** దర్శకత్వ శాఖలో పనిచేశారు కదా. మరి ఆ దిశగా వెళ్లే ఆలోచన ఉందా?
తప్పకుండా చేస్తాను. అయితే... దానిక్కూడా ముందు నేను హీరోగా సక్సెస్ అవ్వాలి. నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి. అప్పుడే డెరైక్షన్ చేస్తా. పరుల డబ్బుతో నేను డెరైక్షన్ చేయలేను. నా డబ్బుతోనే చేస్తా. అప్పుడు పోయేది నా డబ్బే కదా.
*** అసలు హీరో అవ్వాలనే ఆలోచన మీదా? మీ అన్నయ్యదా?
ఇద్దరిదీ కాదు. మా నాన్నది. నన్ను హీరోగా చూడాలనేది ఆయన చిరకాల కోరిక. అందుకే అన్నయ్య నన్ను హీరోని చేశారు.
*** పర్సనల్గా మీకు నటనంటే ఇష్టమా? లేక డెరైక్షనా?
నేను స్ట్రగుల్ అనుభవిస్తుంది నటునిగా. సో.. నా దృష్టి నటనపైనే.